
వాషింగ్టన్: సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ టెన్నిస్ రాకెట్ పట్టిన అమెరికా వెటరన్ ప్లేయర్ వీనస్ విలియమ్స్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. డీసీ ఓపెన్‌లో భాగంగా మంగళవారం అర్ధరాత్రి జరిగిన విమెన్స్ సింగిల్స్‌లో వీనస్ 6–3, 6–4తో 22 ఏళ్ల పేటన్ స్టెర్న్స్‌పై గెలిచింది. ఫలితంగా 45 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్ టెన్నిస్ టూర్ లెవెల్ సింగిల్స్ మ్యాచ్ గెలిచిన సెకండ్ ఓల్డెస్ట్ ప్లేయర్‌గా రికార్డులకెక్కింది. మార్టినా నవ్రతిలోవా (47 ఏళ్లు) ముందున్నది. 2004లో నవ్రతిలోవా ఈ విజయం సాధించింది.
2024 మియామీ ఓపెన్ తర్వాత వీనస్ బరిలోకి దిగడం ఇదే తొలిసారి. ఇక పేటన్ పుట్టకముందే 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన వీనస్ ఈ మ్యాచ్‌లో తన గత ఆటను చూపెట్టింది. భారీ సర్వీస్‌లు, బలమైన గ్రౌండ్ స్ట్రోక్స్‌తో ఆకట్టుకుంది. గ్రౌండ్‌లో చురుకుగా కదులుతూ పేటన్ కొట్టిన ప్రతి షాట్‌కు బదులిచ్చింది. ఓవరాల్ కెరీర్‌లో వీనస్ ఏడు సింగిల్స్, 14 డబుల్స్, రెండు మిక్స్‌డ్ డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది.