నెట్ ​లేకుండానే మొబైల్​లో వీడియో స్ట్రీమింగ్​

నెట్ ​లేకుండానే మొబైల్​లో వీడియో స్ట్రీమింగ్​
  • ఇందుకోసం డీ2ఎం టెక్నాలజీ

న్యూఢిల్లీ :  స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన డైరెక్ట్- టూ -మొబైల్ (డీ2ఎం) టెక్నాలజీ ద్వారా మొబైల్​ ఫోన్లకు నేరుగా వీడియోలను చూడవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం త్వరలో 19 నగరాల్లో ట్రయల్స్ నిర్వహిస్తామని సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు.  డీ2ఎం టెక్నాలజీ ద్వారా మొబైల్ వినియోగదారులు  సిమ్​ కార్డ్ లేదా ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే వీడియోలను స్ట్రీమ్ చేయవచ్చు. సమీప భవిష్యత్తులో డైరెక్ట్ -టు-మొబైల్ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వస్తుంది. 

డీ2హెచ్, ఎఫ్​ఎం రేడియో తరహాలోనే ఈ టెక్నాలజీ పనిచేస్తుంది.  డీ2ఎం ట్రయల్స్ కోసం 470-–582 మెగాహెజ్​ స్పెక్ట్రమ్‌‌‌‌ను  ఉపయోగిస్తామని చంద్ర వెల్లడించారు. మొబైల్స్​కు నేరుగా వీడియోలు​ ప్రసారం కావడం వల్ల టెలికం, బ్రాడ్​బ్యాండ్​నెట్​వర్క్​లపై భారం తగ్గుతుందని చెప్పారు.  డీ2ఎం టెక్నాలజీని పరీక్షించడానికి గత ఏడాది బెంగళూరు, కర్తవ్య పథ్,  నోయిడాలో  పైలట్ ప్రాజెక్టులు జరిగాయి.