ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉప ఎన్నిక హామీలను నెరవేరుస్తాం 

నల్గొండ, వెలుగు : మునుగోడు ఉప ఎన్నికల ఫలితం టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, సీపీఎం, సీపీఐ కలిసి సాధించిన విజయమని విద్యుత్‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. ఆదివారం నల్గొండలో మీడియాతో మాట్లాడారు. వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకోవడం గెలుపునకు ఎంతో దోహదపడిందన్నారు. నియోజకవర్గ ప్రజలు కేసీఆర్‌‌‌‌‌‌‌‌పై పూర్తి విశ్వాసంతో ఉండడం వల్లే ఈ ఫలితం ఇచ్చారన్నారు. ఉపఎన్నికల సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తామని, ఏడాది కాలంలోనే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ను ప్రజలు ఆమోదిస్తున్నారని ఈ రిజల్ట్‌‌‌‌‌‌‌‌తో రుజువైందని, బీజేపీ పతనానికి మునుగోడు ఎన్నికే నాంది అన్నారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా, ప్రజలంతా టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ వైపే ఉన్నారని, ఆ పార్టీ చేసిన క్షుద్ర రాజకీయాలను ప్రజలు తిరస్కరించారన్నారు. రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదని, డబ్బు, అహంకారంతో ఎన్నికల్లో పోటీ చేసిన రాజగోపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డిని మునుగోడు ప్రజలు ఇంటికి పంపారని ఎద్దేవా చేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి, రవీంద్రకుమార్‌‌‌‌‌‌‌‌, చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీ ఎంసీ. కోటిరెడ్డి, ఎలిమినేటి సందీప్‌‌‌‌‌‌‌‌రెడ్డి, మేడె రాజీవ్‌‌‌‌‌‌‌‌సాగర్‌‌‌‌‌‌‌‌, జిల్లా శంకర్, రావుల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.

కంపెనీల సబ్సిడీ ఇస్తలే...

  •     సూర్యాపేట జిల్లాలోని కంపెనీలకు విడుదల కాని రాయితీ
  •     ఆరేళ్లుగా రూ. 31 కోట్లు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో పెట్టిన ప్రభుత్వం

సూర్యాపేట, వెలుగు : నిరంతర విద్యుత్‌‌‌‌‌‌‌‌, అనేక రాయితీలతో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. కంపెనీలకు విడుదల చేయాల్సిన రూ. 31 కోట్ల సబ్సిడీ సొమ్మును ప్రభుత్వం ఆరేళ్లుగా మంజూరు చేయడం లేదు. ఓ వైపు ప్రభుత్వ సబ్సిడీ విడుదల కాకపోవడం, మరో వైపు బ్యాంకుల నుంచి అప్పులు పుట్టకపోవడంతో కంపెనీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యలతో కొత్తగా కంపెనీలు ఏర్పాటు చేసేందుకు సైతం పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదు. పెండింగ్‌‌‌‌‌‌‌‌ సబ్సిడీ ఇవ్వాలని ఆఫీసర్లు ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌ పెట్టినా ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. 

పరిశ్రమలకు భారీగా రాయితీలు

కంపెనీలు ఏర్పాటు చేసే వారిని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం భారీగా రాయితీలు ప్రకటించింది. ఇందులో భాగంగా స్థానికంగా కంపెనీలు ఏర్పాటు చేసే వారికి సబ్సిడీలు ఇస్తుండగా, కొత్తగా పరిశ్రమ ఏర్పాటు చేసే టైంలో స్టాంప్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌డ్యూటీ రీఫండ్‌‌‌‌‌‌‌‌, కంపెనీని బట్టి పెట్టుబడిలో 20 నుంచి 25 శాతం సబ్సిడీని ఇస్తోంది. మహిళా పారిశ్రామికవేత్తలకు సాధారణంగా లభించే రాయితీతో పాటు అదనంగా మరో 10 శాతం రాయితీ వస్తుంది. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు పరిశ్రమ స్థాయిని బట్టి అదనపు రాయితీ ఉంటుంది. ఇవే కాకుండా పావలా వడ్డీ లోన్లు, కరెంట్‌‌‌‌‌‌‌‌ వాడకంలో రాయితీ, పట్టణ, జిల్లా స్థాయిలో పరిశ్రమల వారీగా, ప్రాంతాలవారీగా ప్రత్యేక సబ్సిడీలను ప్రభుత్వం ప్రకటించింది. 

