- మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడి
- ముందస్తు సమాచారంతో షాపులు క్లోజ్ చేసిన డాక్యుమెంట్ రైటర్స్
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ దృష్టి సారించింది. శుక్రవారం కరీంనగర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. కార్యాలయంలోని రికార్డులను తనిఖీ చేశారు. భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వివరాలను సేకరించారు. ఈ అంశంపై పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. విజిలెన్స్ దాడుల సమాచారం ముందుగానే లీక్ కావడంతో డాక్యుమెంట్ రైటర్లు తమ షాపులను మూసివేసి వెళ్లిపోయినట్టు తెలిసింది. ఈ దాడుల్లో ఐవోపీలు అనిల్ కుమార్, వరుణ్ ప్రసాద్, ప్రశాంత్ రావు, రవీందర్, ఎమ్మార్వోలు దినేశ్‌చంద్ర, శ్రీనివాస్, ఏజీ వెంకట్ రెడ్డి తదితర సిబ్బంది పాల్గొన్నారు.
అడ్డగోలుగా వసూళ్లు..
మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీగా అక్రమ వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్-1 ప్రియాంకపై గతంలో ఏసీబీ అధికారులు దాడులు చేసి పలు అక్రమ లావాదేవీలను గుర్తించారు. అనంతరం కొంతమంది బాధితులు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ప్రియాంక మూడు నెలలుగా లాంగ్ లీవ్‌లో ఉండగా, సబ్ రిజిస్ట్రార్-2 రాజిరెడ్డి ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. ఆయన సెలవులో ఉన్న సమయంలో సీనియర్ అసిస్టెంట్లకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇదే అదనుగా అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో డాక్యుమెంట్‌కు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం. విజిలెన్స్ అధికారుల విచారణలో ఈ అంశాలన్నీ వారి దృష్టికి వచ్చినట్టు తెలిసింది.

