
- జగిత్యాల మున్సిపాలిటీలో అవినీతి ఫిర్యాదులపై తనిఖీలు
- రూల్స్‌కు విరుద్ధంగా నిర్మిస్తున్న బిల్డింగ్‌లను పరిశీలించిన విజిలెన్స్ టీం
జగిత్యాల, వెలుగు: జగిత్యాల మున్సిపాలిటీలో అవినీతి ఆరోపణలపై స్టేట్ విజిలెన్స్ ఫోకస్ పెట్టింది. సోమవారం 18 మందితో కూడిన బృందం బల్దియాలోని వివిధ డిపార్ట్‌మెంట్లలో తనిఖీలు చేపట్టారు.
2023 ఏడాదిలో బల్దియాలో వివిధ డిపార్ట్‌మెంట్లలో అవినీతి జరిగిందని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్లకు వరుస ఫిర్యాదులతో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.
కాగా గతంలో అవినీతి ఆరోపణలతో నాలుగుసార్లు వివరాలు ఇవ్వాలని బల్దియా సిబ్బందిని కోరినప్పటికీ అక్కడి నుంచి సరైన స్పందన లేదు. దీంతో జూలై 1న విజిలెన్స్ ఆఫీసర్లు ఎంక్వైరీలో అవసరమైన సమాచారం కోసం జగిత్యాల కలెక్టర్‌కు రిమైండర్ జారీ చేశారు. అయినప్పటికీ సరైన సమాచారం రాకపోవడంతో సోమవారం 18 మంది విజిలెన్స్ ఆఫీసర్ల టీం విజిలెన్స్సీఐ వరుణ్ బల్దియాలో ఎంక్వైరీ చేపట్టారు.
రూల్స్ ఉల్లంఘనపై నజర్`
బల్దియా పరిధిలోని టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, శానిటేషన్ డిపార్ట్‌మెంట్లతోపాటు బిల్డింగ్‌ల పర్మిషన్లలో రూల్స్ ఉల్లంఘనలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా పట్టణంలోని కొన్ని బిల్డింగ్‌లను స్వయంగా పరిశీలించారు. బిల్డింగ్ పర్మిషన్లు, మొబైల్ టవర్స్, అడ్వర్టైజ్‌మెంట్ టాక్స్, మొబైల్ టవర్ టాక్స్ వివరాలు సేకరించారు. దాంతో పాటు రెవెన్యూ సెక్షన్ లో ట్యాక్స్ వసూలు చేసే విధానంతో పాటు మూడేళ్లుగా కలెక్టయిన ట్యాక్స్‌లు, సెల్ఫ్ అసెస్‌మెంట్ వివరాలు సేకరించారు.
శానిటేషన్ సెక్షన్‌లో ట్రెడ్ లైసెన్స్ జారీపై ఆరా తీశారు. 2023–24కి సంబంధించి ప్రతి నెలా డీజిల్ ఖర్చులు, వాటి బిల్లులు, శానిటేషన్ వాహనాలు, కనిపించకుండా పోయిన ట్రాక్టర్, మూడు ఆటోలపై ఆరా తీశారు. చివరగా ఇంజనీరింగ్ సెక్షన్ లోని నల్లా బిల్లుల అవకతవకలపై కూడా వివరాలను సేకరించారు.