సాహితీ ఇన్‌ఫ్రా స్కామ్‌లో బీఆర్ఎస్ పెద్దల హస్తం.. న్యాయం చేయాలంటూ బాధితుల ఆందోళన

సాహితీ ఇన్‌ఫ్రా స్కామ్‌లో బీఆర్ఎస్ పెద్దల హస్తం.. న్యాయం చేయాలంటూ బాధితుల ఆందోళన

బషీర్ బాగ్, వెలుగు: ప్రీ లాంచ్​ఆఫర్​పేరుతో సాహితీ ఇన్​ఫ్రా కంపెనీ తమను మోసం చేసిందని బాధితులు శనివారం బషీర్ బాగ్ లోని సీసీఎస్ ఆఫీస్​ముందు ఆందోళనకు దిగారు. 2,500 మందిని మోసం చేసి రూ.1,500 కోట్లు కొట్టేసిందని ఆరోపించారు. ఈ సందర్భంగా బాధితులు సంపత్ రావు, శివాజీ, రఘునందన్ అడ్వకేట్స్​పోతిరెడ్డి కృష్ణకాంత్, మురళీకృష్ణతో కలిసి మాట్లాడారు. సాహితీ ఇన్​ఫ్రా కంపెనీ సంగారెడ్డి జిల్లా అమీన్‌‌పూర్‌‌లో ‘సాహితీ శర్వాణి ఎలైట్’ పేరుతో 25 ఎకరాల్లో 32 అంతస్తులతో 10 టవర్లు నిర్మిస్తామంటూ దాదాపు రూ.1,500 కోట్లు వసూలు చేసిందని చెప్పారు. ప్రీ లాంచ్​ఆఫర్​అంటూ తక్కువ ధరకు ఫ్లాట్లు ఇస్తామంటే ఎంతో మంది డబ్బులు కట్టారని తెలిపారు. 

చివరికి కంపెనీ మోసం చేసిందని వాపోయారు. తమకు స్థలం లేదా డబ్బులు ఇప్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఫాస్ట్​ట్రాక్​కోర్టు ఏర్పాటు చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సాహితీ ఇన్​ఫ్రా స్కామ్ లో బీఆర్ఎస్ పెద్దల హస్తం ఉందని, అందుకే విచారణ ఆలస్యం అయిందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి, తమకు న్యాయం చేయాలని కోరారు. సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్​రావు అరెస్ట్​కావడంతో ఈ కేసు నీరుగారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన స్థానంలో మరో అధికారిని నియమించి, దర్యాప్తును వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.  తమ కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరారు.