తెలంగాణ రాజకీయాల్లో సంక్షేమ శాఖల అవినీతిపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. సంక్షేమ శాఖల్లో అవినీతి జరిగినట్లు నిరూపిస్తే తాము దేనికైనా సిద్ధమంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.
మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలను తాము అత్యంత పారదర్శకంగా నడుపుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మంత్రులుగా తాము ఎలాంటి జోక్యం చేసుకోకుండా... పూర్తి నిర్ణయాధికారాలను ప్రిన్సిపాల్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్‌కే అప్పగించామని వెల్లడించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే తమ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
బీసీ మంత్రిగా నేను, మైనార్టీ మంత్రిగా అజారుద్దీన్, ఎస్సీ-ఎస్టీ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉన్నాం. ఒక మైనార్టీ, ఒక ఎస్సీ, ఒక బీసీ మంత్రిగా ఉన్న శాఖలపై హరీష్ రావు చులకనగా మాట్లాడుతున్నారు అంటూ మంత్రి పొన్నం మండిపడ్డారు. హరీష్ రావు కనీస అవగాహన లేకుండా మాట్లాడి తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారని విమర్శించారు.
ALSO READ : నర్సింహులపేట MPDO ఆఫీస్‌లో ఏసీబీ రైడ్స్..
గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినట్లే... ఇప్పుడు కూడా అవినీతి జరుగుతుందనే భ్రమల్లో హరీష్ రావు ఉన్నారని పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు.
మా ముగ్గురు మంత్రుల పక్షాన నేను సవాల్ చేస్తున్నా... మా శాఖల్లో ఒక్క తప్పు జరిగినట్లు చూపించినా, అవినీతిని నిరూపించినా ఎలాంటి విచారణకైనా, దేనికైనా మేము సిద్ధం.అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు.
