సంప్రదాయాలు, పద్దతులు మన పిల్లలకు నేర్పాలి

సంప్రదాయాలు, పద్దతులు మన పిల్లలకు నేర్పాలి

మాదాపూర్, వెలుగుఏ దేశం వెళ్లినా, ఏ ఖండం వెళ్లినా మన తెలుగు సంప్రదాయాలను, తెలుగు పండుగలను, పద్ధతులను, భాషను మరవకూడదని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ఇప్పటితరం పిల్లలకు మన తెలుగు పండుగలు ఏమిటనేవి కూడా సరిగ్గా తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  గురువారం హైదరాబాద్​లోని మాదాపూర్​ శిల్పారామంలో స్వర్ణభారత్​ ట్రస్ట్, ముప్పవరపు ఫౌండేషన్​ 10వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా సంక్రాంతి సంబురాలు ఏర్పాటు చేశారు. వేడుకలో ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ.. మన భాష ఏమిటి? మన పండుగలు ఏమిటి? మన సంప్రదాయాలు ఏమిటి? అనేవి పిల్లలకు తల్లిదండ్రులు నేర్పాలని  సూచించారు. మనం ఎంత సంపాదించినా అందులో కొంతైనా దానం చేయాలన్నారు. తాను సంపాదించింది పేదల కోసం ముప్పవరపు ఫౌండేషన్​ ద్వారా అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రాచీన కాలం నుంచి తెలుగు భాషకు గొప్ప గుర్తింపు ఉందని, దేశంలోనే ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఎంతో మంది కవులు, రచయితలు తెలుగు భాష గొప్పతనాన్ని వివరిస్తూ ఎన్నో పాటలు, కవితలు, రచనలు సాగించారని వివరించారు. వ్యవసాయంతో ముడిపడిన సంక్రాంతి పండుగను  ప్రతి ఒక్కరూ తమ గ్రామాల్లో జరుపుకోవాలన్నారు.

వెంకయ్య.. ఆదర్శం: గవర్నర్​ తమిళిసై

తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి సంక్రాంతి పండుగను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని గవర్నర్​ తమిళిసై అన్నారు. రాజకీయాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా వెంకయ్యనాయుడు ఆదర్శమని, ముప్పవరపు ఫౌండేషన్​ ద్వారా  పేదలకు సాయం చేయడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. హిమాచల్​ప్రదేశ్​ గవర్నర్​ దత్తాత్రేయ మాట్లాడుతూ.. చిన్నప్పుడు ఎన్నో కష్టాలుపడ్డ వెంకయ్యనాయుడు తనలా ఎవరూ కష్టపడొద్దని ట్రస్ట్​ ద్వారా సేవ  చేస్తున్నారని తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం ఆశించకుండా ట్రస్ట్​ను నడుపుతూ పేదలకు సేవ చేస్తున్న వ్యక్తి వెంకయ్య  అని ప్రశంసించారు. వేడుకలో హైకోర్టు చీఫ్  జస్టిస్​ రాఘవేంద్ర చౌహాన్​, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్, ఎంపీ సుజనాచౌదరి, సినీ ప్రముఖులు వెంకటేష్, మహేష్​బాబు, రాఘవేంద్ర​రావు, మురళీమోహన్​, తనికెళ్ల భరణి తదితరులు
పాల్గొన్నారు.