- రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి షురూ
- ఉదయం వెహికల్ కొంటే సాయంత్రానికి రిజిస్ట్రేషన్
- ఇకపై ఆర్సీ కోసం ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు
- ప్రస్తుతానికి టూ వీలర్లు, కార్లకు మాత్రమే ఈ విధానం అమలు
- పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు, గూడ్స్ వెహికల్స్‌కు ఇది వర్తించదు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి షో రూమ్‌లలోనే వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. వెహికల్ కొన్న షో రూమ్ లోనే శుక్రవారం ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియ పనితీరును పరిశీలించగా.. శనివారం నుంచి అన్ని జిల్లాల్లోని షోరూమ్‌లలో అధికారికంగా ప్రారంభించారు. దీంతో ఆర్టీఏలో పౌర సేవలు మరింత పారదర్శకంగా అమలు కానున్నాయి. ఈ విధానంతో ఇక నుంచి రాష్ట్రంలో ఏ మూలన ఉన్న షో రూంలో అయినా వెహికల్‌ను కొన్నా.. అక్కడే రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లపై ఆ వాహన యజమాని సంతకాలు చేస్తే సరిపోతుంది. వాటిని షో రూమ్ యజమాని తమ సమీపంలోని ఆర్టీఏ ఆఫీసుకు పంపిస్తారు. అధికారులు వాటిని పరిశీలించి ఆమోదిస్తారు. ఆ తర్వాత ఆ డాక్యుమెంట్లో ఉన్న వెహికల్ ఓనర్ ఇంటి అడ్రస్‌కు స్పీడ్ పోస్టు ద్వారా రిజిస్ట్రేషన్ కార్డు వెళ్తుంది. షో రూమ్‌లో ఉదయం వేళ వెహికల్‌ను కొనుగోలు చేస్తే సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్ అయ్యేలా ఆర్టీఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత వెహికల్ ను కొంటే మరుసటి రోజు రిజిస్ట్రేషన్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఆన్లైన్లోనే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 33 జిల్లాల ఆర్టీఏ అధికారులకు హైదరాబాద్ ఖైరతాబాద్ లోని ప్రధాన రవాణా శాఖ కార్యాలయం నుంచి అవగాహన కల్పించారు. ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి రావడానికి మరో 15 రోజులు పట్టవచ్చని, అప్పటి వరకు ఆఫ్‌లైన్ లోనే సేవలు అందుతాయని ఆర్టీఏ అధికారులు చెప్తున్నారు. కొత్త విధానంతో షో రూమ్ యజమానులకు కొంత వరకు పని ఒత్తిడి పెరిగినా.. కొత్త వాహనం కొన్న యజమానులకు మాత్రం ఈ విధానం ఎంతో సౌకర్యంగా ఉండనుంది.
ఇక ఇబ్బందులు ఉండవ్..
ఇక నుంచి కొత్త వెహికల్స్కొనే వారెవరైనా సరే రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లే ఇబ్బందులు తప్పనున్నాయి. ఇంతకు ముందు చాలా మంది రిజిస్ట్రేషన్ కోసం రోజుల తరబడి ఆర్టీఏ ఆఫీసుల చుట్టు తిరిగే పరిస్థితి కనిపించేది. కానీ షోరూమ్ ల నుంచే రిజిస్ట్రేషన్ విధానంతో సమయం ఆదా కానుంది. శనివారం నుంచి ఆర్టీఏ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ కోసం కొత్త వెహికల్స్ రావడం అనేది కనిపించకుండాపోయింది. ప్రస్తుతం ఈ విధానంతో ప్రైవేట్ టూ వీలర్లు, కార్లకు మాత్రమే షో రూమ్ లలో రిజిస్ట్రేషన్ చేయనున్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వెహికల్స్ కు, గూడ్స్ వాహనాలకు ఈ విధానం వర్తించదు. ఈ వాహన యజమానులు పాత పద్ధతిలోనే ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.
