
హైదరాబాద్, వెలుగు : ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ ఈ నెల 27న రాష్ట్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయా లని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. ఈ మేరకు ఆమె శనివారం సెక్రటేరియెట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉపరాష్ట్రపతి రాష్ట్రానికి రావడం తొలిసారి కావడంతో పోలీస్ బందోబస్తు, పోలీస్ బ్యాండ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.
బ్లూ బుక్ ప్రకారం తగిన భద్రత కల్పించడంతో పాటు ట్రాఫిక్, బందోబస్తుకు సంబంధించిన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని తెలిపారు. ఉపరాష్ట్రపతి పర్యటనకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో డీజీపీ రవిగుప్తా, ఫైర్ డిపార్ట్మెంట్ డీజీ నాగిరెడ్డి
ప్రభుత్వ కార్యదర్శి రాహుల్ బొజ్జా, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా చొంగ్తు, ఆర్ అండ్ బీ సెక్రటరీ శ్రీనివాస్ రాజు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్తదితరులు పాల్గొన్నారు.