
నేడు సొంతూరికి వీరయ్య
వెలుగు: బ్రోకర్ల మాయమాటలు నమ్మి దుబాయ్ వెళ్లి ఒంటెల యజమాని వద్ద బందీఅయిన వీరయ్య స్వగ్రామానికి రానున్నారు. సోషల్ మీడియా ద్వారా పంపిన తన కష్టాల వీడియో రాష్ట్రంలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మక్తపల్లి గ్రామానికి చెందిన వీరయ్య రెండేళ్ల కిందట ఓ బ్రోకర్ ద్వారా సౌదీలో ఒంటెలు, గొర్రెలు మేపేందుకు పనికి కుదిరాడు. తల్లి చనిపోయిందని తనను ఇండియాకు పంపించాలని కోరినప్పటికీ ఒంటెలను మేపాలని బెదిరించి యజమాని వీరయ్యను బందీ చేశాడు. దీంతో అతను తన కష్టాల్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. అది ఇక్కడ వైరల్ అయింది. దీంతో ఇండియన్ ఎంబసీ ఆఫీసర్లు స్పందించి అతన్ని స్వదేశానికి పంపించే ఏర్పాటు చేసి టికెట్ కూడా కొనిచ్చారు. బుధవారం ఢిల్లీకి చేరుకున్నట్లు సమాచారం అందించాడని వీరయ్య కుమారుడు హరీశ్ తెలిపాడు. గురువారం సాయంత్రం కల్లా స్వగ్రామానికి వస్తున్నట్లు తెలిపారు.