‘చక్కాజామ్‌’తో మూడు రాష్ట్రాల్లో బండ్లు కదల్లే..

‘చక్కాజామ్‌’తో మూడు రాష్ట్రాల్లో బండ్లు కదల్లే..
  • మిగతా రాష్ట్రాల్లో అక్కడక్కడ ‘చక్కాజామ్‌’
  • రోడ్లపై భైఠాయించిన రైతులు.. ఎమర్జెన్సీ వెహికల్స్​కు మాత్రమే అనుమతి
  • ఢిల్లీలో భారీగా బందోబస్తు..
  • అక్టోబర్ 2 దాకా ప్రొటెస్టులు: రాకేశ్ తికాయత్

అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు శనివారం చేపట్టిన ‘చక్కా జామ్’  మూడు గంటలు కొనసాగింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో రైతులు ఎక్కడికక్కడ రోడ్లను బ్లాక్ చేశారు. మిగతా రాష్ట్రాల్లో అక్కడక్కడ ఓ మోస్తరుగా ఆందోళనలు కొనసాగాయి. రోడ్ల మధ్యలో ట్రాక్టర్లు, ఇతర వెహికల్స్​ఉంచారు. రైతుల ఆందోళనకు కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చింది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు పలు రాష్ట్రాల్లో నిరసనల్లో పాల్గొన్నాయి. రాష్ట్రంలోనూ పలు చోట్ల ఆందోళనలు కొనసాగాయి.

న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన ‘చక్కా జామ్’ దేశవ్యాప్తంగా మూడు గంటలు కొనసాగింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో రోడ్లను ఎక్కడికక్కడ బ్లాక్ చేయగా.. మిగతా రాష్ట్రాల్లో అక్కడక్కడ ఓ మోస్తరుగా ఆందోళనలు జరిగాయి. శనివారం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల దాకా నేషనల్, స్టేట్ హైవేలపై జాతీయ జెండాలు పట్టుకుని రైతులు బైఠాయించారు. రోడ్ల మధ్యలో ట్రాక్టర్లు, ఇతర వెహికల్స్​ను ఉంచారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనల పాటలను స్పీకర్లలో హోరెత్తించారు. అక్టోబర్ 2 దాకా ప్రొటెస్టులు కొనసాగిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ ప్రకటించారు.

ఉదయం నుంచే రోడ్లపైకి..

చక్కా జామ్​కు మద్దతుగా రైతులు శనివారం ఉదయం నుంచే రోడ్లపైకి చేరుకున్నారు. నేషనల్, స్టేట్ హైవేలపై కూర్చున్నారు. సాధారణ వెహికల్స్​ను మాత్రమే అడ్డుకున్న రైతు నేతలు.. అంబులెన్సులు, స్కూల్ బస్సులు, ఎమర్జెన్సీ వెహికల్స్ వెళ్లేందుకు దారిచ్చారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ మినహా దేశవ్యాప్తంగా రాస్తా రోకో జరిగింది. ఈ మూడు రాష్ట్రాల్లో రోడ్లను బ్లాక్ చేయొద్దని ఫార్మర్ యూనియన్లు ముందే నిర్ణయించాయి. ఢిల్లీ, హర్యానా బార్డర్​లో కుండ్లీ నుంచి పల్వాల్ వరకు హైవేను, పఠాన్​కోట్–జమ్మూకాశ్మీర్ ​హైవేను రైతులు బ్లాక్ చేశారు. ఇక పంజాబ్, హర్యానా బార్డర్​ను పూర్తిగా మూసేశారు. ఆయా రాష్ట్రాల లోపల కూడా పలు రూట్లను ముందుగానే క్లోజ్ చేశారు. ఎక్కడా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు పలు రాష్ట్రాల్లో నిరసనల్లో పాల్గొన్నాయి.

