లండన్ కోర్టులో విజయ్ మాల్యాకు చుక్కెదురు

V6 Velugu Posted on Jan 19, 2022

లండన్: భారత్ లో బ్యాంకులకు రుణాలు ఎగవేసి బ్రిటన్ కు పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో చుక్కెదురైంది. లండన్ లోని ఆయన నివాసాన్ని స్వాధీనం చేసుకునేందుకు స్విస్ బ్యాంక్ యూబీఎస్ కు న్యాయస్థానం మార్గం సుగమం చేసింది. 78/19 కార్నవాల్ టెరాస్ అనే ఈ అపార్ట్ మెంట్ లక్షల పౌండ్ల విలువ చేస్తుంది. ఇందులో ప్రస్తుతం మాల్యా తల్లి లలిత నివాసం ఉంటున్నారు. మాల్యాకు చెందిన రోజ్ క్యాపిటల్ వెంచర్స్ సంస్థ అపార్ట్ మెంట్ ను తనఖా పెట్టి, యూబీఎస్ నుంచి రుణ తీసుకుని తిరిగి చెల్లించలేదు. 2020 ఏప్రిల్ 30లోగా రుణాన్ని తిరిగి చెల్లించాలని 2019 మేలో కోర్టు ఆదేశించింది. అప్పటి వరకూ ఆ అపార్ట్ మెంట్ ను మాల్యా కుటుంబసభ్యులు తమ స్వాధీనంలోనే ఉంచుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే ఆ గడువులోపు మాల్యా ఈ బాకీ తీర్చలేదు. ఈలోగా కొవిడ్ నిబంధనల వల్ల కోర్టు తీర్పు అమలుకు న్యాయపరంగా యూబీఎస్ చర్యలు తీసుకోలేకపోయింది. 

ఎట్టకేలకు గతేడాది అక్టోబర్ లో న్యాయస్థానం ఆదేశాల అమలుకు యూబీఎస్ విజ్ఞప్తి చేసింది. దీంతో ఉత్తర్వులపై స్టే విధించాలని మాల్యా కోర్టును ఆశ్రయించారు. రుణాలు తిరిగి చెల్లించకుండా.. బ్యాంకు తనకు అనేక అవరోధాలు సృష్టించిందని ఆరోపించారు. ఆయన వాదనలను హైకోర్టులోని చాన్సరీ విభాగం న్యాయమూర్తి మథ్యూ మార్ష్ తోసిపుచ్చారు. మాల్యా కుటుంబానికి మరింత గడువు ఇవ్వడానికి ఎలాంటి అవకాశం కనిపించట్లేదని పిటిషన్ కొట్టివేశారు.

మరిన్ని వార్తల కోసం: 

టీనేజర్లకు కొవాగ్జిన్ మాత్రమే ఇవ్వాలె

మీ హామీలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నరు

తెలంగాణ సీఈవో శశాంక్ గోయల్ బదిలీ

Tagged Vijay Mallya, London court, swiss bank, UBS, Mathew Marsh

Latest Videos

Subscribe Now

More News