- 27 నుంచి వచ్చే నెల 2 వరకు నిర్వహణ
హైదరాబాద్, వెలుగు: దక్షిణ మధ్య రైల్వేలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 27 నుంచి నవంబర్ 2 వరకు ఈ వారోత్సవాలు జరగనున్నాయి. సోమవారం దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం రైల్ నిలయంలో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐఏఎస్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా చైర్మన్ కె.పద్మనాభయ్య హాజరయ్యారు. రైల్వేలో ‘నిఘా..- మన ఉమ్మడి బాధ్యత’థీమ్‌తో ఈ ఏడాది పనిచేయనున్నారు. ఈ సందర్భంగా 58వ ఎడిషన్ విజిలెన్స్ బులెటిన్‌ను విడుదల చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ కె.పద్మనాభయ్య మాట్లాడుతూ.. రైల్వేలు, రక్షణ శాఖలు దేశానికి మూలస్తంభాలని అన్నారు.
రైల్వేలు దేశాన్ని అనుసంధానించడంతో పాటు విభిన్న సంస్కృతుల ప్రజలను మమేకం చేస్తున్నాయని పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో రైల్వేల ప్రాముఖ్యత ఎంతో గర్వనీయమని చెప్పారు. ‘నిఘా..- మన ఉమ్మడి బాధ్యత’అనేది కేవలం నినాదం కాదని, ఆచరణ కోసం పిలుపు అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ శ్రీ సత్య ప్రకాశ్ పాల్గొన్నారు.
