సార్వత్రిక ఎన్నికల్లో .. మార్పు దిశగా తీర్పు

 సార్వత్రిక ఎన్నికల్లో ..  మార్పు దిశగా తీర్పు

దేశమంతా ఉత్కంఠగా చూస్తున్న ఈ సార్వత్రిక ఎన్నికల్లో అతి ముఖ్యమైన పరిణామాన్ని గమనిస్తే  జూన్ 4న వెలువడే తీర్పు ఏమై ఉంటుందో సులువుగానే అర్థం చేసుకోవచ్చు. ‘అబ్ కి బార్  చార్ సౌ పార్’ అని ఎలక్షన్లకు మూడు నెలల ముందుగానే  ఘనంగా కూతపెట్టిన కాషాయ పార్టీ  దళపతులు  దేశవ్యాప్తంగా దశలవారీగా ముగుస్తున్న  పోలింగ్ సరళితో  తమ  నినాదాన్ని గంగకు వదిలేశారు. వారి మాటల్లో ఇప్పుడు ఆ గర్వం లేదు.  ఆ పార్టీ అనుంగుల్లో ఇప్పుడా చర్చే లేదు.  అసలు అధికారమైనా నిలబెట్టుకుంటామా అనే దిశగా వారిలో భయాందోళనలు  పెల్లుబుకుతున్నాయి. 

సౌత్​లో బీజేపీకి చుక్కెదురు

దక్షిణ భారతంలో ఏం చేసినా బీజేపీ పాచిక పారడం లేదు,  మొన్నటివరకూ కొంత ఆశల్ని  రేకెత్తించిన కర్నాటకలోనూ వారి బండారం బట్టబయలై ఓటర్లు పొలిమేర ఆవలకి తరిమేశారు.  ఏపీ, కేరళ, తమిళనాడు, తెలంగాణలోని దాదాపు 130  స్థానాల్లో కనీస ఆశలు లేవు.  ఇక పెద్ద రాష్ట్రాలైన యూపీలోని 80 స్థానాలు,  మహారాష్ట్రలోని 48 స్థానాలు,  వెస్ట్ బెంగాల్ 42 స్థానాలు, బిహార్ 40 స్థానాలు బీజేపీకి గతంలో బలంగా ఉన్నాయి. అయితే, ఈసారి మాత్రం అక్కడ  పూర్తిగా ప్రతికూలంగానే ఉంది.  పశ్చిమ బెంగాల్ లాంటి ప్రాంతంలో గెలవడానికి ఎంత చిచ్చుపెడుతున్నా..  పాచిక పారకపోవడం, బిహార్లో నమ్ముకున్న నితీశ్​ కొంపముంచనుండటం, యూపీలో  ప్రభ మసకబారిపోవడం,  మహారాష్ట్రలో శివసేనకు చేసిన ద్రోహం 210  స్థానాల్లో హీనపక్షానికి దిగజార్చబోతున్నాయి.  పైగా ప్రజలకు ఏం చేసామో చెప్పడానికిలేక  ఉచిత రేషన్ అనే అంశాన్ని పదేపదే చెప్పి వారి ఆత్మాభిమానంపై  దెబ్బకొడుతున్నారు.  ఏతావాతా వారు నమ్ముకున్న గుజరాత్,  మొన్నటి ఫలితాలతో రాజస్థాన్ మినహా పెద్దగా ఫ్రభావం ఎక్కడా చూపలేదనేది నిష్టూర సత్యం.  ఇక పంజాబ్,  ఢిల్లీ, హర్యానాల్లో ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ అరెస్ట్  అనేదే వారి ఓటమిని చెప్పకనే చెప్పింది.  ఈశాన్య  రాష్ట్రాల్లో సైతం మణిపూర్​లో  రగిల్చిన కార్చిచ్చు  బీజేపీనే దహించబోతుంది.  ప్రాంతాలవారీగా ఇంత స్పష్టంగా ఎన్డీయే బలహీనతను చూపిస్తుంటే  బీజేపీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది.
 
తుఫాన్ ముందు ప్రశాంతత

కాంగ్రెస్​ ప్రచార  పర్యవసానమే పోలింగ్ జరుగుతున్న ప్రతి దశలోనూ ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించి, దేశాన్ని రక్షించుకోవడానికి నిర్ణయం తీసుకునేలా  ప్రేరేపించాయి. అందుకే ఎన్నికల  ముంగిట ప్రతి బీజేపీ వ్యక్తి నోట పలికిన  ‘అబ్ కి బార్ చార్ సౌ పార్’ క్రమంగా కనుమరుగైంది.  కాశ్మీర్ అంశం,  నాడు  భావోద్వేగాలను  రెచ్చగొట్టిన  సర్జికల్  స్ట్రైక్ ఇప్పుడు  లేదు.  ఆర్టికల్ 370 రద్దు ఘనత అని  దేశమంతటా ఊదరగొట్టిన మోదీ అనుయాయులు  చివరకు  కాశ్మీర్లో  పోటీ చేయలేకపోయారు.  ఇలా 2014,  2019లో  తమకు అనుకూలంగా ఉన్న ప్రతీది ఇప్పుడు వారికి పెనుభూతమై తరుముతోంది.  దేశ నిర్మాణం,  దేశ భవిష్యత్  ఆలంబనగా ఎన్నడూ బీజేపీ ఎన్నికల గోదాలోకి రాలేదు.  కేవలం భావోద్వేగపరమైన అంశాలతోనే  ఇన్నాళ్లు పొద్దుగడుపుతూ వచ్చింది.  కానీ,  నేడు అన్ని ధరలు ఆకాశాన్నంటి ప్రజలు అల్లాడుతుంటే... అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పతనమౌతున్నా రోజురోజుకు పెట్రోల్ ధరల మోత మోగుతుంటే  దాని పర్యవసానంగా పెరుగుతున్న పప్పు, ఉప్పులు కొనలేక సామాన్యుడు చతికిలపడుతుంటే, దీనికి కారణాలేంటో వారు ఆలోచిస్తున్నారు, అందుకే తుఫాన్ ముందటి  ప్రశాంతత  కన్పిస్తున్నా జూన్ 4న జన సునామీ వారిని ముంచెత్తి తమ ఆకాంక్షలను నెరవేర్చుకోబోతుంది.  
అందుకే రాబోయే తీర్పు మార్పు దిశగా నవ చైతన్యం చూపించబోతుంది.

