నాగార్జునసాగర్ ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవాలి : హరీశ్ రావు

నాగార్జునసాగర్ ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవాలి : హరీశ్ రావు

నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు రెండూ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అయినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు. అసెంబ్లీలో ఏపీ జల దోపిడీపై జరిగిన చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

గతంలో శ్రీశైలం ప్రాజెక్టు ఏపీ ఆధీనంలో ఉండగా.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో ఉండేదని.. ఇప్పుడు రెండు ప్రాజెక్టులు ఏపీ ఆధీనంలోనే ఉన్నాయన్నారు హరీశ్ రావు. ఇప్పటికీ సాగర్ ప్రాజెక్టుపై సీఆర్ పీఎఫ్ బలగాలు ఉన్నాయని.. ఏపీ ప్రభుత్వం పెత్తనం చేస్తుందన్నారాయన. రెండు నెలలు అయ్యాయని.. ఇప్పటికే ప్రభుత్వం సాగర్ ప్రాజెక్టును ఆధీనంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ విషయంలో ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని.. ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామని సభ ద్వారా హామీ ఇచ్చారు హరీశ్ రావు. తెలంగాణ ప్రజల జీవనాడి అయిన ఈ రెండు ప్రాజెక్టులపై తెలంగాణ రాష్ట్రానికి హక్కులు లేకపోతే రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులు ఉంటాయన్నారు. శ్రీశైలం ఏపీ ఆధీనంలో ఉందని.. కనీసం సాగర్ ప్రాజెక్టును అయితే తెలంగాణ రాష్ట్రం తన ఆధీనంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు హరీశ్ రావు.