కార్ల మీద కూరగాయల తోట

కార్ల మీద కూరగాయల తోట

టెర్రస్, బాల్కనీల్లో గార్డెనింగ్​ చేయడం, కూరగాయల మొక్కల్ని పెంచడం తెలిసిందే. కానీ, కార్ల రూఫ్​ మీద కూడా వెజిటబుల్స్​ పెంచుతున్నాయి థాయి​లాండ్​ క్యాబ్​ కంపెనీలు. రోడ్ల మీద తిరగాల్సిన కార్ల మీద ‘మినియేచర్​ గార్డెన్​’ ఎందుకు పెంచుతున్నారో తెలుసా...

కరోనా టైం మొదలైనప్పటి నుంచి మన దగ్గరే కాదు అంతటా క్యాబ్​ల జోరు తగ్గింది. పొద్దంతా తిరిగినా ఒక్క సవారీ కూడా దొరకడం లేదు. దాంతో, చాలా క్యాబ్​ కంపెనీలది డ్రైవర్లకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. మరికొన్నేమో బ్యాంకు లోన్లు కట్టలేని సిచ్యుయేషన్​లో ఉన్నాయి. థాయి​లాండ్​లో ‘రత్​చప్రక్’​, ‘బొవొర్న్’​ అని ట్యాక్సీ కంపెనీలు ఉన్నాయి. ఈ రెండూ ట్యాక్సీ కంపెనీలకి మూడు వేల క్యాబ్​లున్నాయి. లాక్​డౌన్​ ఎత్తేశాక వీటిలో ఐదొందల క్యాబ్స్ మాత్రమే రోడ్డెక్కాయి. మిగతా కార్లన్నీ పార్కింగ్​లాట్​లోనే ఉండిపోయాయి. అలా ఊరికే పడి ఉన్న ఆ కార్ల మీద ‘మినియేచర్​ గార్డెన్​’ పెంచితే కూరగాయల ఖర్చులు మిగులుతాయనే ఐడియా వచ్చింది వాళ్లకి.  

కార్ల రూఫ్​ మీద, బ్యానెట్​​ మీద వెదురు కర్రల్ని డబ్బా షేప్​లో పేర్చారు. దాని మీద చెత్త సేకరించే  నల్లని ప్లాస్టిక్​ బ్యాగులు వేశారు. వాటి మీద మట్టి చల్లి, టొమాటో, దోసకాయ, బీన్స్​ వంటి కూరగాయల మొక్కల్ని పెంచుతున్నారు. అలా పెంచిన వెజిటబుల్స్​ స్టాఫ్​కి ఇస్తున్నారు. 

స్టాఫ్​కి సాయం చేసేందుకు
“ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోకుంటే మేం మరింత కష్టాల్లో పడతాం. ట్యాక్సీ–టాప్​ గార్డెన్​తో ప్రభుత్వ తీరుపై నిరసన తెలియజేయడమే కాకుండా ఈ కష్టకాలంలో మా స్టాఫ్​కి సాయం చేస్తున్నాం. ఈ గార్డెనింగ్​ చేయడం మాకు వేరే రాబడి కోసం మాత్రం కాదు. థాయిలాండ్​లో గతంలో రాజకీయంగా ఎన్నో మార్పులు వచ్చి ఎకానమీ దెబ్బతింది.  2011లో భారీ వరదలు వచ్చాయి. కానీ, ఎప్పుడూ మా బిజినెస్​ ఇంతలా  దెబ్బతినలేదు. కరోనా మాత్రం పెద్ద దెబ్బ కొట్టింది ” అన్నాడు రత్​చప్రక్ ఎగ్జిక్యూటివ్​ థపకొర్న్​.