
టైమ్‌కు సాలరీ రాక రాష్ట్ర వ్యాప్తంగా వేలమంది విద్యావలంటీర్లు(వీవీ) పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఉద్యోగం చేసుకునేటోళ్లకు జీతం వారం లేట్ అయితేనే ఇంట్లబైట పరిస్థితి కిందమీదైనట్లుంటది. అలాంటిది కొన్ని జిల్లాల్లో నాలుగు నెలలుగా నయాపైస జీతం రాకుంటే ఎంత తక్లీఫ్ అయితది. పాతా ఖాతా పైసలిస్తెనే సామన్లు ఇస్తమని షాపుల్లో అంటుంటే ఏంజెప్పలేక ఉత్తచేతుల్తో ఎన్కకు వచ్చుడైంతుదంని వీవీలు బాధపడుతున్నరు. ఆడోఈడో బదలోసదలో తెచ్చి ఇన్నాళ్లు ఇళ్లు ఎల్లదీశీనంగని ఇంక ఈ కష్టాలు మాతో కాదంటున్నరు. ఆల్శం చేయకుంట ప్రభుత్వం జీతాలిస్తేనే మా కష్టాలు తీరుతయంటున్నరు.
విద్యావలంటీర్లను మెరిట్ కమ్ రోస్టర్ పద్ధతిలో ఆయా మండలాల ఎంఈవోలు ఎంపిక చేశారు. మండలంలోని ఖాళీల ప్రకారం పాఠశాలలను కేటాయించారు. గతేడాది వీరందరిని విధుల్లోకి తీసుకున్నారు. ఈ నెల 12న స్కూళ్లు రీఓపెన్ అయినయి. అయితే టీచర్ల పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మళ్లీ నోటీఫికేషన్ వేసి కొత్తగా నియామకాలు చేపట్టకుండా.. గతంలో పనిచేసిన వారినే రెన్యూవల్ చేసింది ప్రభుత్వం. దీని కోసం వీవీలు రాష్ట్ర స్థాయిలో నేతలతో ఒత్తిడి తీసుకొచ్చారు.
నాలుగు నెలలుగా జీతాల్లేవ్..
విద్యావలంటీర్లకు నెలకు రూ.12వేల గౌరవ వేతనం ఇస్తున్నారు. అది కూడా ప్రతి నెలా ఇవ్వరు. రెండుమూడు నెలలకోసారి ఇస్తుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 15,681 మంది వీవీలు పనిచేస్తున్నారు. వీరిలో చాలా మందికి గత నాలుగు నెలలుగా జీతాలు రాలేదు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, సిద్దిపేట వంటి జిల్లాల్లో నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వట్లేదు. మిగతా జిల్లాల్లో రెండున్నర నెలల జీతాలు రాలేదు. అసలే అరకొర వేతనంతో జీవనం సాగిస్తున్న వీరు అవి కూడా టైమ్‌కు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీవీల్లో కూడా చాలా మంది మంచి టీచింగ్ అనుభవం ఉన్న వారే ఉన్నారు. కుటుంబ అవసరాలకు తోడు.. పిల్లలను స్కూళ్లో చేర్పించే టైమ్ కావడంతో చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నరు. పలు సార్లు నాయకులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కావడం లేదు. చాలా చోట్ల ఫిబ్రవరి నుంచి జీతాలు లేవు. దీని ప్రభావం మరో రెండు నెలల పాటు ఉంటుంది. గతేడాది జులై చివరిలో వచ్చాయని.. ఈ ఏడాది కూడా అప్పుడే వస్తాయని కొందరు అంటున్నారు. అదే జరిగితే తామంతా అడుక్కోవల్సిన పరిస్థితే ఏర్పడుతుందని వీవీలు వాపోతున్నారు.
ఎందుకీ పరిస్థితి..?