పెండింగ్‌‌‌‌‌‌‌‌లో రూ. 31 కోట్లు 

సూర్యాపేట జిల్లాలోని కంపెనీలకు ప్రభుత్వం వివిధ సబ్సిడీల రూపంలో రూ. 31 కోట్లు చెల్లించాల్సి ఉంది. కొత్త పరిశ్రమల ద్వారా రావాల్సిన ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ సబ్సిడీ రూ.2.20 కోట్లు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉండగా, పావలా వడ్డీ కింద 80 క్లయిమ్స్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి రూ.6.4 కోట్లు, సేల్స్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ కింద 63 క్లయిమ్స్‌‌‌‌‌‌‌‌కు రూ. 12 కోట్లు, వికలాంగుల కోట కింద 22 క్లయిమ్స్‌‌‌‌‌‌‌‌కు రూ.1.9 కోట్లు, టి ప్రైడ్‌‌‌‌‌‌‌‌ కింద 91 క్లయిమ్స్‌‌‌‌‌‌‌‌కు రూ.2.40 కోట్ల రాయితీ విడుదల చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఆరేళ్లుగా ఈ డబ్బులను విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వానికి ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌ పంపించాం 

జిల్లాలోని కంపెనీలకు రావాల్సిన రూ. 31 కోట్ల రాయితీ ఆరేళ్లుగా పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉంది. ఈ డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వానికి ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌ పంపించాం. ప్రభుత్వం ఇంకా విడుదల చేయడం లేదు.

- తిరుపతయ్య, పరిశ్రమల శాఖ జీఎం, సూర్యాపేట

రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి

యాదాద్రి, వెలుగు : ప్రతి ఒక్కరూ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని యాదాద్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బాలభాస్కర్‌‌‌‌‌‌‌‌రావు సూచించారు. చట్టాలపై అవగాహన పెంచుకుని, నేర రహిత సమాజం కోసం కృషి చేయాలని చెప్పారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం యాదాద్రి జిల్లా అనంతారంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యా హక్కు చట్టం--2009 ప్రకారం బడి ఈడు పిల్లలంతా బడిలో ఉండాలని, పిల్లలతో పనులు చేయిస్తే జరిమానాతో పాటు రెండేండ్ల జైలు శిక్ష విధించనున్నట్లు హెచ్చరించారు. చిన్న పిల్లలపై అఘాయిత్యాల నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు. భూ సమస్యలను కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలని చెప్పారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనన్నారు. సర్పంచ్‌‌‌‌‌‌‌‌ చిందం మల్లికార్జున్‌‌‌‌‌‌‌‌, భువనగిరి రూరల్‌‌‌‌‌‌‌‌ ఎస్సై హెచ్‌‌‌‌‌‌‌‌.రాఘవేందర్, ఎంపీటీసీ సామల వెంకటేశ్‌‌‌‌‌‌‌‌, ఉపసర్పంచ్‌‌‌‌‌‌‌‌ విఠల్‌‌‌‌‌‌‌‌ వెంకటేశ్‌‌‌‌‌‌‌‌, కార్యదర్శి నర్సింగ్‌‌‌‌‌‌‌‌రావు పాల్గొన్నారు.

ఆర్థిక, రాజకీయాల్లో గొల్లకురుమలు ముందుండాలి

మునగాల, వెలుగు : గొల్ల కురుమలు ఆర్థిక, రాజకీయ రంగాల్లో ముందుండాలని గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బొల్లం అశోక్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. సూర్యాపేట జిల్లా మునగాలలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కడం లింగయ్య అధ్యక్షతన జరిగిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. గొల్ల కురుమలు సామాజికంగా వివక్షకు గురువుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 50 సంవత్సరాల నిండిన గొల్ల కురుమలకు రు. 3 వేల పెన్షన్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని, ప్రతి సొసైటీకి పది ఎకరాల భూమి కేటాయించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. నగదు బదిలీ పథకం ఒక మునుగోడుకే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి వీరబోయిన రవి, గడ్డం ఉపేందర్, ఎల్లావుల వెంకన్న, అమరబోయిన మట్టయ్య, గడ్డం వెంకన్న, గౌని శీను, ముంత లింగయ్య పాల్గొన్నారు. 

వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి

హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, వెలుగు : హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ మండలంలోని అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వడ్లు కొనాలని సీపీఎం మండల కార్యదర్శి పోషణపోయిన హుస్సేన్‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. మండలంలోని శ్రీనివాసపురంలో ఆదివారం రైతులతో మాట్లాడారు. వరికోతలు ప్రారంభం అయినందున అన్ని గ్రామాల్లో ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఇటీవల కురిసిన వానల వల్ల వడ్లు రంగు మారాయని, ఆ దాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని, దెబ్బతిన్న రైతులకు ఎకరాకు రూ. 30 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. సీపీఎం మండల కమిటీ సభ్యుడు తంగిళ్ల వెంకట్‌‌‌‌‌‌‌‌, నూకల చంద్ర, లక్ష్మీనరసమ్మ, నరసింహచారి, శేషగిరిరావు, గోపరాజు, జింకుల గోపి పాల్గొన్నారు.