
- వేలం వేసిన వడ్లనూ అమ్మేసుకున్నరు
- విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్దాడులతో వెలుగులోకి అక్రమాలు
గద్వాల, వెలుగు:వేలం వేసిన వడ్లను నిల్వ ఉంచుకోకుండా రైస్ మిల్లర్లు అమ్మేసుకొని కోట్లు కాజేశారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో రైస్ మిల్లర్ల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. శనివారం గద్వాల పట్టణంలోని శ్రీరామ రైస్ మిల్లులో విజిలెన్స్ ఆఫీసర్లు తనిఖీలు చేయడంతో రైస్ మిల్లర్ల అక్రమాలు బయటపడ్డాయి.
ఒక్క శ్రీరామ మిల్లులోనే రూ.2.25 కోట్ల విలువ చేసే 26,242 వడ్ల బస్తాలు మాయమైనట్లు గుర్తించారు. దీంతో సంబంధిత రైస్ మిల్ ఓనర్ పై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు సిఫారసు చేశారు. ఇలా జోగులాంబ గద్వాల జిల్లాలోని 33 రైస్ మిల్లుల్లో దాదాపు 25,503 మెట్రిక్ టన్నుల వడ్లు పక్కదారి పట్టినట్లు స్పష్టమవుతోంది.
లిక్కర్ ఫ్యాక్టరీలకు వడ్లు అమ్ముకున్నరు..
2022–-23 రబీ సీజన్ కు సంబంధించిన వడ్లను రైస్ మిల్లుల్లో నిల్వ ఉంచిన మిల్లర్లు, వాటిని బియ్యం రూపకంలో ప్రభుత్వానికి తిరిగి ఇవ్వలేదు. దీంతో ఆ వడ్లను రాష్ట్ర ప్రభుత్వం నలుగురు కాంట్రాక్టర్లకు రూ.2 వేలకు క్వింటాల్ చొప్పున ధర నిర్ణయించి వేలం వేసింది. వేలంలో వడ్లను దక్కించుకున్న కాంట్రాక్టర్ వాటిని లిఫ్ట్ చేయలేదు.
వాస్తవంగా కాంట్రాక్టర్ వడ్లు తీసుకోకపోతే వాటిని తమ రైస్ మిల్లులోనే ఉంచుకోవాలి. కానీ, వడ్లు తడిసిపోయాయని, పెట్టుకోవడానికి స్థలం లేదనే కారణాలు చూపించి వాటిని మిల్లరు లిక్కర్ ఫ్యాక్టరీలకు అమ్మేశారు. మరికొందరు బియ్యం ఆడించి వాటిని సీఎంఆర్ కింద గవర్నమెంట్ కు అందజేశారు. ఇలా జోగులాంబ గద్వాల జిల్లాలోని మిల్లుల్లో 10 వేల బస్తాల నుంచి లక్ష బస్తాల వరకు అమ్ముకున్నట్లు చెబుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల టన్నులు..
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 500 రైస్ మిల్లుల్లో 25 లక్షల టన్నుల వడ్లు నిల్వ ఉన్నట్లు రైస్ మిల్లర్లు చెబుతున్నారు. ఇందులో 10 లక్షల టన్నుల వడ్లు ప్రభుత్వానికి అందించగా, రూ.3 వేల కోట్ల విలువ చేసే 15 లక్షల టన్నుల వడ్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉందని నివేదికలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని పలు మిల్లుల్లో వడ్లను రెండున్నరేండ్లుగా నిల్వ ఉంచుకోలేక బియ్యంగా మార్చి, లేదంటే లిక్కర్ ఫ్యాక్టరీలకు అమ్మేసుకున్నారని అంటున్నారు.