జర్నలిస్టులు కరోనా వారియర్స్

జర్నలిస్టులు కరోనా వారియర్స్
  • మెచ్చుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
  • ప్రెస్ ఫ్రీడం డే సందర్భంగా మీడియా ప్రతినిధులకు గ్రీటింగ్స్

న్యూఢిల్లీ: వరల్డ్ ప్రెస్ ఫ్రీడం డే సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జర్నలిస్టులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మీడియాను ప్రశంసించారు. కరోనాను ఎదుర్కోవడంలో డాక్టర్లు, పోలీసులతో పాటు మీడియా ప్రతినిధులు కూడా కృషి చేస్తున్నారని మెచ్చుకున్నారు. మీడియా ప్రతినిధులు, సంస్థలు.. జర్నలిజం సూత్రాలకు కట్టుబడి ఉండాలని ఆదివారం ట్వీట్ చేశారు. ‘‘కరోనాను ఎదుర్కోవడంలో డాక్టర్లు, పోలీసులతో పాటు జర్నలిస్టులు ముందువరుసలో ఉండి పోరాడారు. నిజం, నిష్పాక్షికత, కచ్చితత్వం, జవాబుదారీతనం, నైతికతలకు కట్టుబడి ఉండాలని, ప్రజాస్వామ్య వ్యవస్థకు, సమాజానికి వాచ్​డాగ్​లా వ్యవహరించాలని మీడియాను కోరుతున్నాను”అని ట్వీట్ చేశారు.

అత్యవసర సమయంలో తప్ప, మీడియా ఎల్లప్పుడూ స్వాతంత్ర్యానికి కట్టుబడి ఉందని వైస్ ప్రెసిడెంట్ అన్నారు. ప్రజా సంక్షేమంతో పాటు దేశాభివృద్ధిలో మీడియా భాగస్వామ్యం కావాలని కోరారు. ముఖ్యంగా, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టవలసిన అవసరం ఉందన్నారు. మే 3 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా వెంకయ్యనాయుడు ప్రెస్ ఫ్రీడంకు సంబంధించిన ప్రముఖుల సూచనలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.