వేములవాడ క్షేత్రానికి దివ్యశోభ.. మరో చరిత్ర సృష్టిస్తోన్న పునర్నిర్మాణ పనులు

వేములవాడ క్షేత్రానికి దివ్యశోభ.. మరో చరిత్ర సృష్టిస్తోన్న పునర్నిర్మాణ పనులు

దేశవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధిగాంచిన  శైవక్షేత్రాల్లో ఒకటి తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయం. వార్షికంగా ఈ క్షేత్ర ఆదాయం సుమారు రూ.150 కోట్ల వరకు ఉంటుంది. గత ఏడాది నుంచి సుమారు రూ.200 కోట్ల అంచనా వ్యయంతో మొదలైన ఆలయ పునర్నిర్మాణ పనుల ప్రచారాలు మరో చరిత్ర సృస్టిస్తున్నాయి. రూ.50 కోట్లతో రోడ్డు వెడల్పు, రూ.33 కోట్లతో అన్నసత్రం, రూ.30 కోట్లతో బద్ది పోచమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆలయాన్ని సందర్శించే భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఈ మధ్య కాలంలో రాజన్న గుడి, విస్తరణ, పునర్నిర్మాణాలపై వస్తున్న కథనాలను చూస్తున్న రాజన్న భక్తులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. శృంగేరి స్వాముల అనుమతులతో ఆలయ విస్తరణ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టారు.

రాజన్న ఆలయాన్ని కొన్నాళ్లు మూసివేసి ప్రత్యామ్నాయంగా భీమేశ్వరాలయాన్ని రూ.3.50 కోట్ల వ్యయంతో అభివృద్ది చేశారు. రాజన్న ఆలయంలో దర్శనాలు మూసివేస్తున్నారన్న ప్రచారాలు మీడియాలో ఊపందుకొంటున్నాయి. కాగా, యాదగిరిగుట్ట దేవాలయాన్ని 2016లో మొదలు పెట్టి 2023లో విస్తరణ, పునర్నిర్మాణాల్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సుమారు 1200 కోట్ల రూపాయల బడ్జెట్ తో పూర్తి చేశారు. దానికి లభించిన విశేష ప్రచారానికన్నా వేములవాడ గుడి విస్తరణకి మూడింతలకుపైగా బృహత్ ప్రచారాలు లభిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. వేములవాడ క్షేత్రాన్ని 2015 జూన్ 18న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించి 400 కోట్ల రూపాయల ప్రణాళికతో పునర్నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వేములవాడ దేవాలయ అభివృద్ధి కమిటీని (వీటీడీఏ) ఏర్పాటు చేశారు.

కేసీఆర్ హయాంలో  2017, 2018, 2019 సంవత్సరాల్లో సుమారు 200 కోట్ల రూపాయలతో ఆలయ విస్తరణను చేపట్టారు. తదుపరి కరోనా విజృంభించడంతో నిర్మాణ కార్యక్రమాలు ఆగిపోయాయి. రాజన్న గుడికి అనుబంధంగా 160 ఎకరాల విస్తీర్ణంలో గుడి చెరువు ఉంది. ఇందులో సుమారు 30 ఎకరాల స్థలాన్ని రెవెన్యూ శాఖ నుండి సేకరించారు. ప్రత్యామ్నాయంగా చెరువు కింద 30 ఎకరాల స్థలాన్ని ప్రైవేట్​గా మార్కెట్ రేట్​పై సేకరించి, చెరువు విస్తీర్ణానికి ఎలాంటి సమస్యలు రాకుండా సమం చేశారు. ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవతో గుడి చెరువు నుండి సేకరించిన 30 ఎకరాల స్థలంలోనే ఆలయ విస్తరణ కార్యక్రమాలను సవరించిన ప్రణాళికను అనుసరించి చేపడుతున్నారు.


