ఖర్చుల మోత ! పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడంతో అన్ని రంగాలపై చైన్ రియాక్షన్

ఖర్చుల మోత ! పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడంతో అన్ని రంగాలపై చైన్ రియాక్షన్
  • పప్పులు, ఉప్పులు, నూనెలు, చక్కెర, కూరగాయలు, పండ్ల ధరలకు రెక్కలు
  • ట్రాక్టర్లు, హార్వెస్టర్ల కిరాయిలు హైక్.. రైతుపై పెట్టుబడుల మోత
  • పెరుగుతున్న సిమెంట్, ఐరన్​ రేట్లతో  భారం కానున్న ఇండ్ల నిర్మాణం
  • మున్ముందు రేట్లు మరింత పెరుగుతాయనే ఆందోళన
  • భవిష్యత్ అవసరాల కోసం ఎమర్జెన్సీ ఫండ్ ఉంచుకోవాలంటున్న ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్స్

హైదరాబాద్, వెలుగు: పెట్రోల్, డీజిల్​ రేట్లతోపాటు పెరుగుతున్న  నిత్యావసరాలతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. మార్కెట్‌‌‌‌‌‌‌‌కు వెళ్లాలంటేనే  వెన్నులో వణుకు పుడుతోంది. ఫ్యూయల్ ​రేట్లు రోజురోజుకూ పైపైకి కదులుతుండడంతో దాని చైన్ రియాక్షన్ అన్ని రంగాలపైనా పడ్తున్నది. ఫలితంగా రవాణా ఖర్చులు పెరిగిపోయి నిత్యావసర వస్తువుల రేట్లకు  రెక్కలొచ్చాయి.

గత 20 రోజులుగా ఏ వస్తువు ముట్టుకున్నా  షాక్ కొడుతున్నది. పప్పులు, ఉప్పులు, వంట నూనెలు, కూరగాయలు, పండ్లు.. ఇలా ఒకటేమిటి అన్నింటి  ధరలూ పెరుగుతున్నాయి. దీంతో సగటు మధ్యతరగతి కుటుంబం నెలవారీ బడ్జెట్ తలకిందులవుతున్నది. రాబోయే రోజుల్లో కొత్త సప్లై వస్తే ఈ రేట్లు మరింత పెరిగే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు జనాల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి.

గడిచిన 2 వారాల వ్యవధిలోనే  కేంద్రం ఏకంగా 4 విడతలుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేసి వినియోగదారుల నడ్డి విరిచింది. ఈ తక్కువ కాలంలోనే లీటర్ పెట్రోల్‌‌‌‌‌‌‌‌పై రూ. 8.27, డీజిల్‌‌‌‌‌‌‌‌పై రూ. 8.12 మేర భారాన్ని మోపడంతో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో పెట్రోల్ రూ. 115.73 కి, డీజిల్ సెంచరీ దాటి రూ. 103.82 కి చేరాయి. కేవలం 15 రోజుల్లోనే ఏకంగా 8 రూపాయల వరకు ఇంధన ధరలు పెరగడం దేశ చరిత్రలోనే ప్రథమం. దీంతో రవాణా వాహనాల అద్దెలు ఒక్కసారిగా 15 శాతం మేర పెరిగి, నిత్యావసరాల ధరలు కొండెక్కుతున్నాయి. ఓవైపు జీతాలు పెరగక, మరోవైపు పెరుగుతున్న ఖర్చులను తట్టుకోలేక అద్దె ఇళ్లలో ఉండే మధ్యతరగతి జీవులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు.

నిత్యావసరాలపై ప్రతి నెలా రూ.1500 దాకా అదనం..
కిరాణా కొట్టుకు వెళ్తే బిల్లు చూసి గుండె జారాల్సిందేనని సామాన్యులు వాపోతున్నారు. గత కొన్ని రోజుల్లో అంటే పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగినప్పటి నుంచి నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. మే మొదటి వారంలో కిలో రూ. 150 ఉన్న కందిపప్పు (క్వాలిటీ-1) ధర ప్రస్తుతం మార్కెట్లో రూ. 162 కు చేరింది. అలాగే, వంట నూనెల ధరలు కూడా సామాన్యుడికి భారంగా మారాయి. 

