ఏటా 2 వేల మంది విద్యార్థినులకు ఎంట్రప్రెన్యూర్‌‌‌‌‌‌‌‌షిప్ శిక్షణ .. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీతో వీహబ్ ఒప్పందం

ఏటా 2 వేల మంది విద్యార్థినులకు ఎంట్రప్రెన్యూర్‌‌‌‌‌‌‌‌షిప్ శిక్షణ .. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీతో వీహబ్ ఒప్పందం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వర్సిటీల్లో చదువుతున్న యువతులను ‘వీ ఎనేబుల్’ ప్రోగ్రామ్​ ద్వారా ఎంట్రప్రెన్యూర్లుగా తీర్చిదిద్దేందుకు అంబేద్కర్​ ఓపెన్​వర్సిటీతో వీహబ్​ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద ఏటా 2 వేల మందికి కెరీర్​ గైడెన్స్, పరిశ్రమలకు అనుగుణంగా నైపుణ్యాలు, లైవ్​ ప్రాజెక్ట్స్​, ఇంటర్న్​షిప్స్​, ఆవిష్కరణలపై శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ మూడు దశలుగా ఆరు నెలల పాటు నిర్వహిస్తారు. విద్యార్థినుల్లో విశ్వాసాన్ని పెంచేలా డిస్కవరీ (ఆవిష్కరణ), లర్నింగ్​(నేర్చుకోవడం), ఇమ్మర్షన్​(ప్రాజెక్ట్​లో లీనమవడం) వంటి అంశాలపై ట్రైనింగ్​ఇవ్వనున్నారు. 

ఈ మేరకు శుక్రవారం ఓపెన్​ వర్సిటీ వీసీ  ​ఘంటా చక్రపాణి ఆధ్వర్యంలో వీహబ్​ సీఈవో సీతా పళచోళ్ల ఒప్పందంపై సంతకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీత.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళల్లో సాధికారత పెంచడం కోసం వీహబ్​ నిరంతరం పనిచేస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థినులు, స్టార్టప్​ఫౌండర్లు, క్షేత్ర స్థాయిలోని ఎంట్రప్రెన్యూర్లను గుర్తించి మెరుగుపరుస్తామన్నారు. మెప్మా, సెర్ప్, జిల్లా కలెక్టర్ల సహకారంతో పల్లెల్లో వీ ఎనేబుల్​కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.విద్యార్థినుల్లో పోటీతత్వం, నైపుణ్యాలను పెంచేందుకు వీహబ్​తో చేసుకున్న ఒప్పందం ఎంతగానో దోహదపడుతుందని ఘంటా చక్రపాణి పేర్కొన్నారు.