మాల్యాకు యూకే హైకోర్టు షాక్.. ఆస్తుల స్వాధీనానికి లైన్ క్లియర్ 

మాల్యాకు యూకే హైకోర్టు షాక్.. ఆస్తుల స్వాధీనానికి లైన్ క్లియర్ 

లండన్: భారత్‌లోని బ్యాంకుల నుంచి వేలాది కోట్ల రుణాలు తీసుకొని పరారైన బిజినెస్‌మెన్ విజయ్ మాల్యాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాల్యా దివాలాకోరు అని ప్రకటించి యూకే హైకోర్టు ఆయనకు షాక్ ఇచ్చింది. ఈ తీర్పుతో ప్రపంచంలో మాల్యాకు ఎక్కడ ఆస్తులు ఉన్నా వాటిని స్తంభింపజేసి తమ బకాయిలను రాబట్టుకొనేలా ఉత్తర్వులు పొందేందుకు భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ)  నేతృత్వంలోని 13 బ్యాంకుల కన్సార్షియంకు మార్గం సుగమమైంది. 

రూ.6 వేల కోట్ల అప్పుకు రూ.14 వేల కోట్లు జప్తు చేస్తారా?
బ్రిటిష్ హైకోర్టు తాజా ఉత్తర్వులతో మాల్యా స్థిర, చరాస్తులను స్వాధీనం చేసుకుని వాటి వేలం ద్వారా బ్యాంకులు తమ రుణాలను జమ చేసుకోవచ్చు. దీంతో ఆయనపై పోరాటం చేస్తున్న బ్యాంకులకు ఊరటను అందించే విజయం లభించింది. బకాయిలు చెల్లించే స్థితిలో మాల్యా ఉన్నారనేందుకు తగిన ఆధారాలు లేవని బ్రిటిష్ కోర్టు స్పష్టం చేసింది. అలాగే ఉత్తర్వుపై అప్పీలు చేసే చాన్స్‌ను తోసిపుచ్చింది. ఈ విషయంపై మాల్యా సీరియస్ అయ్యాడు. భారతీయ బ్యాంకులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బ్యాంకుల నుంచి తాను చేసిన అప్పుకు రెట్టింపు ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుందన్నారు. ఈడీకి సొమ్ము తిరిగి ఇవ్వాల్సి వస్తుందన్న భయంతోనే.. తనను దివాలాకోరుగా ప్రకటించమని బ్యాంకులు కోర్టును కోరాయని ఆరోపించారు. తాను బ్యాంకుల నుంచి రూ.6.2 వేల కోట్లు తీసుకున్నానని.. ఇందుకు ఈడీ రూ.14 వేల కోట్ల విలువైన తన ఆస్తులను జప్తు చేసుకుందన్నారు.