డియర్ కామ్రెడ్: విజయ్ తో ఫుల్ ఇంటర్వూ..

డియర్ కామ్రెడ్: విజయ్ తో ఫుల్ ఇంటర్వూ..

అప్పటికే కలిసి నటించిన వారితో మళ్లీ నటిస్తే ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. రష్మికతోనూ అంతే. రియల్ లైఫ్​కి రీల్ లైఫ్​కి తేడా ఏమిటంటే.. ఫైట్ సీన్ చేసేటప్పుడు అవతలి వ్యక్తిపై ఎలాంటి కోపం లేకున్నా కొట్టినట్టు నటిస్తాం. అలాగే కిస్సింగ్‌‌ సీన్స్‌‌లోనూ ఎలాంటి ఫీలింగ్ లేకుండా నటిస్తాం. మరో ఏడాది తర్వాతైనా ఈ లిప్‌‌ లాక్స్‌‌ గురించి అందరూ నార్మల్‌‌గా ఆలోచిస్తారేమో.

నా సినిమాని నాకు నచ్చినట్టు ప్రమోట్ చేద్దామనే మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహించాను. ఒక సినిమాలో రెండు హిట్ సాంగ్స్ వస్తేనే సంతోషం. అలాంటిది ఈ సినిమాలోని 8 పాటల్లో 5  సూపర్బ్. అలాగే చెన్నై మినహా, బెంగళూరు, కొచ్చి ప్రాంతాలకు నేనెప్పుడూ వెళ్లలేదు. కానీ అక్కడి వాళ్లు నా సినిమాలు చూస్తున్నారు. వాళ్లని కూడా కలసినట్టు ఉంటుందని ఇలా ప్లానేశాం.

‘అర్జున్‌‌రెడ్డి’ షూటింగ్ సమయంలో ఈ కథ విన్నాను. నచ్చింది. సినిమాలో ప్రతి సీన్, ప్రతి డైలాగ్ బాగుంటుంది. థియేటర్ నుంచి ఒక ఆలోచనని, ఎమోషన్‌‌ని ఇంటికి తీసుకెళ్తారు.

బాబి స్టూడెంట్ యూనియన్ లీడర్.  చిన్నప్పటి నుంచి అగ్రెసివ్. తనకు నచ్చినదాని గురించి పోరాడే వ్యక్తి. అతని తాత కామ్రేడ్ సూర్యం. ఆ ప్రిన్సిపుల్స్, యాటిట్యుడ్ ఇతనికీ ఉంటాయి. ఇక లిల్లీ రాష్ట్రస్థాయి క్రికెట్ ప్లేయర్. బాబి, లిల్లీ ఐదేళ్ల జర్నీనే ఈ సినిమా. అతని జీవితంలోకి ఆమె వచ్చాక ఒకరి జీవితంపై మరొకరి ప్రభావం ఎలాంటి పరిణామాలకు దారితీసింది అనేది అసలు కథ. ప్రతి అబ్బాయి బాబి కాదు, కానీ ప్రతి అమ్మాయి లిల్లీనే. నాకు తెలిసిన పదిమంది అమ్మాయిల్లో తొమ్మిది మంది లైఫ్ ఇలాగే ఉంటుంది.

తెలుగు సినిమాగానే ప్రారంభించాం. యాభై శాతం అయ్యాక ఈ కంటెంట్ అందరికీ నచ్చుతుంది కనుక ఇతర భాషల్లోకీ డబ్ చేయాలనుకున్నాం. నాలుగు భాషల్లో విడుదలవుతోన్న తొలి తెలుగు చిత్రమిది. నేను తెలుగులో మాత్రమే డబ్బింగ్ చెప్పాను.

స్టోరీ ఎక్సైటింగ్​గా అనిపిస్తే హిందీలోనూ నటిస్తా. కానీ ఇక్కడి నుంచి నేషనల్ వైడ్‌‌గా షేక్ చేయడమే మజా. అర్జున్‌‌రెడ్డి, బాహుబలి, కేజీఎఫ్ అలా మెప్పించాయి. ఇప్పుడు సాహో కూడా వస్తోంది. మణిరత్నం, శంకర్ లాంటి వాళ్లు ఎప్పుడో దీన్ని ప్రూవ్ చేశారు.

ఈ మూవీ హిందీ రీమేక్ రైట్స్ అడుగుతున్నారు. హీరోగా కూడా నన్నే చేయమంటారేమో. కానీ ఒకసారి నటించిన సినిమాలో మళ్లీ నటించను. సేమ్ స్టోరీ మళ్లీ చెప్పడం ఎందుకు! చాలా స్టోరీస్ ఉన్నాయి. ‘కబీర్ సింగ్’ తెరకెక్కిన సమయంలో నేను ఇక్కడ నాలుగు వైవిధ్యమైన సినిమాలు చేశాను.

నటుడిగా నాపై ఓ బాధ్యత ఉందని అప్పుడప్పుడు  అనిపిస్తుంది. వెంటనే ఈ బాధ్యతలు వద్దు.. నచ్చింది చేసుకుపోదాం అనుకుంటాను. నాకు నచ్చిన పని చేస్తాను. రిజల్ట్ పట్టించుకోను. స్క్రిప్ట్ విషయంలో ‘అర్జున్‌‌రెడ్డి’కి ముందెలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను.

ఇమేజ్, క్రేజ్‌‌ని దృష్టిలో ఉంచుకుని స్క్రిప్ట్ ను మార్చలేం. కానీ ఎలాంటి చిత్రాలు చేయాలన్నది మాత్రం మార్చగలం. ‘అర్జున్‌‌రెడ్డి’ సమయంలో ఒక స్క్రిప్ట్ విన్నాను. నచ్చింది. వాళ్లు కొత్తవాళ్లు. కానీ రిలీజ్ తర్వాత నేను ఆ సమయంలో ఆ చిత్రం చేయడం కరెక్ట్ కాదనిపించింది. కానీ ఆ కథ మీద, అది చెప్పిన వాళ్లపైనా ఇప్పటికీ నమ్మకముంది.

ఇమేజ్ అనేది ఇమాజినరీ. నిజం కాదు. ఒక్కోసారి అది ఒక్క రోజులో మారిపోవచ్చు. అందుకే దాని గురించి ఆలోచించను.

క్రాంతి మాధవ్ చిత్రం తర్వాత కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నాను. స్టోరీ ఐడియా నచ్చింది. మైత్రి సంస్థలోనే ఉండబోతోంది. త్వరలో పూర్తి వివరాలను ప్రకటిస్తాం.