కొత్తింటికి.. 17ఏళ్ల తర్వాత మారిన మాజీ సీఎం అడ్రస్

కొత్తింటికి.. 17ఏళ్ల తర్వాత మారిన మాజీ సీఎం అడ్రస్

మధ్యప్రదేశ్‌కు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ ఇప్పుడు తన చిరునామాను మార్చారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం చాలాకాలం తర్వాత బి8 74 బంగ్లాకు మారనున్నారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబ సమేతంగా ఆలయంలో పూజలు చేశారు. మధ్యప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి.. బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ స్థానంలో మోహన్ యాదవ్‌ను ఆ పార్టీ ఎంపిక చేసింది.

బుద్నీ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న శివరాజ్ సింగ్.. గత పదహారున్నరేళ్లుగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ కొత్త సీఎంగా మోహన్ యాదవ్ ను ఎంపిక చేయడంతో.. ఇప్పుడు సీఎం ఇంటిని శివరాజ్ సింగ్ ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన రాజధాని భోపాల్‌లోని రింగ్ రోడ్‌లో ఉన్న బంగ్లాకు మారనున్నారు. రెండు బంగ్లాలను కలిపి ఈ బంగ్లాను సిద్ధం చేశారని, ఈ బంగ్లాను శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కేటాయించారని చెబుతున్నారు. ఈ బంగ్లా ఏర్పాటుకు ప్రభుత్వం రూ.2 కోట్లకు పైగా వెచ్చించినట్లు కూడా చర్చ జరుగుతోంది. సీఎం హౌస్ నుండి బయలుదేరిన తర్వాత, శివరాజ్ సింగ్ చౌహాన్ ఇప్పుడు తన కుటుంబంతో కలిసి ఈ బంగ్లాలో నివసించబోతున్నారు.

ప్రజలు, రాష్ట్ర సంక్షేమం కోసం ఇక్కడ తాను చాలా నిర్ణయాలు తీసుకున్నానని తన బంగ్లాను ఖాళీ చేసిన తర్వాత మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. మోహన్ యాదవ్, అతని బృందాన్ని రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేలా చేయాలని కోరుకుంటున్నానన్నారు. ముఖ్యమంత్రిగా తన ప్రయాణంలో తనకు సహాయం చేసిన వారి జ్ఞాపకాలు, ప్రేమతో ఇక్కడ్నుంచి సంతోషంగా తిరిగి వెళ్తున్నానని చెప్పారు.