ధరణితో మా భూములను కాజేసిండ్రు .. భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న బాధితుల

ధరణితో మా భూములను కాజేసిండ్రు .. భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న బాధితుల

 

  •  కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని బాధితుల ధర్నా

హుస్నాబాద్, వెలుగు: ధరణి పోర్టల్​ను అడ్డం పెట్టుకొని కొందరు తమ భూములను కాజేశారని బాధితులు ఆందోళనకు దిగారు. తిరిగి ఇప్పించాలని డిమాండ్​చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​మండలం పోతారం(ఎస్​), వంగరామయ్యపల్లిలోని తమ భూములను అక్రమంగా పట్టా చేయించుకున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​చేశారు. బాధితులు కాలేజ్ రాజేశ్, కాలేజ్ శివ, కాలేజ్ రాజుకుమార్, వేముగంటి రవి, వేముగంటి వెంకటేశ్ బుధవారం హుస్నాబాద్​లోని ఐఓసీ బిల్డింగ్​ఎదుట ధర్నా చేపట్టారు.

తమ తాతలు, తండ్రులు దశాబ్దాల క్రితం పోతారం(ఎస్​), వంగరామయ్యపల్లి శివారులోని 9 ఎకరాల భూమిని కొనుక్కొని ఇండ్లు కట్టుకున్నారన్నారు. గత బీఆర్ఎస్​ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్​తో ఆ భూములను మాజీ ఎంపీటీసీ బొమ్మగాని హరిబాబు, వ్యవసాయ మార్కెట్​మాజీ డైరెక్టర్​పంజా సంపత్, బోడ రవి, కంసాని మల్లారెడ్డి అక్రమంగా పట్టా చేయించుకున్నారని ఆరోపించారు. సర్వే నంబర్లలోని​250, 263లో సుమారు 4 ఎకరాల భూమిని పట్టా చేయించుకున్నారని, కొద్ది రోజుల నుంచి సదరు వ్యక్తులు అది తమ భూమి అని, ఇండ్లు ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని వాపోయారు.

తాము 70 ఏండ్ల నుంచి ఇక్కడ ఉంటున్నామని, ఎందుకు వేధిస్తున్నారని నిలదీస్తే దౌర్జన్యానికి దిగుతున్నారని, మహిళలను బూతులు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని, వారిపై చర్యలు తీసుకొని, తమ భూములను తిరిగి తమ పేరున పట్టా చేయించాలని డిమాండ్​చేశారు. లేకుంటే ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. కొందరు అధికారులు వచ్చి విచారణ జరిపి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం బాధితులు ఆర్డీఓ బెన్​శాలోమ్​కు వినతిపత్రం ఇచ్చారు.