మే మొదటి వారంలో లీటరు సన్‌‌ఫ్లవర్ ఆయిల్ రూ. 150 ఉండగా, ప్రస్తుతం అది రూ. 176 కు ఎగబాకింది. అలాగే, నెల కిందట రూ. 110 ఉన్న పామాయిల్ ధర ప్రస్తుతం రూ. 125 కు చేరింది. కిలో చక్కెరపై 3 రూపాయల అదనపు భారంతో రూ. 42 నుంచి రూ. 45కు పెరిగింది.

హైదరాబాద్‌‌లోని బేగంబజార్‌‌‌‌లాంటి హోల్‌‌సేల్ మార్కెట్లలోనే ధరలు ఈ రేంజ్‌‌లో ఉంటే, ఇక రిటైల్ షాపుల్లో స్థానిక రవాణా ఖర్చులు కూడా తోడై సామాన్యుడి బడ్జెట్‌‌ను తలకిందులు చేస్తున్నాయి. ప్రధాన నిత్యావసర వస్తువులైన పప్పు ధాన్యాల ధరలు కూడా ఈ 15 రోజుల్లోనే పెరిగాయి. నిత్యం వాడే శనగపప్పు కిలో గతంలో రూ. 84 ఉండగా, ప్రస్తుతం రూ. 92కు చేరింది. 

అలాగే మినపప్పు ధర కిలో రూ. 122 నుంచి రూ. 132 కు ఎగబాకగా, పెసరపప్పు రూ. 114 నుంచి రూ. 122కు పెరిగింది. ఇలా ప్రతి వస్తువు రేటు పెరగడంతో నలుగురు ఉన్న ఒక మధ్యతరగతి కుటుంబానికి నెలకు కేవలం ఈ కిరాణా సరుకుల కోసమే అదనంగా రూ. 1,500 దాకా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఊబర్​, ఓలా, ర్యాపిడోలాంటి ట్రాన్స్‌‌పోర్ట్​ యాప్​ సేవలు మరింత భారమయ్యాయి.

నిర్మాణ రంగంపై ఎఫెక్ట్​..
 సొంతింటి కల నిజం చేసుకుందామనుకునే వారికి కూడా ప్రస్తుత పరిస్థితులు గట్టి షాక్ ఇస్తున్నాయి. నిజానికి అంతర్జాతీయ మార్కెట్లో ముడి పదార్థాల ధరలు తగ్గడం, దేశీయంగా డిమాండ్ మందగించడంతో సిమెంట్, స్టీల్ కంపెనీల ధరలు ప్రస్తుతానికి స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్ రిటైల్ మార్కెట్‌‌లో బస్తా సిమెంట్ ధర రూ.  350 ఉండగా రవాణా పేరుతో రూ. అదనంగా ఇంకో 30 దాకా వసూలు చేస్తున్నారు. 

టన్ను స్టీల్ ధర రూ. 55 వేల దాకా ఉన్నప్పటికీ  పెరిగిన డిజీల రేట్లను పరిగణనలోకి తీసుకుని  ట్రాన్స్‌‌పోర్ట్​ చార్జీల పేరుతో అదనంగా రూ.5 వేలు ఆపైనే వసూలు చేస్తున్నారు. అయితే, డీజిల్ ధరల పెంపుతో పెరిగిన రవాణా ఖర్చులు స్థానిక నిర్మాణ సామాగ్రిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. 

ఇండ్ల నిర్మాణానికి అత్యంత కీలకమైన ఇసుక, ఇటుకలు, కంకర, గ్రానైట్‌‌లాంటి వాటిని క్వారీల నుంచి నిర్మాణ ప్రాంతాలకు చేరవేసే లారీలు, ట్రాక్టర్ల రవాణా అద్దెలు ఒక్కసారిగా పెరిగాయి. గతంలో కంటే ప్రతి ట్రిప్పుకు రూ. 500 నుంచి రూ. వెయ్యి వరకు అదనంగా రవాణా చార్జీలు వసూలు చేస్తుండటంతో సొంతంగా ఇల్లు కట్టుకునే మధ్యతరగతి ప్రజలపై నిశ్శబ్దంగా అదనపు భారం పడుతోంది. దీనికి తోడు ఎండల తీవ్రత వల్ల కూలీల కొరత, రవాణా మోత తోడవడంతో ఇండ్ల నిర్మాణ పనులు నెమ్మదించాయి. బిల్డర్లు సైతం రవాణా వ్యయం పెరుగుదలను సాకుగా చూపుతూ అపార్ట్‌‌మెంట్ ఫ్లాట్ల ధరలను సవరించే యోచనలో ఉండటంతో సామాన్యుడికి దిక్కుతోచడం లేదు.

పెరిగిన మందుల ధరలు
సాధారణంగా ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న నిత్యావసర ప్రాణరక్షక మందుల గరిష్ట పరిమితి ధరలను ఫార్మా కంపెనీలు ఇష్టానుసారంగా పెంచడానికి వీల్లేదు. కేంద్ర ప్రభుత్వ జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ నిబంధనల ప్రకారం.. హోల్‌‌సేల్ ధరల సూచిక ఆధారంగా ఏడాదికి ఒకసారి మాత్రమే కంపెనీలు ధరలను సవరించుకునే చట్టపరమైన అనుమతి ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారమే కంపెనీలు అధికారికంగా సవరించిన కొత్త రేట్ల స్టాక్‌‌ను ఈ మే నెలలో మార్కెట్లోకి విడుదల చేశాయి. 

అయితే, ఈ వార్షిక ధరల పెంపునకు తోడు.. ప్రస్తుతం పెరిగిన డీజిల్ ధరల వల్ల ఫార్మా కంపెనీల తయారీ యూనిట్ల నుంచి హోల్‌‌సేల్ డిస్ట్రిబ్యూటర్లకు, అక్కడ నుంచి రిటైల్ మెడికల్ షాపులకు మందులను చేరవేసే లోకల్ కొరియర్, ఏజెన్సీ రవాణా ఖర్చులు కూడా ఒక్కసారిగా భారం కావడం రిటైల్ మార్కెట్‌‌పై ఒత్తిడి పెంచింది. 

ఈ రెండిటితో రిటైల్ మార్కెట్‌‌లో నెల రోజుల క్రితం రూ. 92.50 లు ఉన్న బీపీ మందుల (టెల్మిసార్టన్ 40 ఎంజీ ) 15 మాత్రల స్ట్రిప్ ధర కొత్త స్టాక్ వచ్చేసరికి రూ. 94కు చేరింది. అలాగే, రూ. 118గా ఉన్న షుగర్ కంట్రోల్ కాంబినేషన్ మాత్రల (గ్లిమిపిరైడ్ ప్లస్ మెట్‌‌ఫార్మిన్) స్ట్రిప్ ధర ఇప్పుడు రూ. 121.50కు ఎగబాకింది. సాధారణ పారాసిటమాల్ 650 ఎంజీల మాత్రల స్ట్రిప్‌‌పై కూడా రూపాయిన్నర దాకా అదనపు భారం పడింది. యాంటీబయాటిక్స్, వివిధ రకాల సిరప్‌‌ల కొత్త రేట్లు తోడవ్వడంతో, దీర్ఘకాలిక రోగాలు ఉండి నెలకు సరిపడా మందులు కొనుగోలు చేసే సగటు మధ్యతరగతి కుటుంబాలపై ఈ మే నెలలో నిశ్శబ్దంగా అదనపు ఆర్థిక భారం పడుతోంది.

‘టైట్ బడ్జెట్’ ప్లాన్​ చేస్కోవాలి..
పెట్రోల్​, డిజీల్​ ధరలు మరింత పెరుగుతాయనే అంచనాలు సామాన్యుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణం పెరిగి, రూపాయి విలువ తగ్గడంతో సామాన్యుడి కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణమే స్పందించి టాస్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్ కమిటీల ద్వారా మార్కెట్ ధరలను నియంత్రించాలని,  బ్లాక్ మార్కెట్, అక్రమ నిల్వలపై ఉక్కుపాదం మోపడంతోపాటు పౌరసరఫరాల వ్యవస్థ ద్వారా రాయితీలను విస్తృతం చేయాలని ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్స్​సూచిస్తున్నారు. మరోవైపు సామాన్య, మధ్యతరగతి ప్రజలు కూడా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. 

అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలని, క్రెడిట్ కార్డులకు దూరంగా ఉంటూ.. ప్రాథమిక అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని.. ఇందుకోసం ‘టైట్ బడ్జెట్’ ప్లాన్ చేసుకోవాలంటున్నారు.  భవిష్యత్ అవసరాల కోసం అత్యవసర నిధి (ఎమర్జెన్సీ ఫండ్​) ఏర్పాటు చేసుకోవడం, బ్రాండెడ్ వస్తువుల కంటే నాణ్యమైన స్థానిక ఉత్పత్తులను ఎంచుకోవడం, వైద్య ఖర్చుల భారం పడకుండా హెల్త్ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌లను ముందే సిద్ధం చేసుకోవాలంటున్నారు.

భారం కానున్న పెట్టుబడులు.. 
ఇంధన ధరల ప్రభావం కేవలం వంటింటికే పరిమితం కాకుండా, నేరుగా అన్నదాతపై పడుతున్నది. వానాకాలం సాగు సీజన్‌‌కు రైతులు సన్నద్ధమవుతున్న తరుణంలో పెట్రోల్​, డిజీల్​రేట్ల పెంపు వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం చూపనుంది.  సాగులో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర  యంత్రాలనే వాడుతుండడంతో పెట్టుబడులు పెరగనున్నాయి.  సాధారణంగా ఒక ఎకరం పొలాన్ని పక్కాగా దున్నడానికి (ట్రాక్టర్ రకాన్ని బట్టి) కనీసం 1 నుంచి 1.5 గంటల సమయం పడుతుంది. ఇందుకు సగటున  8 లీటర్ల డీజిల్ ఖర్చవుతుంది. పెరిగిన రేట్లతో ఆ ఖర్చు తడిసి మోపెడవుతున్నది. 

గడిచిన 15–20 రోజుల్లో లీటర్ డీజిల్ రూ.8 పెరగడం వల్ల.. కేవలం డీజిల్ కోసమే రైతుకు ఎకరానికి రూ.150 వరకు అదనపు భారం పడుతున్నది. ఒకవేళ రెండు ఎకరాలైతే ఈ మొత్తం డబుల్​ అవుతున్నది.   దీంతో గత 15  రోజుల్లోనే  ట్రాక్టర్ల కిరాయిలు గంటకు రూ. 900 నుంచి రూ. 1,100 దాకా ఎగబాకాయని రైతులు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో డీజిల్​రేట్లు మరింత పెరుగుతాయనే అంచనాల నేపథ్యంలో  అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.  బోర్లు వేయించుకోవడం కూడా తలకు మించిన భారం కానున్నది.

కూరగాయల రేట్లు పిరం
డీజిల్, రవాణా చార్జీల ఎఫెక్ట్ కారణంగా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే లోడ్ తగ్గి రైతుబజార్లలో  కేవలం మూడు వారాల వ్యవధిలోనే దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలు ఎగబాకాయి. డీజిల్ ధరల పెంపుతో పెరిగిన రవాణా చార్జీల ప్రభావానికి తోడు, మే నెల తీవ్రమైన ఎండల కారణంగా తోటల్లో దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ మార్కెట్లకు వచ్చే లోడ్ తగ్గి.. రైతుబజార్లలో సైతం ధరలు పెరిగాయి. మూడు వారాల క్రితం కిలో రూ. 20 గా ఉన్న టమాటా ధర ప్రస్తుతం రైతు బజార్లలో రూ. 35కు చేరింది. కిలో ఉల్లిపాయలు రూ. 25 నుంచి  ప్రస్తుతం రూ. 35 పలుకుతోంది. 

ఆలుగడ్డ కిలో రూ.30 నుంచి రూ. 40కి ఎగబాకింది. బెండకాయలు, దొండకాయలులాంటి సాధారణ కూరగాయలు కూడా కిలో రూ. 40 నుంచి రూ. 50పైనే ధర పలుకుతున్నాయి. ఇక పండ్లు, పూల మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పండుగలు, శుభకార్యాల సమయం కాకపోయినా ఎండల తీవ్రత వల్ల పూల దిగుబడి తగ్గి ధరలు ఆకాశాన్నంటాయి. కిలో చామంతి రూ. 100 నుంచి రూ. 140కి పెరగ్గా, ఆపిల్స్, అరటి పండ్ల ధరలు కూడా రవాణా ఖర్చుల భారంతో 15 నుంచి 20 శాతం మేర పెరిగాయి. సగటు జీవి రోజువారీ కూరగాయల కోసం చేసే ఖర్చు ఒక్కసారిగా భారం కావడంతో ఏం వండుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది.