
- వేం నరేందర్ రెడ్డికి బీటీఎన్జీవో రిక్వెస్ట్
హైదరాబాద్, వెలుగు: గచ్చిబౌలిలోని భాగ్యనగర్ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ( బీటీఎన్జీవో )కు చెందిన 190 ఎకరాల ల్యాండ్‌ను ఉద్యోగుల సొసైటీకి కేటాయించాలని అసోసియేషన్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గౌడ్ కోరారు. సోమవారం ఈ అంశంపై టీఎన్జీవో మాజీ ప్రెసిడెంట్ కారం రవీందర్ రెడ్డితో కలిసి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ఈ స్థలాలను వైఎస్సార్ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీకి కేటాయించారని, వీటిని తీసుకునేందుకు గత ప్రభుత్వం ప్రయత్నించిందని నేతలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సుమారు 3 వేల మంది ఉద్యోగులు ఈ సొసైటీలో మెంబర్లుగా ఉండి ప్లాట్ల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఈ ల్యాండ్‌పై హైకోర్టులో స్టే ఉందని, దీనిని తొలగించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు.
ఈ అంశాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తానని వేం నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారని సత్యానారాయణ తెలిపారు.