వానలకు దెబ్బతిన్న పంటలు: మండుతున్న కూరగాయల ధరలు

వానలకు దెబ్బతిన్న పంటలు: మండుతున్న కూరగాయల ధరలు

వానలకు దెబ్బతిన్న పంటలు

వర్షాలతో రవాణాకు అడ్డంకులు 

మన సౌత్​లో మండుతున్న ధరలు

కూరగాయలు కొనలేకున్నరు

న్యూఢిల్లీ : కూరగాయల ధరలు కాక పుట్టిస్తున్నాయి. దక్షిణ, పశ్చిమ భారతంలో గత వారం నుంచి కూరగాయల ధరలు 25 శాతం నుంచి 40 శాతం వరకు పెరిగినట్టు తెలిసింది. ముంచెత్తుతోన్న వర్షాలకు కూరగాయల తోటలు దెబ్బతిని, ట్రాన్స్‌‌పోర్టేషన్‌‌కు తీవ్ర​అంతరాయం ఏర్పడింది. దీంతో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి.  ముంబై, బెల్గావ్‌‌, ఇండోర్‌‌‌‌ మార్కెట్‌‌లలో కూరగాయల ధరలు వచ్చే రెండు నెలల వరకు అత్యధికంగానే ఉండనున్నాయని అక్కడి ట్రేడర్లు చెబుతున్నారు. ఉత్తర భారతంలో మాత్రమే కూరగాయల ధరలు నార్మల్‌‌గా ఉన్నాయి.  సొరకాయ, క్యాబేజీ, బీన్స్, క్యాప్సికమ్, కారెట్ల ధరలు ఈ వర్షాలకు బాగా పెరిగినట్టు వశి అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ ప్రెసిడెంట్ కైలాష్ తాన్జే చెప్పారు. గత ఎనిమిది రోజుల్లో కూడా సాధారణ రోజుల్లో అమ్మే ధర కంటే 25 శాతం నుంచి 50 శాతం ఎక్కువ ధరకే ఈ కూరగాయలను అమ్మినట్టు పేర్కొన్నారు.

వశి మండీలో ఈ నెల ఫస్ట్ నుంచి ధరలు 25 శాతం పెరిగాయని, సొరకూర కేజీ రూ.40లని, ఫ్రెంచ్ బీన్స్ కేజీ రూ.80గా పలుకుతోందన్నారు. క్యాబేజీ ధరలు కూడా 40 శాతం పెరిగాయన్నారు. గోరు చిక్కుడుకాయ ధర 50 శాతం పెరిగి రూ.90గా పలుకుతుందని తాన్జే చెప్పారు. ముంబై వశి మండీకి  కేవలం 300 ట్రక్‌‌లు మాత్రమే వస్తున్నాయని, గతేడాది ఈ సమయంలో 700 నుంచి 800 ట్రక్‌‌ల వరకు కూరగాయలు వచ్చాయని తెలిపారు. గుజరాత్, మధ్య ప్రదేశ్, తెలంగాణ, కర్నాటకల నుంచి కూరగాయలు రావడం తగ్గిపోయిందని పేర్కొన్నారు. గత కొన్ని రోజుల నుంచి కర్నాటక, మహారాష్ట్ర, కేరళలలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. సాధారణం కంటే 39 శాతం అధికంగా ఆగస్ట్‌‌లో వర్షపాతం నమోదైంది. జూలైలో మాత్రం వర్షపాతం 2 శాతం తక్కువగా, జూన్‌‌లో 33 శాతం తక్కువగా ఉంది. జూన్ నెలలో ఆహారోత్పత్తుల హోల్‌‌సేల్ ద్రవ్యోల్బణం 6.98 శాతం ఉంది.

కర్ణాటకలోనూ ధరల దడ

మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్,గోవాలలో కూరగాయల సరఫరాకు మేజర్‌‌‌‌ హబ్‌‌గా ఉన్న కర్నాటకలోని బెల్గావ్‌‌ మండీలో కూడా ధరలు పెరిగాయి. ఈ వానలకు రైతులు తమ పంట్లను పండించలేకపోతున్నారని, దీంతో ఉత్పత్తి తగ్గిపోయి, ధరలు పెరిగాయని బెల్గం మార్కెట్‌‌లోని శివానంద్ ట్రేడర్స్‌‌కు చెందిన శివానంద్ శిరంగోకర్ చెప్పారు. క్యాబేజీ, టోమాటో ధరలు 50 శాతం పెరిగి కేజీ రూ.25లుగా, రూ.40లుగా ఉన్నాయి. తమిళనాడు, కేరళ, కర్నాటకల్లో వినియోగదారులు ఉల్లిగడ్డలు, టోమాటోలకు ఎక్కువ ధరలు చెల్లించాల్సి వస్తోంది. పంటలు వరదలకు కొట్టుకుని పోయాయని, మరోసారి పంటలు పండించడానికి రైతులు చూస్తున్నారని శిరంగోకర్ చెప్పారు. వానలకు జాతీయ రహదారులు కూడా బ్లాక్ అయినట్టు తెలిపారు. మండీ నుంచి ట్రాన్స్‌‌పోర్టేషన్ లేదని చెప్పారు.