కనపడని బీజేపీ బెంచ్​మార్క్​

అన్నింటికీ మించి పదేండ్లు అధికారంలో ఉండి సైతం ఇదిగో  ఇది మా బెంచ్ మార్క్ పని అని కానీ, ప్రజల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన మా ఐకానిక్ పథకం ఇదీ అని కానీ చెప్పుకోవడానికి బీజేపీకి ఒక్కటీ లేదు. వ్యక్తి పూజ నిషేధం అనే సైద్ధాంతిక మూలం కల్గినవారం అని చెప్పుకునే ఆ పార్టీ నేతలు ప్రభుత్వం చేసినపని నిర్దిష్టంగా ఇదని స్పష్టంగా చెప్పుకోలేకపోతున్నారు. చివరికి ఆ పార్టీలో ఇంకెవరూ లేరు అన్నట్టుగా కేవలం మోదీని మాత్రమే ముందుకు నెట్టడం వారి నైరాశ్యానికి పరాకాష్టగానే ప్రజలు చూస్తున్నారు.  పార్టీ తరఫున ప్రచార చిత్రాల్లోనూ మోదీ గ్యారెంటీ అనే పసలేని నినాదాన్ని ప్రజలపై రుద్ది,  మోదీ  దైవాంశ సంభూతుడుగా పేర్కొంటున్నారు.  మరీ ముఖ్యంగా కొంతమంది ఆ పార్టీ నేతలే  దేవుడే మోదీ భక్తుడు అనే స్థాయికి దిగజారి పోయారు.  నాకెవరూ లేరు. కానీ, నా కీర్తే  లోకమంతా చెప్పుకోవాలి అని మోదీ ఆకాంక్ష.  ఇద్దరితో మొదలయ్యాం అని చెప్పుకున్నప్పుడు వారికి ప్రధానంగా పనిచేసిన మందిర్, మసీద్ వివాదం నేడు లేకపోవడం, సుప్రీంకోర్టు  మార్గదర్శకాలతో  నిర్మితమైన రామమందిరాన్ని ఎన్నికల కోసం వాడుకోవాలని చేసిన విశ్వప్రయత్నాలు పని చేస్తున్నవి లేవు. చివరికి ప్రాణ ప్రతిష్ఠ కాకుండానే రాముడి అక్షింతలతో యావద్దేశంలో చేసిన ప్రచార యావ సైతం వారికి ప్రతికూల ఫలితాన్నే ఇస్తుందనేది జూన్ 4న స్పష్టం కానుంది. .

యూపీఏ పాలనలోనే సంక్షేమం

నాగార్జునసాగర్, బాక్రానంగల్, తెహ్రీ, ఇడుక్కి వంటి భారత నేలల్ని సస్యశ్యామలం చేసిన నిర్మాణాలు, పనికి ఆహార పథకంలాంటి భారత జాతిని సుసంపన్నం చేసిన యూపీఏ హయాంలో అమలైన పథకాలు తప్ప ఇదీ మా గొప్ప అని చెప్పుకోలేకపోవడమే ఎన్డీయే పతనానికి మూల కారణం, దీనికి పైపెచ్చు ప్రైవేటీకరణ పేరుతో జాతిని జాగృతం చేసే యూనివర్సిటీలు మొదలు నవరత్న కంపెనీలను సైతం ప్రైవేటుకు కట్టబెట్టి దేశంలో సింహభాగం ఉన్న దళిత, గిరిజన, బహుజన హక్కుల్ని కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తుండడం వారిని అధికారం నుంచి కూకటివేళ్లతో పెకిలించబోతునట్టుగా స్పష్టత రానుంది. అదానీ, అంబానీల సేవలో తరించే ప్రధాని చివరకు వారే కాంగ్రెస్​కు నిధులిస్తున్నారనే  ఆరోపణలతో  బేలగా  మారి పోయారు. 273 సింపుల్ మెజారిటీని కాదని ఏకంగా నాలిగింట మూడోవంతు మెజార్టీని అడుగుతున్న మాటల్లోని ఆంతర్యం తెలిసింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్నిబ్రహ్మాస్త్రంలా బయటకి తీశారు. దళిత, బహుజన, గిరిజనులకు దేశాన్ని దూరం చేయడానికి  తమ అనుంగులైన కార్పొరేట్లకు దేశాన్ని అప్పనంగా అందివ్వడానికి అడ్డంకిగా ఉన్న రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే వారి ఎత్తుగడలో భాగమే 400కు పైగా స్థానాల్ని అడుగుతున్నారనే  కఠోర సత్యాన్ని కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. 

- బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి,
సీఈవో, టిశాట్ నెట్​వర్క్,
అధ్యక్షుడు, తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక