హైదరాబాద్ సంక్షిప్త వార్తలు

హైదరాబాద్ సంక్షిప్త వార్తలు

హైదరాబాద్, వెలుగు: కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సాయంతో ఉస్మానియా ఆస్పత్రిలోని డెర్మటాలజీ విభాగంలో కొత్తగా ఏర్పాటు చేసిన అత్యాధునిక యంత్రాలను డీఎంఈ డాక్టర్ రమేశ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేజర్స్ మిషన్, పువ్వా(ఫొటో) థెరపీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో మ్యానోమెట్రీ మిషన్ యంత్రాలు పేషెంట్లకు ఎంతో ఉపయోగపడుతాయని తెలిపారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్, కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కళారెడ్డి, అడిషనల్ సూపరింటెండెంట్ బి.త్రివేణి, సివిల్ సర్జన్ ఆర్ఎంవో –-1 డాక్టర్ బి.శేషాద్రి, డెర్మటాలజీ విభాగాధిపతి ఎ.వెంకటకృష్ణ పాల్గొన్నారు.

మేడ్చల్ ​మున్సిపల్ పాలక వర్గాన్ని రద్దు చేయాలి

మేడ్చల్, వెలుగు: అవినీతిమయమైన మేడ్చల్ మున్సిపాలిటీ పాలకవర్గాన్ని వెంటనే రద్దు చేయాలని బీజేపీ లీడర్లు డిమాండ్ చేశారు. బుధవారం మేడ్చల్ బీజేపీ ఆఫీసులో పార్టీ మున్సిపల్​అధ్యక్షుడు ఆంజనేయులుతో కలిసి మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ చైర్​పర్సన్, కమిషనర్‌‌‌‌ ఇద్దరూ దొంగలేనని ఆరోపించారు. స్థానిక సమస్యలను తీర్చడంలో ఫెయిల్​అయిన పాలక వర్గం జనం దృష్టిని మళ్లించేందుకు కొత్త డ్రామాకు తెరలేపిందన్నారు. అవినీతి, అక్రమ నిర్మాణాలు, పార్కులు, బఫర్ జోన్ల కబ్జాల విషయమై మూడేండ్లుగా బీజేపీ లీడర్లు ఎన్నోసార్లు ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. అధికార పార్టీ కౌన్సిలర్లే అవినీతి జరుగుతోందని గళమెత్తారని, మంత్రి మల్లారెడ్డి వెంటనే విచారణ చేయించి చర్యలు తీసుకోవాలని కోరారు. సీనియర్ నాయకుడు పాతూరి సుధాకర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు రాజు, ప్రేమ్ దాస్, సర్వేశ్వర్ రెడ్డి, మల్లేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

అవినీతిని నిరూపిస్తే రాజీనామా చేస్త

మేడ్చల్, వెలుగు: తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని మేడ్చల్​ మున్సిపల్​చైర్​పర్సన్ మర్రి దీపిక నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కౌన్సిలర్లు మున్సిపల్ చైర్ పర్సన్ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని చేసిన ఆరోపణలను ఆమె ఖండించారు. బుధవారం మేడ్చల్​లో మీడియాతో మాట్లాడిన దీపిక.. ఎవరికి వారు ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేయడం కరెక్ట్​కాదన్నారు. పూర్తి ఆధారాలతో అవినీతిని నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్ధమని తెలిపారు. కొందరు కౌన్సిలర్లు తమ స్వార్థం కోసం మిగిలిన వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టులు తీసుకుని అక్రమాలకు పాల్పడుతూ, తిరిగి తనపైనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వార్డును అభివృద్ధి చేస్తున్నామని, తాను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజాసేవ కోసం మాత్రమే
నని స్పష్టం చేశారు. 

కంటోన్మెంట్ ​పరిధిలో 117 బస్​షెల్టర్ల నిర్మాణానికి ఓకే

కంటోన్మెంట్, వెలుగు: త్వరలో కంటోన్మెంట్​బోర్డు పరిధిలో117 బస్​షెల్టర్లు నిర్మించనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్​లో ఆధునిక హంగులతో బిల్డ్– ఆపరేట్– ట్రాన్స్​ఫర్ మోడ్​లో ఏర్పాటుకు బోర్డు అధికారులు aఆమోదం తెలపగా, ఓ ప్రైవేట్​అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ పనులను దక్కించుకుంది. త్వరలో పనులు చేపట్టి బస్​షెల్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. మూడు దశాబ్దాలుగా కంటోన్మెంట్​లోని మెయిన్​రోడ్లపై కొత్త బస్​షెల్టర్లు ఏర్పాటు చేయలేదు. ఇన్నాళ్లు ఎలాంటి సదుపాయాలు లేని పాత షెల్టర్ల వద్దే బస్సులు ఆగుతున్నాయి. కూర్చునే వీలు లేదు. ఎండైనా, వానైనా బస్సు వచ్చేదాకా జనం నిలబడాల్సిందే. ఎట్టకేలకు బోర్డు నిర్ణయంతో ఆధునిక బస్​షెల్టర్లు రాబోతున్నాయి. బోయిన్​పల్లి, తిరుమలగిరి, మారేడుపల్లి ప్రాంతాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. తర్వాత మిగిలిన ఏరియాల్లో ఏర్పాటు చేయాలని బోర్డు అధికారులు నిర్ణయించారు. పాలీకార్బనిక్ రూఫ్, ఆకర్షణీయమైన టైల్స్​తో ఫ్లోరింగ్, ప్రయాణికులు కూర్చునేందుకు మాడ్రన్ చైర్స్​ను బస్​షెల్టర్లలో ఏర్పాటు చేయనున్నారు. పనులు పూర్తయ్యాక వాటిపై వివిధ రకాల సంస్థలు, కంపెనీలకు చెందిన ప్రకటనల కోసం అద్దెకు ఇవ్వనున్నారు. యాడ్స్​తో బోర్డుకు ఏటా సుమారు రూ.కోటి ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రతిపాదనలను ఆమోదించి 8 నెలలు అవుతున్నా ఇంతవరకు పనులు మొదలుపెట్టకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. 

ఖానాపూర్‌‌లో కాంగ్రెస్‌ ఆవిర్భావ వేడుకలు

గండిపేట, వెలుగు: దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్నాయని ఖానాపూర్ కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్ అమరేందర్​రెడ్డి విమర్శించారు. ఖానాపూర్‌లో గండిపేట మండల మాజీ సర్పంచ్‌ మన్నె గండయ్య ఆధ్వర్యంలో బుధవారం కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. పార్టీ జెండాను ఎగరవేశారు. అమరేందర్‌రెడ్డితోపాటు,  పార్టీ గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, ఉపాధ్యక్షుడు రామేశ్వరం స్వామిదాస్, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ రామకృష్ణారెడ్డి, సీనియర్‌ లీడర్లు పెద్దపులి కృష్ణ, ఎం.నరేందర్, పి.శంకర్, సీహెచ్‌.యాదయ్య, బి.నాగేశ్, జి.మల్లేశ్, ఎం.కిరణ్ పాల్గొన్నారు.

ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలి

ముషీరాబాద్, వెలుగు: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించి, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్ఐ(ప్రజాతంత్ర యువజన సమాఖ్య) ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం ముందు బుధవారం నిరసన చేపట్టారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జావీద్ మాట్లాడుతూ అభ్యర్థుల జీవితలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాంగ్ జంప్ దూరం‌ 3.8 మీటర్ల నుంచి‌ 4 మీటర్లకు పెంచడంతో అనేక మంది అభ్యర్థులు నష్టపోతున్నారని తెలిపారు. డిజిటల్ పద్ధతిలో ఎత్తు కొలుస్తున్నారని, సాంకేతిక లోపంతో చాలా మంది అర్హత కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానాన్ని తీసేసి పాత పద్ధతిలోనే ఎత్తు కొలవాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం ప్రిలిమ్స్ లో 7 మార్కులు కలిపి అభ్యర్థులకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ మాజీ రాష్ట్ర కార్యదర్శి విజయ్ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు లెనిన్, వేణు తదితరులు పాల్గొన్నారు.

