కూరగాయలు మస్తు పిరం.. ఏది కొనాలన్నా కిలో రూ.80 నుంచి రూ.100

 కూరగాయలు మస్తు పిరం.. ఏది కొనాలన్నా కిలో రూ.80 నుంచి రూ.100

 

  • ఏది కొనాలన్నా కిలో రూ.80 నుంచి రూ.100
  • మండుతున్న బీర, బెండ, టమాటా, చిక్కుడు, వంకాయ రేట్లు
  • మొంథా తుఫాన్ ఎఫెక్ట్​తో దెబ్బతిన్న కూరగాయల తోటలు 

హైదరాబాద్, వెలుగు:  మార్కెట్లో కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. రైతు బజార్లు, హోల్​సేల్​ మార్కెట్​లో కిలో కూరగాయల ధరలు రూ.45 నుంచి 60 పలికితే రిటైల్​ మార్కెట్​లో రూ.80 నుంచి100 వరకు ఉన్నాయి. ఇక సూపర్​ మార్కెట్​లు, హైపర్​ మార్కెట్లలో మరింత ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఆకుకూరల ధరలు సైతం అందుబాటులో లేవు. తోటకూర కిలో రూ.90 వరకు ఉంటే పాలకూర కిలో రూ.160 వరకు అమ్ముతున్నారు.  కొత్తిమీర నిన్న మొన్నటి వరకు రూ.20కి నాలుగైదు కట్టలు ఇవ్వగా.. ప్రస్తుతం ఆ రేటు రెండింతలు అయింది. మార్కెట్​లో ఏ కూరగాయ కొనా లన్నా పావు కిలో రూ.20 నుంచి 25 అంటున్నారు. ధరలు భారీగా పెరగడంతో కిలోల చొప్పున కొనే పరిస్థితి లేక జనం అర కిలో, పావు కిలోతో 
సరిపెట్టుకుంటున్నారు. 

కూరగాయల రాక తగ్గింది  

హైదరాబాద్​లోని బోయిన్​పల్లి మార్కెట్​కు ఆదివారం 40 వేల క్వింటాళ్లలోపు కూరగాయలే వచ్చాయని, సాధారణంగా దీనికి రెండు  రెట్లు వస్తే కానీ సరిపోయే పరిస్థితి ఉండదని మార్కెట్​ వర్గాలు చెబుతున్నాయి. వచ్చిన కూరగాయల్లోనూ బెండ, బీర, చిక్కుడు, పచ్చిమిర్చి, టమాట, కాకర, ఆకు కూరలు వంటి డిమాండ్​ ఉన్న 
వెజి​టబుల్స్​ తక్కువగా వచ్చాయని తెలిపాయి. ఆలుగడ్డ, క్యారెట్​ లాంటివి అధికంగా వచ్చినా వాటికి పెద్దగా గిరాకీ ఉండదని పేర్కొన్నాయి. 
మార్కెట్​లో బీర, బెండ, కాకర, క్యాప్సికం, టమాటా, చిక్కుడు, వంకాయ.. ఇలా అన్నింటి ధరలు రెండు నెలలతో పోలిస్తే రెట్టింపయ్యాయి. దొండ, క్యారెట్, గోరుచిక్కుడు, చిక్కుడు, వంకాయ రేట్లు కేజీ వంద దాటేశాయి. క్యాబేజీ, కాలీఫ్లవర్, కీరదోస ధరలు కాస్త అందుబాటులో ఉన్నాయని వినియోగదారులు చెబుతున్నారు. 

తుఫాన్​తో  దెబ్బతిన్న తోటలు

ఇటీవల మొంథా తుఫాన్​ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయల పంటలు భారీగా దెబ్బతిన్నాయి. సుమారు  1,300 ఎకరాల్లోని కూరగాయల పంటలు పూర్తిగా నేలమట్టమయ్యాయని అధికారులు చెబుతున్నారు. వందలాది ఎకరాల్లోని టమాటా, బీర, దోసకాయ తోటలపై ఎఫెక్ట్​ పడిందన్నారు. మొంథా తుఫాన్​ ఎఫెక్ట్​ మన రాష్ట్రంలోని పంటలతోపాటు ఇక్కడికి కూరగాయలు సరఫరా చేసే ఆంధ్రప్రదేశ్​లోనూ పడింది. దీంతో రాష్ట్రానికి వచ్చే కూరగాయల లోడ్లు గణనీయంగా తగ్గాయి. రాష్ట్ర ప్రజల అవసరాలకు యేటా 41.75 లక్షల టన్నుల  కూరగాయలు అవసరం కాగా మన దగ్గర కేవలం 23.46 లక్షల టన్నులు కూరగాయలే పండుతున్నాయి. మిగతా మొత్తం పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ఈ సారి దిగుమతి తగ్గడంతో రేట్లు  భగ్గుమంటున్నాయి. రూ.500 పట్టుకుపోతే సగం సంచి కూడా నిండడం లేదని మహిళలు వాపోతున్నారు. పచ్చిమిర్చి కిలో రూ.100కు విక్రయిస్తున్నారని, మార్కెట్​కు వెళ్లాలంటేనే  భయమేస్తున్నదని చెబుతున్నారు.