తెలంగాణలో కూరగాయల రేట్లు తగ్గుతయ్!

తెలంగాణలో కూరగాయల రేట్లు తగ్గుతయ్!
  • కొద్ది రోజుల్లో మార్కెట్ కు రానున్న పంటలు 
  • డిమాండ్ కు సరిపడా వస్తే ధరలు తగ్గే చాన్స్  
  • వివిధ జిల్లాల్లో వేలాది ఎకరాల్లో సాగు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇటీవల కురిసిన వానలతో వచ్చే నెల నుంచి కూరగాయలు మార్కెట్ కు రానున్నాయి. ప్రస్తుతం పంటలు కాపు దశలో ఉన్నాయని, ఈ వర్షాలతో వచ్చే నెల నుంచి పంటలు చేతికొస్తాయని రైతులు చెబుతున్నారు. ఎండాకాలంలో వర్షాలు కురవడంతో అప్పట్లో సాగు చేసిన పంటలన్నీ పాడైపోయాయి. ఇక వానాకాలంలో సకాలంలో వర్షాలు పడకపోవడంతో ఖరీఫ్ సీజన్ ఆలస్యమైంది. దీంతో కూరగాయల సరఫరా తగ్గి, రేట్లు భారీగా పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్ లో అన్ని కూరగాయలు, ఆకుకూరల ధరలు మండిపోతున్నాయి. నిజానికి వర్షాలు సకాలంలో పడి ఉంటే, ఈపాటికి కూరగాయలు పుష్కలంగా మార్కెట్ కు వచ్చేవి. కానీ వర్షాలు లేక పంటల సాగు ఆలస్యం కావడంతో పంటలు ఇప్పుడిప్పుడే కాపుకొస్తున్నాయి. వారం రోజుల్లో ఆకుకూరలు, వచ్చే నెల మొదటి వారం నుంచి కూరగాయలు కూడా మార్కెట్ కు వస్తాయని అధికారులు చెబుతున్నారు. అప్పుడు రేట్లు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. 

వేలాది ఎకరాల్లో సాగు.. 

రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో వేలాది ఎకరాల్లో ఇప్పటికే కూరగాయలు సాగు చేశారు. ఇప్పుడీ పంటలన్నీ చేతికి రానున్నాయి. రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల్లో దాదాపు 10 వేల ఎకరాల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేశారు. అయితే వర్షాలు ఆలస్యం కావడంతో ఇంకా చాలా మంది రైతులు పంటలు సాగు చేయలేదు. వర్షాలు పడుతుండడంతో రంగారెడ్డిలో మరో 15 వేల ఎకరాలు, మేడ్చల్–మల్కాజిగిరిలో 8 నుంచి 10 వేల ఎకరాలు, వికారాబాద్ లో 10 నుంచి 12 వేల ఎకరాల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మూడు జిల్లాల్లో కలిపి ఖరీఫ్ సీజన్ లో మొత్తం 40 వేల నుంచి 50 వేల ఎకరాల్లో పంటలు సాగవుతాయని చెబుతున్నారు.
 
తగ్గిన సరఫరా.. 

రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్ కు సరిపడా కూరగాయలు సరఫరా కావడం లేదు. హైదరాబాద్ లోని  ఆర్కేపురం, ఫలక్​నుమా, అల్వాల్, ఎల్లమ్మబండ, మెహిదీపట్నం, వనస్థలిపురం, కూకట్​పల్లి, సరూర్​నగర్, ఎర్రగడ్డలో రైతుబజార్లు ఉన్నాయి. అన్నిచోట్ల రోజూ దాదాపు 600 నుంచి 800 టన్నుల కూరగాయలు అమ్ముతుంటారు. కానీ ప్రస్తుతం 500 టన్నుల వరకే వెజిటేబుల్స్ మార్కెట్లకు వస్తున్నాయి. ఆకుకూరలు అయితే ఏకంగా 50 శాతం వరకు తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. సిటీలోని హోల్ సేల్ మార్కెట్లు, రైతుబజార్లు, బయట మార్కెట్లలో కలిపి ఆకుకూరలకు రోజూ దాదాపు 150 టన్నుల వరకు డిమాండ్ ఉంది. సాధారణ రోజుల్లో ఇంత మొత్తం సరఫరా అయినప్పటికీ, ప్రస్తుతం 80 టన్నుల వరకు మాత్రమే వస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. నగరానికి ఎక్కువగా రంగారెడ్డి, మేడ్చల్‌, చేవెళ్ల, వికారాబాద్‌, శంకర్‌పల్లి, సిద్దిపేట, గజ్వేల్‌ తదితర ప్రాంతాల నుంచి కూరగాయల వస్తుంటాయి. 

ఈ వానలు మంచిదే.. 

ఇప్పటివరకు పడిన వర్షం తీవ్రత తక్కువగానే ఉంది. ఈ వర్షాలతో పంటలకు లాభమే కానీ నష్టం లేదు. ఇంకా వర్షాలు ఎక్కువగా పడితే మాత్రం తరిపొలాల్లోని కూరగాయలు దెబ్బతింటాయి. నేను మూడెకరాల్లో కూరగాయలు పండిస్తున్న. టమాట, వంకాయ, బీరకాయ తదితర సాగు చేస్తున్న. ఇప్పుడు కాపు దశలో ఉన్నాయి. వచ్చే నెల నుంచి పంట చేతికొస్తుంది. 

- భీమ్ రెడ్డి, గడ్డమల్లయ్య గూడెం,  యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా   

కూరగాయల సాగుపై  దృష్టి పెట్టినం.. 

కూరగాయలు, ఆకుకూరల సాగుపై రైతుల్లో అవగాహన కల్పిస్తున్నం. సాగు చేసే రైతులకు సబ్సిడీ అందిస్తున్నం. ప్రస్తుతం జిల్లాలో 4వేల ఎకరాల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నారు. ఇప్పుడు వానలు పడటంతో మరో 15 వేల ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే సాగు చేసిన కూరగాయలు 20 రోజుల్లో మార్కెట్ కు వస్తాయి. ఆకుకూరలు వారంలో పుష్కలంగా వస్తాయి. 

- సునంద, హార్టికల్చర్ అధికారి, రంగారెడ్డి జిల్లా