అవినీతిని నిరూపిస్తే రాజీనామా చేస్త

మేడ్చల్, వెలుగు: తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని మేడ్చల్​ మున్సిపల్​చైర్​పర్సన్ మర్రి దీపిక నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కౌన్సిలర్లు మున్సిపల్ చైర్ పర్సన్ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని చేసిన ఆరోపణలను ఆమె ఖండించారు. బుధవారం మేడ్చల్​లో మీడియాతో మాట్లాడిన దీపిక.. ఎవరికి వారు ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేయడం కరెక్ట్​కాదన్నారు. పూర్తి ఆధారాలతో అవినీతిని నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్ధమని తెలిపారు. కొందరు కౌన్సిలర్లు తమ స్వార్థం కోసం మిగిలిన వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టులు తీసుకుని అక్రమాలకు పాల్పడుతూ, తిరిగి తనపైనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వార్డును అభివృద్ధి చేస్తున్నామని, తాను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజాసేవ కోసం మాత్రమే
నని స్పష్టం చేశారు. 

ఉప్పల్​ పోలీస్టేషన్​కు స్టేట్ ​ఫస్ట్ ​ర్యాంక్

ఉప్పల్, వెలుగు: ఉప్పల్​ పోలీస్​ స్టేషన్​ రాష్ట్రంలోనే ఫస్ట్​ర్యాంక్​ సాధించింది. నేరాలు అదుపు చేసేందుకు తీసుకున్న చర్యలతో పాటు, కేసుల పరిష్కారంలో ప్రతిభ కనబరిచినందుకు ఈ ర్యాంక్​ దక్కింది. తెలంగాణ ఉత్తమ పోలీస్ స్టేషన్​గా ఎంపికైంది. డీజీపీ మహేందర్​రెడ్డి 2022లో ఉత్తమ సేవలు అందించిన పీఎస్​లకు రాష్ట్ర స్థాయి అవార్డులు ప్రకటించారు. రాష్ట్రంలోని 19 బెస్ట్ ​పోలీస్ ​స్టేషన్లను ఎంపిక చేయగా ఉప్పల్ పీఎస్​కు ఫస్ట్​ ర్యాంక్​ దక్కింది. బుధవారం రాచకొండ కమిషనరేట్ ఆఫీసులో కమిషనర్ మహేశ్​ భగవత్ చేతుల మీదుగా ఉప్పల్​ఇన్​స్పెక్టర్ గోవిందరెడ్డి అవార్డు  అందుకున్నారు. మంత్లీ క్రైమ్ ​రివ్యూ మీటింగ్స్, కేసుల ప్రివెన్షన్, డిటెన్షన్, దర్యాప్తు, అత్యధికంగా కేసుల పరిష్కారం, నేరస్తుల కన్విక్షన్, డయల్100 రెస్పాన్స్, పీడీ యాక్ట్, స్వీకరించే ఫిర్యాదులు, స్టేషన్ హౌజ్​ మేనేజ్​మెంట్, వర్క్​ప్లేస్​ మేనేజ్​మెంట్, స్టేషన్ ​డిజిటలైజేషన్ తదితర సేవల ఆధారంగా ఈ అవార్డుకు ఎంపిక చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 19 పీఎస్​లు ఎంపిక కాగా, వాటిలో రాచకొండ కమిషనరేట్​ పరిధిలోనే 10 పీఎస్​లు ఉన్నాయి. 

