అసెంబ్లీలో నీళ్ల యుద్ధం.. అధికార పక్షం X ప్రతిపక్షం

అసెంబ్లీలో నీళ్ల యుద్ధం.. అధికార పక్షం X ప్రతిపక్షం
  • పరస్పరం విమర్శల దాడి
  • హరీశ్ రావు Vs కోమటిరెడ్డి
  • కేసీఆర్ హాజరుపై అట్టుడికిన సభ
  • సభకు రారు కాని నల్గొండకు వెళ్తారా: భట్టి
  • కేసీఆర్ అసెంబ్లీకి  రావడానికి భయపడ్తుండు: రాజగోపాల్ రెడ్డి
  • కేసీఆర్ గైర్హాజరుపై కడియం వివరణ

హైదరాబాద్:కృష్ణానది పరిధిలోని ప్రాజెక్టులపై ఇరిగేషన్ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా సోమవారం (ఫిబ్రవరి 12) శాసన సభలో అధికార, విపక్షాల మధ్య మాటల మంటలు చెలరేగాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు తప్పు మీదంటే మీదని తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. పదేండ్ల పాపాల భైరవుడు కేసీఆర్ సభకు ఎందుకు రాలేదని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. 

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ..కీలక చర్చ జరుగుతున్న సమయంలో సభకు రాని ప్రతిపక్ష నేత నల్లగొండ మీటింగ్ కు వెళ్తారా..? అని ప్రశ్నించారు.  అదే  సమయంలో ప్రతిపక్ష సభ్యులు హరీశ్ రావు, కడియం శ్రీహరి కౌంటర్ ఎటాక్ కు దిగారు. కేసీఆర్ గైర్హాజరుపై  మాజీ మంత్రి కడియం వివరణ ఇచ్చారు. కేసీఆర్ పలు కారణాల వల్ల అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేకపోయారని చెప్పారు. బీఆర్ఎస్, కేసీఆర్ తరపున తాను మాట్లాడుతున్నామని చెప్పుకొచ్చారు. 

అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని తాము బలపరుస్తున్నట్లు కడియం తెలిపారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందిస్తూ.. సాగునీటి ప్రాజేక్టులలో వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. అవినీతి జరగలేదరిన మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పగలరా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై తాను ఆధారాలు చూపిస్తానని మంత్రి జూపల్లి సభకు తెలిపారు.

Also Read : కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను వదులుకోం

 మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతల తొందరపాటు చర్యల వల్లే రాష్ట్రం ఇవాళ ఈ దుస్థితికి వచ్చిందని మండిపడ్డారు. ఇకనైనా పద్దతి మార్చుకొని ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని సూచించారు. ప్రాజెక్టుల పేరుమీద వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని అన్నారు.