కార్తీక మాసం స్పెషల్: ప్రతీ ఇంట్లో చేసుకునే వంటకం ఇదే..మీరు ఒకసారి ట్రై చెయ్యండి

కార్తీక మాసం స్పెషల్: ప్రతీ ఇంట్లో చేసుకునే వంటకం ఇదే..మీరు ఒకసారి ట్రై చెయ్యండి

కార్తీకమాసంలో ఉసిరికాయ రుచి చూడని వాళ్లుండరు. పుష్కలంగా సి– విటమిన్ ఉండే ఉసిరితో ఎన్నో వంటకాలు తయారుచేసుకోవచ్చు. ఈ సీజన్​లో ప్రతి ఇంట్లోనూ చేసుకునే రెసిపీల్లో ఈ రెండింటికీ మొదటి ప్లేస్ ఉంటుంది. మరింకెందుకాలస్యం.. మీరూ వీటిని ట్రై చేయండి. 


పప్పు

కావాల్సినవి:
కందిపప్పు, ఉల్లిగడ్డ తరుగు: అర కప్పు; ఉసిరికాయలు: ఆరు; నీళ్లు, ఉప్పు: సరిపడా; పచ్చిమిర్చి : పది; పసుపు, మెంతులు: పావు టీస్పూన్; నూనె: ఒక టేబుల్ స్పూన్; ఆవాలు, శనగపప్పు : ఒక టీస్పూన్; ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, టొమాటోలు : రెండు; జీలకర్ర : అర టీస్పూన్; కరివేపాకు, కొత్తిమీర: కొంచెం.
తయారీ : 
కందిపప్పును కడిగి, గంటసేపు నానబెట్టాలి. నానబెట్టిన కందిపప్పును ఒక పాన్​లో వేసి అందులో పసుపు, రెండు పచ్చిమిర్చి వేసి నీళ్లు పోయాలి. మూతపెట్టి నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. ఒక పాత్రలో నీళ్లు పోసి ఉసిరికాయలు వేసి మూతపెట్టి పదినిమిషాలు ఉడికించాలి. ఉసిరికాయల్ని మరో గిన్నెలో వేసి చల్లారాక ముక్కలుగా కట్ చేయాలి. వాటిని, పచ్చిమిర్చితోపాటు మిక్సీజార్​లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పాన్​లో నూనె వేడి చేసి అందులో శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండు మిర్చి, వెల్లుల్లి, ఇంగువ వేసి వేగించాలి. తర్వాత ఉల్లిగడ్డ తరుగు కూడా వేసి, అవి వేగాక టొమాటో ముక్కలు వేసి కలపాలి. ఆపై ఉడికించిన కందిపప్పు కూడా వేసి కలపాలి.  చివరిగా ఉసిరికాయలు ఉడికించిన నీటిని కూడా పోసి మరికాసేపు మగ్గనివ్వాలి.


పచ్చడి

కావాల్సినవి:
ఉసిరికాయలు : పావు కిలో
ఆవాలు, మెంతులు : ఒక్కో టీస్పూన్
జీలకర్ర, పసుపు : ఒక్కోటి అర టీస్పూన్
నూనె : సరిపడా
ఎండు మిర్చి : పది
పచ్చిమిర్చి : ఐదు
ఇంగువ : చిటికెడు

తయారీ :
ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి, ముక్కలుగా కట్ చేయాలి. పాన్​లో నూనె వేడి చేసి ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి వేగించాలి. ఎండు మిర్చి, పచ్చిమిర్చి కూడా వేసి వేగాక పసుపు, ఇంగువ వేసి కలపాలి. తర్వాత ఉసిరికాయ ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. కాస్త చల్లారాక వాటిని మిక్సీజార్​లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. మరో పాన్​లో నూనె వేడి చేసి అందులో తాలింపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండు మిర్చి వేసి.. అవి వేగాక అందులో పచ్చడి వేసి కలపాలి.