శివ కందుకూరి హీరోగా ప్రమోద్ హర్ష దర్శకత్వంలో రాధా వి పాపుడిప్పు నిర్మించిన చిత్రం ‘చాయ్ వాలా’. రాజీవ్ కనకాల, రాజ్‌కుమార్ కసిరెడ్డి, చైతన్య కృష్ణ, వడ్లమాని శ్రీనివాస్ ముఖ్య పాత్రల్ని పోషించారు. ఫిబ్రవరి 6న విడుదల కానుంది. శుక్రవారం ప్రసాద్ ల్యాబ్స్‌లో టైటిల్ సాంగ్‌ను లాంచ్ చేశారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్, నీలోఫర్ ఫౌండర్ బాబురావు, కిమ్స్ ఎండీ రవి కిరణ్ వర్మ ముఖ్య అతిథులుగా హాజరై సాంగ్‌ను లాంచ్ చేశారు. ‘చాయ్ వాలా’ టైటిల్ సాంగ్ బాగుందని, ప్రతి ఒక్కరూ ఈ సినిమాను పెద్ద సక్సెస్ చేయాలని అతిథులు కోరారు.
ఈ సందర్భంగా శివ కందుకూరి మాట్లాడుతూ ‘తెలుగు వారికి చాయ్ అంటే ఓ ఎమోషన్. ఈ చిత్రంలోని ఎమోషన్ కూడా అందరినీ కట్టి పడేస్తుంది. సిగ్గు, భయం వల్ల ఇంట్లో చేయని సంభాషణను, బయటకు చూపించలేని ఎమోషన్‌ను ఇందులో చూపించాం. అది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది’ అని చెప్పాడు. ఈ సినిమా విజయం పట్ల కాన్ఫిడెంట్‌గా ఉన్నానని దర్శకుడు ప్రమోద్ హర్ష అన్నాడు. ఇందులోని ఫాదర్ అండ్ సన్ ఎమోషన్‌కు అందరూ కనెక్ట్ అవుతారని రాజ్ కందుకూరి అన్నారు. నటుడు రాజీవ్ కనకాల, మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ ఆర్ విహారి, లిరిసిస్ట్ సురేష్ బనిసెట్టి సహా టీమ్ అంతా పాల్గొన్నారు.