చాళుక్య రాజుల రాజధాని వేములవాడ

ఉమ్మడి ఏపీలోని పురావస్తుశాఖ ఉప సంచాలకుడిగా ఉన్న పీవీ పరబ్రహ్మశాస్తి ఉమ్మడి కరీంనగర్ జిల్లా శాసనాల పుస్తకాన్ని 1974లో సుమారు 80 శాసనాలతో ప్రచురించారు. వేములవాడ శాసనాలనే ఆయన ఇందులో ప్రముఖంగా చర్చించారు. తమ ముందుమాటలోనే వేములవాడ క్షేత్ర ప్రాధాన్యత, మధ్య యుగాల్లో వేములవాడ చాళుక్యులు దక్షిణాదిలో సుస్థిరంగా నిర్వహించిన రాజకీయ పాత్రపై సుదీర్ఘ వ్యాసం రాశారు. అంతేకాకుండా వేములవాడ చాళుక్యరాజులు వేములవాడను రాజధానిగా చేసుకొని సామాన్య శకం 750-–973 వరకు సుమారు 223 సంవత్సరాలు ప్రజారంజకమైన పాలనను అందించారని తెలిపారు. ప్రముఖ చరిత్రకారులు బీఎన్ శాస్త్రి, డా. జైశెట్టి రమణయ్యతోపాటు నాలాంటివాళ్లు ఎంతోమంది ఈ గుడిపై పరిశోధనలు చేశారు. వేములవాడ చాళుక్యుల్లో ముఖ్యులైన సోలదగండ బద్దెగడు, రెండో అరికేసరి, ఆస్థాన పండితులైన పంప మహాకవి, సోదరుడైన జినవల్లభుడు, చివరన జీవించి, యశస్తితిలక చంపూ కావ్యాన్ని రాసిన సోమదేవసూరి అనే సంస్కృత పండితుడు వేములవాడకు చెందిన పలు అంశాల్ని తమ శాసనాల్లో, గ్రంథాల్లో నిక్షిప్తం చేశారు. బొమ్మలమ్మ గుట్ట శాసనంలో రెండో అరికేసరి ధర్మపురిని పంప మహాకవికి అగ్రహారంగా, దానంగా ఇచ్చినట్లు సామాన్య శకం 945లో జినవల్లభుడు వేయించిన శాసనం చెబుతున్నది. 

బద్దెగడు భీమేశ్వరాలయ నిర్మాణం

క్రీ.శ. 8వ శతాబ్దపు చివరలో బద్దెగడు భీమేశ్వరాలయాన్ని నిర్మించారు. వేములవాడ చాళుక్యుల తర్వాత కళ్యాణి చాళుక్యులు ఈ ప్రాంతాన్ని సామాన్య శకం 973 నుండి 1160 వరకు పాలించారు. ఈ రెండు రాజవంశాలు కలిపి సుమారు 425 సంవత్సరాలు పాలించారు. ఇలా ఈ రెండు రాజవంశాల పాలనా కాలంలో వేములవాడ ఒక దివ్యక్షేత్రంగా, రాజకీయంగా ఎంతగానో ప్రసిద్ధిగాంచింది. వేములవాడ చాళుక్య ప్రభువులకు రాజధానిగా, కళ్యాణి చాళుక్యులకు ప్రముఖ సామంత రాజధానిగా వెలుగొందింది. కళ్యాణి చాళుక్యుల కాలంలోని త్రిభువనమల్ల విక్రమాదిత్య కాలంలోని (సామాన్య శకం 1076-–1126) కాలంలో వేములవాడ మహామండలేశ్వరుడైన సామంతాధీశుడు రాజాదిత్యుడు సామాన్య శకం 1083లో రాజన్నగుడిని నిర్మించి, రాజాదిత్య సముద్రం అనే చెరువుని నిర్మించి, విద్యాసంస్థకి సంకేయపల్లి అగ్రహారాన్ని (సంకేపల్లి) దానమిచ్చినట్లుగా రాజన్నగుడిలో ఉత్తరం వైపున ఉన్న రాజాదిత్యుని యాభై లైన్ల శాసనం చెబుతున్నది. అయితే, ఈ గుడి నిర్మాణం అంతకు ముందున్న భువనైకమల్ల రెండో సోమేశ్వరుడి కాలంలోనే చేపట్టినట్లు విదితమవుతున్నది. 

జోరుగా పనులు

ప్రస్తుతం రాజన్న ఆలయ ఆవరణలోని ఆలయ ఈవో కార్యాలయం, ప్రసాదాల కార్యాలయం, కళాభవన్, కేశఖండన సదనాల్ని జేసీబీలతో కూల్చి వేశారు. ఆలయ విస్తరణ పనులు ఒక పక్కన మొదలుకావడానికి కూల్చివేతల నిర్మాణాదులు వేగంగా జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన వార్తలు ప్రతి నిత్యం సోషల్ మీడియాలో వస్తున్నాయి. ప్రత్యామ్నాయ దేవాలయంగా సమీపంలోని భీమేశ్వరస్వామి ఆలయంలో యాత్రికుల ఆర్జిత మొక్కుబడులను నిర్వహిస్తున్నారు. సుమారు 3.50 కోట్ల రూపాయలతో రాజన్న ఆలయ విస్తరణ కార్యక్రమాలను సుమారు వేయి కోట్ల అంచనా వ్యయంతో చేబట్టడానికై స్థానిక శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కృతనిశ్చయంతో ఉన్నారు. గత ఏడాది నవంబర్ 20న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్ది ఆలయ విస్తరణ పనులకు ఎనిమిది మంది మంత్రులతో కలిసివచ్చి శంకుస్థాపనలు చేసి వెళ్ళారు. నెల కిందట శృంగేరి పీఠాధిపతులు అక్టోబర్ 19, 20 తేదీలలో విధుశేఖర భారతీస్వామి రాజన్న ఆలయాన్ని సందర్శించి, ఆలయ విస్తరణ పనులను పరిశీలించారు. 2024లో లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభకు జరిగిన ఎన్నికల ముందు ప్రచార సమయలో ప్రధాని నరేంద్రమోదీ రాజన్న గుడిని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రముఖుల సందర్శనలతో రాజన్నగుడిపై మీడియా ప్రచారాలు వరుసగా ప్రాధాన్యతగా చోటుచేసుకొంటున్నాయి. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రాజన్న గుడి ధర్మకర్తగా పనిచేశారు. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్ది, ఎన్టీఆర్​తో సహా పలువురు ప్రముఖ నాయకులు ఈ ఆలయాన్ని సందర్శించిన రికార్డులున్నాయి. ఇలా ప్రతి అంశంలోనూ రాజన్న గుడి విస్తరణ, పునర్నిర్మాణాల పట్ల మీడియాలో గత ఏడాది నుండి సంచలానాత్మకమైన కథనాలు వెలువడుతున్నాయి.