మొదటి నుంచి కూడా వీవీలు అంటే ప్రభుత్వానికి చిన్నచూపే. కొన్ని బడుల్లో ప్రభుత్వ టీచర్లు ఉన్నా… వీరితోనే క్లాసులు కూడా చెప్పిస్తున్నారు. ఇలా అన్ని రకాలుగా వీరి సేవలను వినియోగించుకుంటున్నా… జీతాలు మాత్రం నెలనెలా చెల్లించట్లేదు. దీంతో వీరంతా నైరాశ్యంలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 50 కోట్ల బకాయిలు ఉన్నాయి. బడ్జెట్ లేకపోవడంతోనే సకాలంలో వీరికి జీతాలు చెల్లించలేకపోతున్నారు. అన్ని జిల్లాల్లోని డీఈవో కార్యాలయాల్లో జీతాలకు సంబంధించిన బిల్లులు తయారుచేసి రెడీగా ఉంచారు. బడ్జెట్ రాగానే ఇస్తామని చెబుతున్నారు. అయితే ఆ బడ్జెట్ వచ్చేది ఎప్పుడు.. మాకు వేతనాలు ఇచ్చేది ఎప్పుడంటూ ఎదురు చూస్తున్నారు. నెలలుగా జీతాలు రాక కుటుంబాలు వెళ్లదీయలేని దుస్థితిలో ఉన్నారు. దీనికి తోడు సమాన పనికి సమాన వేతనం అన్న నేతల హామీ నేటికి నీటి మూటగానే ఉంది. రూ.21వేలు వేతనం ఇస్తామని చెప్పినా.. అమలు కావడం లేదు.
ఇల్లు గడవడమే ఇబ్బందిగా ఉంది
జనవరి నెల వరకు జీతాలు వచ్చాయి. ఫిబ్రవరి నుంచి రావడం లేదు. వచ్చేదే తక్కువ. అవి కూడా సకాలంలో ఇవ్వక పోతే ఎట్లా. స్కూళ్లు మొదలైనయి. పిల్లలకు ఫీజులు, పుస్తకాలు, యూనిఫాంలకు డబ్బులు అవసరం. చేతిలో పైసల్లేవు. ఎండకాలం నెలన్నర రోజులు.. అంతకుముందు రెండున్నర నెలలు ఇట్ల నాలుగు నెలలుగా చేతిలో రూపాయి లేదు. వీలైనంత త్వరగా బడ్జెట్ కేటాయించి జీతాలు విడుదల చేయాలి.
-మంగ్త్యా, విద్యా వలంటీర్,
జనగామ జిల్లా
హామీలు అమలెప్పుడు..
విద్యావలంటీర్ల జీతాల చెల్లింపులో ఏటా సమస్య వస్తుందని తెలిసినా ఇలానే వ్యవహారిస్తున్నారు. సరైన సమయంలో బడ్జెట్ విడుదల చేయకపోవడంతో జీతాలు ఆగిపోతున్నాయి. వలంటీర్లుగా పనిచేసేవాళ్లంతా పేద, దిగువ మధ్యతరగతికి చెందిన వారే. వారి పరిస్థితి దృష్టిలో ఉంచుకొని వేతనాలు వెంటవెంటనే చెల్లించాలి. గతంలో సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పారు. అది ఎక్కడా అమల్లో లేదు. అది అమలు చేస్తే మాకు రూ. 21వేలు జీతం వస్తది.
-కన్నెబోయిన సత్తయ్య,
వీవీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
నెల నెల ఇవ్వాలి
విద్యావలంటీర్లకు ప్రతి నెలా 5వ తారీఖు లోగా వేతనాలు వేయాలి. ఇందుకు ప్రతి నెలా బడ్జెట్ విడుదల చేయాలి. నాలుగు ఏళ్ల నుంచి వీవీగా పనిచేస్తున్నాను. ఏటా ఎండాకాలంలో ఇదే పరిస్థితి. గతంలో 10, 15 రోజుల్లోనే ఖాతాల్లో వేసేవారు. అయితే ఈసారే నెలలు నెలలు జరుపుతున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న మాకు ప్రభుత్వం అండగా నిలవాలి.
-రమేశ్, యాదాద్రి భువనగిరి జిల్లా
బిల్లు లు పంపించాము
కరీంనగర్ జిల్లాలో 134 మంది విద్యవలంటీర్లు పని చేస్తున్నారు. వీరికి మూడు నెలల నుంచి జీతాలు రాలేదు. వీటికి సంబంధించిన బిల్లుల ప్రపోజల్స్ ప్రభుత్వానికి ఇప్పటికే అందించాం. మొన్నటి వరకు ఎన్నికల కోడ్ ఉండడం వల్ల రాలేదు. బడ్జెట్ కోసం చూస్తున్నాం. త్వరలోనే వస్తాయి.
-వెంకటేశ్వర్లు, డీఈవో, కరీంనగర్