ఢిల్లీలో టైట్ సెక్యూరిటీ

రిపబ్లిక్ డే రోజున జరిగిన హింసను దృష్టిలో పెట్టుకుని.. ఢిల్లీలో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. సుమారు 50 వేల మంది పోలీసులు, పారామిలటరీ, రిజర్వు ఫోర్సులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలు ఉపయోగించి బార్డర్లు, ఇతర ప్రాంతాల్లో గట్టి నిఘా ఉంచారు. పుకార్లు వ్యాప్తి కాకుండా సోషల్ మీడియా కంటెంట్​ను కూడా పరిశీలించారు. ముందు జాగ్రత్తగా శనివారం ఉదయం నుంచి 10 మెట్రో స్టేషన్లను మూసేశారు. ఢిల్లీ బార్డర్లలోని సింఘు, ఘాజీపూర్, టిక్రిలో ఇంటర్నెట్​ను మళ్లీ బంద్ చేశారు. చక్కాజామ్ నేపథ్యంలో రైతులు నిరసనలు తెలుపుతున్న ప్రాంతాలు, చుట్టుపక్క ఏరియాల్లో శనివారం రాత్రి దాకా తాత్కాలికంగా ఆపేశారు. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు అధికారులు ఈ చర్యలు చేపట్టారు. సెంట్రల్ ఢిల్లీలోని షాహిదీ పార్క్ దగ్గర సుమారు 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చక్కా జామ్​కు మద్దతుగా ప్రొటెస్టులు చేసినందుకు వీరిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

పలు రాష్ట్రాల్లో ఇలా..

పంజాబ్​లోని 15 జిల్లాల్లో 33 ప్రాంతాల్లో రైతులు రాస్తారోకో చేశారు. హర్యానాలోనూ నిరసనలు కొనసాగాయి.

రాజస్థాన్​లోని గంగానగర్, హనుమాన్​గఢ్, ధోల్​పూర్, ఝాలావర్ తదితర ప్రాంతాల్లో హైవేలను బ్లాక్ చేశారు.

మహారాష్ట్రలోని సతార జిల్లా కరాడ్ సిటీలో రైతు నేతలు రాస్తారోకో నిర్వహించారు. రద్దీ రోడ్డులో ధర్నా చేశారన్న కారణంతో మాజీ సీఎం పృథ్విరాజ్ చవాన్ భార్య సత్వసీలా చవాన్ సహా 40 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

తమిళనాడు ఆల్ ఫార్మర్స్ అసోసియేషన్ కో ఆర్డినేషన్ కమిటీ ప్రెసిడెంట్ పీఆర్ పాండియన్ ఆధ్వర్యంలో చెన్నైలో ఆందోళనలు జరిగాయి. తిరుచిరాపల్లి, తంజావూరు, నాగపట్టిణం, తిరువరూర్ తదితర ప్రాంతాల్లో రాస్తారోకోలు జరిగాయి.

కర్నాటకలో రైతు సంఘాల నేత కురుబూరు శాంతకుమార్ ఆధ్వర్యంలో రాస్తారోకోలు జరిగాయి. కన్నడ ఆర్గనైజేషన్లు కూడా వీరికి జత కలిశాయి. బెంగళూరు, మైసూరు, కోలార్, కొప్పళ, బాగల్​కోట్, తుమకూరు, హాసన, మంగళూరు, హావేరి, శివమొగ్గ, చిక్కబళ్లాపుర తదితర ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. బెంగళూరులో దాదాపు 30 మందిని ముందుగానే కస్టడీలోకి తీసుకున్నారు.

డిమాండ్లు నెరవేరే దాకా ఇండ్లకు వెళ్లం

తమ డిమాండ్లు నెరవేరే దాకా ఇండ్లకు వెళ్లబోమని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) లీడర్ రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు. ఒత్తిడి మధ్య తాము కేంద్రంతో చర్చలు జరపబోమని తేల్చి చెప్పారు. ఘాజీపూర్ బార్డర్​లో ఆయన మాట్లాడారు. అక్టోబర్ 2 వ తేదీ దాకా తమ ప్రొటెస్టులు కొనసాగిస్తామని వెల్లడించారు. చట్టాలను రద్దు చేసేందుకు అప్పటిదాకా కేంద్రానికి టైం ఇస్తున్నామని చెప్పారు. అప్పటికీ తమ డిమాండ్లు నెరవేరకుంటే మరింత ప్రొటెస్టులు చేస్తామన్నారు. చక్కాజామ్ సందర్భంగా శాంతికి భంగం కలిగించేందుకు కొందరు దుండగులు ప్రయత్నిస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. అందుకే యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో చక్కాజామ్ చేపట్టకూడదని నిర్ణయించామన్నారు.

For More News..

‘భూముల లొల్లి’ మళ్లా మొదటికి

ప్రగతిభవన్‌కు పోనీయరు.. బీఆర్కే భవన్‌కు రానీయరు