కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను వదులుకోం: మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి

కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను వదులుకోం: మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి
  • బీఆర్ఎస్ హయాంలోనే జలదోపిడీ
  • ఏపీకి నీళ్లు ఎక్కువగా ఇచ్చింది వాళ్లే
  • జగన్, కేసీఆర్ డైనింగ్ టేబుల్ మీదే పంపకాలు
  • తెలంగాణకు మరణశాసనం రాసిన గత ప్రభుత్వం
  • 299 టీఎంసీలకు ఒప్పుకొని తీసుకున్నది 197.83 టీఎంసీలే
  • తెలంగాణకు 68% వాటా అంటే 525 టీఎంసీలు అడగాలి
  • శ్రీశైలం  నుంచి 50% నీటిని ఎక్స్ ట్రాగా ఏపీ దోచుకెళ్లింది
  • గత సర్కారు హయాంలోనే పోతిరెడ్డి పాడు కెపాసిటీ పెరిగింది
  • గత సర్కారు తీరు వల్లే నాగార్జున సాగర్ ఎండిపోవడం ఖాయం
  • శాసనసభలో నీటిపారుదల శాఖ ఉత్తం కుమార్ రెడ్డి 

హైదరాబాద్:కృష్ణానదికి సంబంధించి గతప్రభుత్వంచేసుకున్నఒప్పందాలపై నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి సోమవారం (ఫిబ్రవరి12)  శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బీఆర్ఎస్ హాయంలోనే కృష్ణా జలదోపిడీకి తెరలేచిందని అన్నారు. ఏపీకి నీళ్లు ఎక్కువగా ఇచ్చింది వాళ్లేనని అన్నారు. కేసీఆర్, ఏపీ సీఎం జగన్ డైనింగ్ టేబుల్ మీదే నీటి  పంపకాలు జరిగాయని ఉత్తమ్ దుయ్యబట్టారు.

ఈ ఒప్పందాలు తెలంగాణ తెలంగాణకు మరణశాసనమని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవంగా కృష్ణా జలాల్లో 68% వాటా అంటే 525 టీఎంసీలు తెలంగాణకు  రావాలని అన్నారు. కానీ గత ప్రభుత్వం కేవలం 299 టీఎంసీలకే ఒకే  చెప్పిందని, అందులోనూ 197.83 టీఎంసీల నీటినే వాడుకున్నదని అన్నారు. ఏపీ సీఎం జగన్ ఇచ్చిన జీవో 203తో పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచారని అన్నారు.

రాయల సీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం శ్రీశైలం నుంచి 3 టీఎంసీలను రోజూ తరలించుకుపోయేందుకు గత ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందన్నారు. రిజర్వాయర్ అడుగు నుంచి నీటిని తరలించుకుపోయేందుకు అనుమతి ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.  

 50శాతం నీటిని ఎక్స్ ట్రాగా తీసుకెళ్లిందని అన్నారు. రాయల సీమ ఎత్తిపోతల పథకం కోసం పోతిరెడ్డి పాడు కెపాసిటీ పెంచారని అన్నారు. గత ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టులకు 27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరం కూడా ఆయకట్టు క్రియేట్ చేయలేదని విమర్శించారు.  బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తొమ్మిదిన్నరేండ్ల కాలంలో సుమారు 1200 టీఎంసీల నీరు శ్రీశైలం నుంచి బేసిన్ వెలుపలకు వెళ్లిందని చెప్పారు.

దాదాపు 50% నీటిని ఇల్లీగల్‌గా తెలంగాణ నుంచి ఏపీ వాడుకున్నది. ఇది ఆంధ్రకు దక్కిన కోటాకు అదనమన్నారు.  ఈ మొత్తానికి కారణం కేసీఆర్ ప్రభుత్వమేనని చెప్పారు. బేసిన్‌లో వాటర్ ఇన్ ఫ్లో తగ్గినా ఏపీకి మాత్రం డైవర్షన్ పెరిగిందని గుర్తు చేశారు. ఏపీ శాసన సభలో సీఎం జగనే.. తెలంగాణ సీఎం కేసీఆర్ మనకు ఉదారతతో నీళ్లిస్తున్నారని చెప్పారని తెలిపారు.

తెలంగాణ ఏర్పాటుకు ముందు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీకి నీటికేటాయింపు 44 వేల క్యూసెక్కులుంటే ఇప్పుడు 92,600 క్యూసెక్కులకు పెరిగిందని, దీనికి కారణం గత ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. 

హరీశ్ వి చిల్ల రాజకీయాలు

మాజీ మంత్రి హరీష్ రావు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. సభను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. హరీష్ రావు చదివే మినిట్స్ కు అంగీకరించబోమన్నారు. హరీష్, కేసీఆర్ రాష్ట్ర  ఇరిగేషన్ కు తీరని నష్టం చేశారని ఆరోపించారు. కేసీఆర్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.