విజిలెన్స్‌‌ డీజీ రాజీవ్‌‌ రతన్ కన్నుమూత

విజిలెన్స్‌‌ డీజీ రాజీవ్‌‌ రతన్ కన్నుమూత
  • గుండెపోటుతో చికిత్స పొందుతూ మృతి
  • మేడిగడ్డ ప్రాజెక్ట్‌‌ కేసులో దర్యాప్తు టీమ్​కు రతన్ సారథ్యం
  • ఈయన రిపోర్టు ఆధారంగానే జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు
  • డైనమిక్ ఆఫీసర్​గా పేరు.. సీఎం, గవర్నర్ సంతాపం
  • నేడు మహాప్రస్థానంలో అంత్యక్రియలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: విజిలెన్స్‌‌‌‌ అండ్‌‌‌‌ ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ డీజీ రాజీవ్‌‌‌‌ రతన్(59) కన్నుమూశారు. మంగళవారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌‌‌‌కి తరలించారు. హాస్పిటల్‌‌‌‌లో చికిత్స పొందుతూ రాజీవ్ రతన్ మృతి చెందారు. పంజాబ్​కు చెందిన 1991వ బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన రాజీవ్ రతన్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో కీలక హోదాల్లో పనిచేశారు. 

కరీంనగర్ జిల్లా ఎస్పీగా, హైదరాబాద్ రీజియన్ ఐజీగా, ఫైర్‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌ డీజీగా, డీజీపీ కార్యాలయంలో ఆర్గనైజేషన్ అడిషనల్ డీజీపీగా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా విధులు నిర్వహించారు. డిప్యూటేషన్ మీద ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్​లోనూ కొంత కాలం పనిచేశారు.  ప్రస్తుతం రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ డైరెక్టర్ జనరల్‌‌‌‌గా ఉన్నారు. 

విజిలెన్స్ డీజీ హోదాలో మేడిగడ్డ ప్రాజెక్ట్‌‌‌‌పై రాజీవ్ రతన్  సమగ్ర దర్యాప్తు జరిపారు. అతి తక్కువ కాలంలో పూర్తి ఆధారాలు సేకరించారు. విచారణలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గలేదు. ఆయన ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్​ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే డైనమిక్ ఆఫీసర్​గా, వివాదరహితుడిగా రాజీవ్ రతన్ గుర్తింపు పొందారు. వచ్చే అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. రాజీవ్ రతన్​కు భార్య, కొడుకు ఉన్నారు. 

పోలీస్ ఉన్నతాధికారుల నివాళి

రాష్ట్ర డీజీపీ రవిగుప్తా, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ శివధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఏసీబీ డీజీ సీవీ ఆనంద్‌‌‌‌, సైబరాబాద్‌‌‌‌ సీపీ అవినాశ్ మహంతి సహా ఇతర పోలీస్ ఉన్నతాధికారులు రాజీవ్ రతన్‌‌‌‌ పార్థివ దేహానికి నివాళి అర్పించారు. పోలీస్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌కు రాజీవ్‌‌‌‌ రతన్‌‌‌‌ అందించిన సేవలను కొనియాడారు. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ షేక్​పేటలోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు చేయనున్నారు.