పక్షులు, జంతు సంరక్షణకు చర్యలు తీస్కోవాలి

శామీర్ పేట, వెలుగు: జిల్లా వ్యాప్తంగా పశువులు, జంతువులు, పక్షుల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అభిషేక్ అగస్త్య అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మీటింగ్​ హాల్​లో సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ ఆన్ యానిమల్స్ గవర్నింగ్ బాడీ(ఎస్పీసీఏ) సమావేశం​నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జంతు బలులు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా యానిమల్ బర్త్ కంట్రోల్, క్రుయాలిటీ తదితర అంశాలపై జిల్లా పశువైద్యాధికారి శేఖర్ వివరించారు. జడ్పీ సీఈఓ దేవ సహాయం, జిల్లా ట్రాన్స్ పోర్ట్ అధికారి కిషన్, డీఎఫ్ఓ జానకిరామ్, మార్కెటింగ్ అసిస్టెంట్ డైరెక్టర్, యానిమల్ వెల్ఫేర్ యాక్టివిస్ట్ ఎన్.ఎస్.ప్రవళిక, హన్మంతు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

డ్రగ్స్ సప్లయర్ అరెస్ట్
   
హైదరాబాద్‌, వెలుగు: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ టార్గెట్‌గా డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న ఓ డ్రగ్‌పెడ్లర్‌‌ను ఎక్సైజ్‌ టాస్క్​ఫోర్స్‌ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. నిఘా వర్గాల సమాచారంతో బుధవారం బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌‌.10లోని ఓ హాస్టల్‌లో టాస్క్​ఫోర్స్​ అధికారులు తనిఖీలు చేశారు. విజయవాడకు చెందిన హరి సతీశ్(32) అనే వ్యక్తి వద్ద 48 గ్రాముల ఎండీఎంఏ, 25 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు‌లో ఉంటున్న యెమన్‌ దేశానికి చెందిన ఓ వ్యక్తి వద్ద డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. మొత్తం 11 మంది కస్టమర్లను గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్ అంజిరెడ్డి తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే

వికారాబాద్, వెలుగు: దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన గణమైన చరిత్ర కాంగ్రెస్​పార్టీకే ఉందని మాజీ మంత్రి, కాంగ్రెస్​సీనియర్ నాయకుడు గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బుధవారం వికారాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గడ్డం ప్రసాద్​మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలు, లింగ విభేదాలు లేని సమాజం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్​ గాంధీ ప్రభుత్వాలు పనిచేశాయన్నారు. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’కు ప్రజల నుంచి వచ్చే స్పందన చూసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భయపడుతున్నాయన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మతాలు, కులాలను విభజిస్తున్నాయని మండిపడ్డారు. ఇది దేశ సమగ్రతకు మంచిది కాదని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. సీనియర్ నాయకులు వెంకటస్వామి, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి చామల రఘుపతిరెడ్డి, జి.రాములు యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మహిళలపై దాడిచేసిన అడ్వకేట్​పై చర్యలు తీస్కోవాలి

ఖైరతాబాద్, వెలుగు: దళిత మహిళా కార్మికులను కులం పేరుతో దుషిస్తూ, దాడులకు పాల్పడిన అడ్వకేట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్.బాలమల్లేశ్​డిమాండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బుధవారం సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్​లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బాధితులతో కలిసి బాలమల్లేశ్​మాట్లాడారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం బొమ్మరాసిపేటలోని లియోనియా రిసార్ట్స్ భూములను కాజేసేందుకు అడ్వకేట్​దామోదర్​రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అచ్యుత్ ఇనిస్టిట్యూట్ లో హౌస్ కీపింగ్​చేస్తున్న ఇద్దరు మహిళలను వేధించి, అసభ్య పదజాలంతో దూషిస్తూ కొద్దిరోజుల క్రితం దాడిచేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై శామీర్ పేట పీఎస్​లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి దామోదర్ రెడ్డి, ఆయన అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలమల్లేశ్​డిమాండ్​చేశారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి.శంకర్, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి రొయ్యల కృష్ణమూర్తి, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి, దామోదర్ రెడ్డి బాధితుల సంఘం నాయకుడు సహదేవ్, ఏఐటీయూసీ నేత శంకర్ రావు, లియోనియా ఎంప్లాయ్స్​యూనియన్ ప్రధాన కార్యదర్శి కోమల తదితరులు పాల్గొన్నారు.

