పాలమూరు ఎత్తిపోతలపై బీఆర్ఎస్ ప్రభుత్వానివి ప్రగల్భాలే : వీర్లపల్లి శంకర్

పాలమూరు ఎత్తిపోతలపై బీఆర్ఎస్ ప్రభుత్వానివి ప్రగల్భాలే : వీర్లపల్లి శంకర్
  • లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ఊసే లేదు
  •  నియోజకవర్గంలో తాగు, సాగు నీటికి కటకట
  • డబుల్ ఇండ్లపై సమగ్ర విచారణ చేయించాలి 
  • అసెంబ్లీలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్ నగర్,వెలుగు : పాలమూరు ఎత్తిపోతల పథకం 80 శాతం పూర్తయిందని గత ప్రభుత్వం ప్రగల్భాలు పలికిందని, ఆచరణలో చూపలేకపోయిందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విమర్శించారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ ఊసే లేదని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ పాలమూరు వలసల జిల్లా అని, అందుకే ఎత్తిపోతల పథకం చేపట్టినట్లు మాజీ సీఎం కేసీఆర్ చెప్పి, ఆచరణలో విఫలమయ్యారని విమర్శించారు.

షాద్ నగర్ ప్రాంతం ఒక ఎత్తైన ప్రదేశమని భూగర్భ జలాలపై ఆధారపడి ఇక్కడి ప్రజలు జీవిస్తున్నారని, తాగు, సాగు నీరు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సభ దృష్టికి తెచ్చారు. నియోజకవర్గంలో తాగు, సాగు నీటి సమస్య విపరీతంగా ఉందన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు అందాల్సి ఉండగా గత ప్రభుత్వం నాసిరకం పనులు చేసి సరైన నీటి వసతి కల్పించలేదని గుర్తుచేశారు.  విద్యాపరంగా నియోజకవర్గాన్ని నిర్వీర్యం చేశారని, పాఠశాలలో కనీస సదుపాయాలు కల్పించలేదన్నారు.  

గత ప్రభుత్వం    నాణ్యత లేకుండా నాసిరకంగా డబుల్ ఇండ్లను నిర్మించడంతో  నిర్మాణాల్లో పగుళ్లు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఆ ప్రభుత్వం చేసిన తప్పిదాలపై సమగ్ర విచారణ జరిపి నియోజకవర్గానికి న్యాయం చేయాలని ఆయన కోరారు. అదేవిధంగా అసెంబ్లీలో బీసీ కులగణన తీర్మానం సభ ఆమోదం తెలపడంతో ఎమ్మెల్యే  శంకర్ హర్షం వ్యక్తం చేశారు.