భారత్ జోడో యాత్రకు ఫండ్ పేరుతో వసూళ్లు.. !

భారత్ జోడో యాత్రకు ఫండ్ పేరుతో వసూళ్లు.. !

కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఉత్సాహంగా సాగుతోంది.  అయితే ఈ జోడో యాత్రకు కాంగ్రెస్ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ కొందరు వాపోతున్నారు. భారత్ జోడో యాత్రకు ఫండ్ పేరుతో తమను డబ్బు చెల్లించాలని కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఖచ్చితంగా రూ.2000 లు ఇవ్వాల్సిందేనంటూ బలవంతం చేస్తున్నారన్నారు. తాను రూ.500 లు ఇస్తే.. రూ.2000 లు ఇవ్వాలని డిమాండ్ చేశారని ఓ దుకాణ యజమాని చెప్పుకొచ్చారు. ఆ కోపంలో కూరగాయల బరువు తూచే యంత్రాన్ని(వెయింగ్ మెషిన్) ధ్వంసం చేశారని, కూరగాయలన్నీ పారబోశారని ఆరోపించారు. ఈ విధంగా వస్తున్న ఆరోపణలపై ఇప్పటివరకూ ఏ కాంగ్రెస్ నేతా స్పందించలేదు. కానీ దీనికి సంబంధించిన ఫొటోలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విధంగా వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురు పార్టీ నేతలను కేరళ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకరన్.. సస్పెండ్ చేశారు. 

కేరళలో కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. నిన్న యాత్రకు బ్రేక్ ఇచ్చిన కాంగ్రెస్.. ఇవాళ ఉదయం 7 గంటలకు పాదయాత్రను ప్రారంభించింది. కేరళలోని కొల్లాం జిల్లాలో ఎనిమిదోరోజు రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభమైంది. కేరళలో మొత్తం 19 రోజులు రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. ఈ యాత్ర పూర్తయ్యాక రాహుల్ గాంధీ గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు మరో యాత్ర సాగుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తెలిపారు.