జీఎంఆర్‌ కబడ్డీ విన్నర్‌ యూనియన్‌ బ్యాంక్‌

హైదరాబాద్‌, వెలుగు: జీఎంఆర్‌ కబడ్డీ  స్టేట్‌ లెవెల్‌ చాంపియన్‌షిప్‌లో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విజేతగా నిలిచింది. పటాన్‌చెరు సమీపంలోని బీరంగూడలో బుధవారం జరిగిన ఫైనల్లో యూనియన్‌ బ్యాంక్‌ జట్టు 37–15తో సంకల్ప స్పోర్ట్స్‌ జట్టును ఓడించి ట్రోఫీ కైవసం చేసుకుంది. సంతోష్‌, సాయి కిరణ్‌ సత్తా చాటారు. ఈ టీమ్‌కు సతీశ్‌ కుమార్‌ కెప్టెన్‌గా, సుధాకర్‌ రెడ్డి మేనేజర్‌గా, శ్రీనివాస్‌ రెడ్డి కోచ్‌గా వ్యవహరించారు.

రిత్వికకు గోల్డ్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సబ్ జూనియర్, జూనియర్ సౌత్ జోన్ ఆక్వాటిక్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో తెలంగాణకు రెండు గోల్డ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌ లభించాయి.  మిట్టపల్లి రిత్విక  బుధవారం కేరళలోని తిరువనంతపురంలోని ఇంటర్నేషనల్ ఆక్వాటిక్ సెంటర్‌‌‌‌లో  జరిగిన గర్ల్స్ గ్రూప్-1 విభాగం 50 మీ బ్రెస్ట్ స్ట్రోక్‌‌‌‌లో 35.91 టైమింగ్‌‌‌‌తో అగ్రస్థానంతో బంగారు పతకం గెలిచింది.  గర్ల్స్‌‌‌‌ (గ్రూప్‌‌‌‌3)   4x 50 మీ ఫ్రీస్టయిల్ రిలేలో శివాని కర్రా, దిత్య చౌదరి, మేఘనా నాయర్, అనికా డెబోరాతో కూడిన టీమ్‌‌‌‌ 2 నిమిషాల 08.98సెకండ్ల టైమింగ్‌‌‌‌తో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌తో గోల్డ్‌‌‌‌ కైవసం చేసుకుంది. కర్నాటక, తమిళనాడు  జట్లు సిల్వర్‌‌‌‌, బ్రాంజ్‌‌‌‌ నెగ్గాయి.

ఫార్మా సిటీని వెంటనే రద్దు చేయాలి

ఎల్​బీనగర్, వెలుగు: పార్టీలకు అతీతంగా ఫార్మా సిటీని వ్యతిరేకించాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. ఒకేచోట వందల కంపెనీలు పెడితే పెను ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని, ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోవాలని కోరారు. హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీలో భూములు కోల్పోతున్న రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి, నానక్ నగర్, తాటిపర్తి, కుర్మిద్ధ గ్రామాల రైతులు చేపట్టిన రెండ్రోజుల పాదయాత్ర ముగిసింది. బుధవారం మేడిపల్లి నుంచి తుర్కయాంజాల్​లోని ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్న రైతులు మాట్లాడుతూ ఫార్మా సిటీని వెంటనే రద్దు చేయాలని, ఆన్ లైన్ పహానీలో రైతుల పేర్లు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని, బాధిత రైతులకు రైతు బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలో స్థానిక ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి, కోదండరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ ఒకే ప్రాంతంలో వందల ఫార్మా కంపెనీలు పెడితే పరిసరగ్రామాల ప్రజలు బతకలేరని చెప్పారు. ప్రభుత్వం మొండిపట్టుదలకు పోవద్దని సూచించారు. బీఆర్ఎస్ నాయకులు దీనిపై స్పందించాలని కోరారు. మల్​రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. ఫార్మా సిటీ రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేకపోతే రైతులతో కలిసి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామని హెచ్చరించారు.