1200 ఏళ్ల పూర్వం నిర్మాణం

రాజన్న గుడి, దానికి అనుబంధంగా ఉన్న పది దేవాలయాలు సుమారు 24 గుంటల విస్తీర్ణంలో ఉన్నాయి. ఆలయాల క్యాంపస్, ఆఫీసులు, ధర్మశాలలు మరో ఎనిమిది ఎకరాల్లో ఉన్నాయి. సుమారు 1200 సంవత్సరాలకి పూర్వం వేములవాడ చాళుక్యులు, తదుపరి అధికారంలోకి వచ్చిన పశ్చిమ చాళుక్యుల పరిపాలనా కాలంలో రాజన్న గుడి, అనుబంధ దేవాలయాల నిర్మాణాలు జరిగాయని చరిత్ర చెబుతోంది. ఇక్కడ దేవాలయానికి, వివిధ నిర్మాణాలకు చెందిన వివరాలను డజను శాసనాలు తెలుపుతున్నాయి. 1950 ప్రాంతంలో అప్పటి దక్కన్ హైదరాబాద్ కాలంలో ప్రసిద్ద చరిత్రకారులు దక్కన్ పురావస్తుశాఖ కోరికపై వేములవాడ ఆలయ చరిత్రను పరిశీలించి, సుమారు వంద పేజీలతో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. నవాబుల కాలంలో రాజన్నగుడి పునర్నిర్మాణాదులు తదుపరి 1970–-74 ప్రాంతాలలో జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో అధికారంలోకి రావడంతో స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ పనులు కొన్ని సవరణలతో ఊపందుకొన్నాయి. 

రాజేశ్వరాలయ ప్రస్తావన

రాజన్న ఆలయంపై పరిశోధించి పలు గ్రంథాలు వెలువరించిన జగిత్యాల చరిత్రకారుడు డా. జైశెట్టి రమణయ్య వేములవాడలో రెండో అరికేసరి కాలంలో క్రీ.శ. 940 ప్రాంతంలోనే రాజేశ్వరాలయ ప్రస్తావనలున్నాయని చర్చించారు. సుమారుగా వేములవాడ ఆలయాన్ని 20-40 సంవత్సరాలలో కట్టినట్లుగా భావిస్తున్నారు. వేములవాడలో చాళుక్యరాజులకు చెందిన మరో ధర్మకుండం ఒకటి సమీప నాగాయపల్లి పరిసరాలలో ఇటివల బయటపడింది. అంతేకాక వీరగల్లుల విగ్రహాలు కూడా దొరికాయి. నాంపల్లిలో ఒక రైతు ఇల్లు నిర్మాణం చేస్తున్నప్పుడు ఒక శివలింగం బయటపడింది. వేములవాడ దేవాలయాలు వేములవాడ చాళుక్యుల కాలంలోనే కాకుండా, బాదామీ చాళుక్యుల పాలనా కాలంలోనే సామాన్య శకం 545-755 వరకు వేములవాడ క్షేత్రంలో దేవాలయ వైభవాలు, నిర్మాణాలు విలసిల్లినట్లుగా చరిత్రకారులు డా. జైశెట్టి రమణయ్య తమ గ్రంథాల్లో వివరించారు. ఎందుకంటే కరీటాలు లేని బొత్త గణపతుల విగ్రహాలు గత 50 ఏళ్ల కిందట ధర్మకుండం ఎదురుగా ఉండేవి. వాటిని ఆయన పరిశీలించి, అవి బాదామి చాళుక్యుల కాలంనాటివని తేల్చారు. ఇలాంటి గణపతి విగ్రహం ఒకటి ప్రస్తుతం భీమేశ్వరాలయ ప్రవేశద్వారం వద్ద ఉంది.

- సంకేపల్లి నాగేంద్రశర్మ,
 సీనియర్
స్వతంత్ర జర్నలిస్ట్