V6 News

టెన్త్ పూర్తయిన స్టూడెంట్స్ను.. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఎక్కువ మంది పేరెంట్స్ జాయిన్ చేయకపోవడానికి కారణాలివే!

టెన్త్ పూర్తయిన స్టూడెంట్స్ను..  ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఎక్కువ మంది పేరెంట్స్ జాయిన్ చేయకపోవడానికి కారణాలివే!

ప్రస్తుత  విద్యాసంవత్సరం ముగింపుకు  చేరుకుంది.  మూడు నెలల్లో  కొత్త విద్యా  సంవత్సరం  ప్రారంభం కానుంది. పదవ తరగతి  పరీక్షలు  రాసినవారికి  ప్రైవేట్​ జూనియర్​ కళాశాలల్లో అనధికారికంగా అడ్మిషన్స్​ దాదాపు పూర్తయ్యాయి. ఈ విద్యా సంవత్సరంలో  5 లక్షలమందికిపైగా  విద్యార్థులు  పరీక్షలకు హాజరయ్యారు. ఎస్​ఎస్​సీలో ఉత్తీర్ణులైనవారు  వివిధ  జూనియర్​  కళాశాలల్లో,  పాలిటెక్నిక్,  ఐటీఐ, ఏటీసీలలో  చేరతారు. 

తెలంగాణ రాష్ట్రంలో  ప్రభుత్వ  నిర్వహణలో  దాదాపు 1,850  ప్రభుత్వ  జూనియర్​ కళాశాలలు,  రెసిడెన్షియల్​ కళాశాలలు  ఉన్నాయి.  ఒక్కొక్క  ప్రభుత్వ  కళాశాలలో  వివిధ గ్రూపులలో  ఎంపీసీ, బైపీసీ,  ఎంఈసీ, సీఈసీ, ఒకేషనల్​ కోర్సులు ఉన్నాయి.   ఒక్కో  కాలేజీలో 286 మంది  విద్యార్థులు చేరితే  5,29,100  మంది విద్యార్థులకు  ప్రభుత్వ  జూనియర్​ కళాశాలలే  సరిపోతాయి.  ఇక ప్రైవేట్​ కళాశాలలు అవసరం ఏముంది?  పైగా తెలంగాణలో ప్రభుత్వ  పాలిటెక్నిక్​ కాలేజీలు 56,  డిప్లొమా ఇన్​ అగ్రికల్చర్​ కాలేజీలు 23,  ప్రభుత్వ  ఐటీఐలు 63,  ప్రభుత్వ  ఏటీసీలు 25 ఉన్నాయి.  వీటన్నిటిలో  62,344 సీట్లు  అందుబాటులో ఉన్నాయి.

  వీటికితోడుగా  కేంద్ర ప్రభుత్వ సీబీఎస్ఈ  స్కూళ్లు,  ఎన్​ఐఓఎస్,  తెలంగాణ రాష్ట్ర  టీవోఎస్​ఎస్​లలో  కూడా  ఇంటర్మీడియట్​ కోర్సులు  అందుబాటులో ఉన్నాయి.  అన్నిరకాల  ప్రభుత్వ  జూనియర్​  కళాశాలలు  ప్రస్తుతం  ఉత్తీర్ణులయ్యే  విద్యార్థులకు  పూర్తిగా  సరిపోతాయి.  

  • అధికారుల్లో నిర్లిప్తత సరికాదు

తెలంగాణలో  దాదాపు 1,255  ప్రైవేట్ ​జూనియర్​ కళాశాలలు ఉన్నాయి.  వీటిలో 60శాతం టెన్త్​ పాసయినవారు జాయిన్​ అవుతారు. వీరిలో సింహభాగం కార్పొరేట్​ కళాశాలల్లో చేరతారు. చాలా  ప్రభుత్వ కళాశాలల్లో  కనిష్టస్థాయి  విద్యార్థులు  చేరుతున్నారు. ఒక లెక్చరర్​  పోస్టు కాపాడటం కోసం మాత్రమే విద్యార్థులను అతికష్టం మీద చేర్చుకుంటున్నారు. ఇది మన ప్రభుత్వ జూనియర్​ కాలేజీల పరిస్థితి.  

ఈ దుస్థితిని సరిదిద్దాలి. బోర్డ్​ ఆఫ్​ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్​ (బీఐఈ) జిల్లా అధికారులు ప్రైవేట్​ జూనియర్​ కళాశాలలకు 200 శాతం నుంచి 300 శాతం వరకు అడిషనల్​ సెక్షన్లు మంజూరు చేస్తున్నారు.  ఎటువంటి మౌలిక వసతులు లేని కళాశాలలకు ఇబ్బడి ముబ్బడిగా అదనపు సెక్షన్లు  ఇస్తున్నారు.  సంబంధిత  ప్రభుత్వ అధికారులే  ప్రభుత్వ జూనియర్​ కళాశాలలను  మనుగడలో  లేకుండా చేస్తున్నారు.  

