
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఓటింగ్పై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. భారత 17వ ఉప రాష్ట్రపతి ఎన్నిక ఇప్పటికే మొదలైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ తొలి ఓటు వేశారు. ఎన్డీయే తరఫున సీపీ రాధాకృష్ణన్, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో రహస్య బ్యాలెట్ ద్వారా ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. అభ్యర్థులను ప్రాధాన్యతా క్రమంలో ర్యాంక్ చేస్తారు.
ఎన్నికల్లో గెలవాలంటే ఒక అభ్యర్థి మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో సగానికి పైగా కలిగి ఉండాలి. ఏ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓట్లలో మెజారిటీ లభించకపోతే.. అత్యల్ప సంఖ్యలో ఓట్లు ఉన్న అభ్యర్థిని తొలగించి, అతని బ్యాలెట్ పత్రాలను ఆ తర్వాత అందుబాటులో ఉన్న ప్రాధాన్యతలకు బదిలీ చేస్తారు. అభ్యర్థి మెజారిటీ సాధించే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రపోర్షనల్ రెప్రజెంటేషన్ సిస్టమ్‌తో సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ వోట్ (ఎస్టీవీ) పద్ధతిలో ఎన్నిక జరుగుతుంది.
పలు ఖాళీల తర్వాత.. ప్రస్తుతం లోక్ సభలో 542 మంది, రాజ్యసభలో 239 మంది సభ్యులు కలిపి మొత్తం 781 మంది ఉన్నారు. అయితే, రాష్ట్రపతి అభ్యర్థి గెలుపొందాలంటే.. మ్యాజిక్ ఫిగర్ కనీసం 391 ఓట్లు అవసరం. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 425 మంది సభ్యుల మద్దతు ఉంది. అలాగే, బయటి నుంచి వైసీపీ మద్దతు ఇస్తున్నది. రాజ్యసభ, లోక్ సభలో వారికి 11 మంది సభ్యులు ఉన్నారు. ఇండియా కూటమి సంఖ్యా బలం 325 గా ఉంది.