హైదరాబాద్​లో 5 కిలోల గోల్డ్ సీజ్

హైదరాబాద్​లో 5 కిలోల గోల్డ్ సీజ్
  • నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

కూకట్​పల్లి/సికింద్రాబాద్, వెలుగు: ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా వాహనాల తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.  హైదరాబాద్ లోనే 5 కిలోల గోల్డ్, 3 కిలోల వెండి పట్టుబడింది. మంగళవారం రాత్రి  కేపీహెచ్​బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీఎన్ఆర్ ఎంపైర్ బిల్డింగ్ ఎదురుగా ముంబై హైవేపై పోలీసులు  తనిఖీలు నిర్వహించారు. మియాపూర్​నుంచి కూకట్ పల్లి వైపు వెళ్తున్న కారును ఆపి సెర్చ్ చేయగా..అందులో అక్రమంగా తరలిస్తున్న  3.193 కిలోల గోల్డ్, 3.569 కిలోల వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. ఎటువంటి ఆధారాలు, డాక్యుమెంట్స్​ చూపకపోవటంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న నాచారానికి చెందిన మహ్మద్ ఇమ్రాన్​(27), కుత్బుల్లాపూర్​కు చెందిన బీరేంద్ర​సింగ్​(54), ఉప్పల్​కు చెందిన విజయ్​కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సికింద్రాబాద్​లో 2 కిలోలు..

సికింద్రాబాద్ ఆర్పీ రోడ్ లోని స్వప్న లోక్ కాంప్లెక్స్ వద్ద పోలీసులు నిర్వహించిన  తనిఖీల్లో 2 కిలోల బంగారు బిస్కెట్లు పట్టుబడ్డాయి. పోలీసులు మంగళవారం స్వప్నలోక్​ కాంప్లెక్సు వద్ద తనిఖీ చేపట్టారు. ఓ వాహనాన్ని చెక్​చేయగా అందులో  20 బంగారు బిస్కట్లు(2 కిలోలు) ఉన్నాయి. వెహికల్​లో ఉన్న శ్రీకాంత్ అనే వ్యక్తి వద్ద బంగారానికి సంబంధించిన సరైన రశీదులు  లేకపోవడంతో వాటిని సీజ్ చేశారు. పట్టుబడిన గోల్డ్ ను సనత్​నగర్​ రిటర్నింగ్ అధికారికి అప్పగించనున్నట్లు డీసీపీ చందనా దీప్తి పేర్కొన్నారు. 

బాచుపల్లిలో రూ.2 కోట్ల విలువైన చీరలు పట్టివేత

జీడిమెట్ల, వెలుగు: హైదరాబాద్ బాచుపల్లిలోని పంచవటి అపార్ట్​మెంట్ లో రూ.2కోట్ల  విలువైన చీరలు పట్టుబడ్డాయి. అక్రమంగా పెద్ద ఎత్తున చీరలు డంపింగ్​ చేస్తున్నారని ఫ్లైయింగ్​ స్వ్కాడ్​కి సమాచారం అందింది. అప్రమత్తమైన పోలీసులు.. ఫైయింగ్​ స్వ్కాడ్​తో కలిసి అపార్ట్​ మెంట్ వద్దకు వెళ్లారు.  అక్కడ రెండు లారీల్లో ఉన్న చీరలను పట్టుకున్నారు. సరైన ఆధారాలు లేకపోవడంతో వాటిని సీజ్ చేశారు. అపార్ట్​మెంట్​లోని బ్లాక్​ 7డీ డబుల్​ బెడ్​రూమ్​ నుంచి 400 బ్యాగులు, అసోసియేషన్ ఆఫీసు గది నుంచి 343 బ్యాగులు మొత్తం 743 బ్యాగులు సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న  చీరల విలువ రూ.2.25 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా ఓటర్లకు పంచేందుకే ఈ చీరలను తీసుకెళ్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి,  దర్యాప్తు జరుపుతున్నారు.