బీఐఈ అధికారుల విధి నిర్వహణలో  వైఫల్యం వల్ల ప్రభుత్వ జూనియర్​ కళాశాలలు మసకబారిపోతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్, కార్పొరేట్​​కాలేజీలవైపు మొగ్గు చూపడంతో  ప్రభుత్వ కాలేజీలు  బలహీనపడుతున్నాయి.  దాదాపు 240–250 పనిదినాలలో 32 శాతం లెక్చరర్లు  గైర్హాజరు అవుతున్నారు.  బీఐఈ వెబ్​సైట్​లో అఫిలియేటెడ్​ కాలేజీల జాబితా కొంతకాలంగా డిస్​ప్లే అవడం లేదు. ఈ లిస్టు కోసం వెతికినప్పుడు ఎర్రర్​.. నాట్​ఫౌండ్​ అని చూపిస్తుంది. చాలా  ప్రైవేట్​జూనియర్​ కాలేజీలు అవి మంజూరైన అడ్రసులో ఉండటం లేదు.  వేరేచోట నిర్వహిస్తున్నారు.  పెద్ద  నగరాలలో  రెండు, మూడు  కళాశాలలను  ఒకే  బిల్డింగులో  నిర్వహిస్తున్నారు.  జిల్లా బీఐఈ అధికారులు వీటిపై నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. 

  • ప్రభుత్వ  కాలేజీలపై  శ్రద్ధ చూపాలి 

విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్ర హడావుడి చేస్తున్నారు. చివరికి షరా మామూలే.  లెక్చరర్లు  సమయ పాలన పాటించకపోవడం, దూరప్రాంతాల నుంచి రాకపోకల కారణంగా ప్రయాణ బడలిక తదితర కారణాల వల్ల బోధన ఆశించినమేరకు జరగటం లేదు.   .  చాలా  ప్రైవేట్ కాలేజీల్లో  ప్రయోగశాలలు లేవు.  బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ  ప్రయోగాలు కేవలం 3 నుంచి 6 రోజుల్లో పూర్తి చేస్తారు. 

రికార్డు రాయించి అన్ని ప్రయోగాలను మమ అనిపిస్తారు.  ప్రైవేట్​ కాలేజీల్లో విద్యార్థులు ప్రయోగ పరీక్షల్లో  90 నుంచి 100 శాతం మార్పులు వస్తుంటే ప్రభుత్వ జూనియర్​ కాలేజీల్లో విద్యార్థులకు  60 నుంచి 90 శాతం మార్కులు మాత్రమే పొందుతున్నారు.  దీనిపై  ప్రభుత్వ కాలేజీల్లో  లెక్చరర్లు  ఆత్మావలోకనం  చేసుకోవాలి.  అయితే, ఒక్కటిమాత్రం నిజం ప్రభుత్వ కాలేజీల్లోని లెక్చరర్లు మేధావులు, పూర్తిస్థాయి విషయ పరిజ్ఞానం కలవారు.  ఉత్తమ బోధన నైపుణ్యం కలవారు. వీరు చిత్తశుద్ధితో  ప్రయత్నిస్తే  ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులకు న్యాయం చేయగలరు.  
ప్రభుత్వ విద్యాసంస్థలను కాపాడగలరు.  

  • విద్యార్థుల తల్లిదండ్రుల్లో  మార్పు రావాలి

విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ప్రభుత్వ జూనియర్​ కాలేజీల్లో  చేర్చేవిధంగా శ్రద్ధ వహించాలి.  లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రైవేట్​ కాలేజీల్లో ఎందుకు జాయిన్​ చేస్తున్నారో ఆలోచించాలి.  విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ మార్పు రావాలి.   ఒక ప్రభుత్వ కాలేజీ  నిర్వహణకు  మన ప్రభుత్వం రూ. 1కోటి 30 లక్షల నుంచి రూ.1కోటి 80లక్షల వరకు ఒక సంవత్సరానికి జీతాల రూపంలో  చెల్లిస్తుంది.  ఇతర నిర్వహణ ఖర్చులు అదనం. ప్రభుత్వ గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో  దాదాపు 1 కోటి 16 లక్షల కుటుంబాలు ఉన్నాయి.   

వీటిలో  మార్చి 2026 నాటికి  1,05, 07, 789 తెల్ల రేషన్​కార్డులు ఉన్నాయి.  వీరంతా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతివారు. అయితే వీరు అధిక ఫీజులు చెల్లించి ఎందుకు ప్రైవేట్​ కాలేజీల్లో తమ పిల్లలను జాయిన్​ చేస్తున్నారో  ఆలోచించాలి.  ప్రభుత్వం కూడా కొన్ని విషయాలపై విచారణ జరిపించాలి.  ఎటువంటి మౌలిక సదుపాయాలు లేని ప్రైవేట్​ కాలేజీలకు ఎందుకు బీఐఈ అధికారులు అడిషనల్​  సెక్షన్లు  మంజూరు చేస్తున్నారు.  ప్రభుత్వ, ప్రైవేట్​ ప్రాక్టికల్​ ఎగ్జామ్స్​ వ్యత్యాసంపై విచారణ జరిపించాలి. 

- వేణుగోపాల్​ నరెడ్ల