స్కూల్కు తాళాలేసి లోపల ఇవేం పనులు.. గోడ దూకి మరీ గుట్టు రట్టు చేసిన ఫ్లైయింగ్ స్క్వాడ్..!

స్కూల్కు తాళాలేసి లోపల ఇవేం పనులు.. గోడ దూకి మరీ గుట్టు రట్టు చేసిన ఫ్లైయింగ్ స్క్వాడ్..!

జైపూర్: పరీక్షల నిర్వహణ విషయంలో ఫ్లైయింగ్ స్క్వాడ్స్ పాత్ర ఏంటో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. పరీక్షల నిర్వహణలో అవకతవకలకు తావు లేకుండా, మాస్ కాపీయింగ్ జరగకుండా చూడటంలో ఫ్లైయింగ్ స్క్వాడ్స్ కీలకంగా వ్యవహరిస్తారు. రాజస్థాన్ లో ఫ్లైయింగ్ స్క్వాడ్స్ వ్యవహరించిన తీరు ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. రాజస్థాన్ ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్లో పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు టీచర్లే బోర్డ్పై సమాధానాలు రాసి కాపీయింగ్ను ప్రోత్సహించారు. రాజస్థాన్ విద్యా శాఖలోని విజిలెన్స్ స్క్వాడ్ టీం చాకచక్యంగా ఈ గుట్టు రట్టు చేసింది. ఓపెన్ స్కూల్ విధానంలో 10, 12 తరగతులు చదివిన విద్యార్థులకు రాజస్థాన్లో ఎగ్జామ్స్ జరిగాయి. జోధ్పూర్ సమీపంలోని దేచు తాలూకాలో ఉన్న కొలు అనే గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్లో కూడా ఈ పరీక్షలు జరిగాయి.

రాష్ట్రం మొత్తం ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ జరుగుతుండటంతో ఫ్లైయింగ్ స్క్వాడ్ ఈ స్కూల్ వైపు కూడా వెళ్లారు. గేట్లు అనుమానాస్పదంగా లాక్ చేసి ఉండటంతో సందేహం కలిగింది. ఏదో తేడాగా ఉందని భావించిన ఫ్లైయింగ్ స్క్వాడ్ టీం గోడ దూకి మరీ పాఠశాల గదుల్లోకి సైలెంట్గా ఎంటరైంది. లోపలికి వెళ్లి చూస్తే ఏముంది. టీచర్లు బోర్డ్పై సమాధానాలు రాస్తుంటే ఆ జవాబులను చక్కగా ఆన్సర్ షీట్పై విద్యార్థులు రాసేసుకుంటున్నారు. విద్యార్థుల వద్ద నుంచి డబ్బులు తీసుకుని మాస్ కాపీయింగ్ ను సదరు టీచర్లు ప్రోత్సహించినట్లు తేలింది. ఒక విద్యార్థి రూ.2000 ఇవ్వగా, మరో విద్యార్థి రూ.2,100 ఇచ్చినట్లు విచారణలో బయటపడింది. ఈ ఘటనకు సంబంధించి ప్రిన్సిపాల్ రాజేంద్ర సింగ్ చౌహాన్ తో సహా 10 మంది టీచర్లపై కేసు నమోదు చేసినట్లు రాజస్థాన్ విద్యా శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రెగ్యులర్ విధానంలో చదువుకోవడానికి అవకాశం లేని వారికి ఓపెన్ స్కూల్ విధానంలో అవకాశం కల్పిస్తుంటే కొందరు ఇలా మాస్ కాపీయింగ్కు పాల్పడటంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.