అసెంబ్లీలో బలపరీక్షకు ముందు కీలక పరిణామం.. అన్నాడీఎంకే చీలిక వర్గంతో విజయ్ భేటీ..!

అసెంబ్లీలో బలపరీక్షకు ముందు కీలక పరిణామం.. అన్నాడీఎంకే చీలిక వర్గంతో విజయ్ భేటీ..!

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీలో బల పరీక్షకు ముందు అన్నాడీఎంకే చీలిక వర్గం ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ భేటీ అయ్యారు. మంగళవారం (మే 12) అన్నాడీఎంకే తిరుగుబాటు నాయకులైన సీవీ. షణ్ముగం, ఎస్‎పీ వేలుమణిలతో సమావేశమైన విజయ్ వివిధ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా బలపరీక్షలో మద్దతు, పదవుల గురించి డిస్కస్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 

అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్‎కు ముందు అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలతో విజయ్ భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. బుధవారం (మే 13) అసెంబ్లీలో జరగనున్న బల పరీక్షలో ఈ 30 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు విజయ్ టీవీకేకు సంపూర్ణ మద్దతు ప్రకటించనున్నారు. దీంతో బలపరీక్షలో విజయ్ ప్రభుత్వం సునాయసంగా గట్టెక్కనుంది.

అన్నాడీఎంకేలో చీలిక ఎందుకంటే..?

2026 తమిళనాడు అసెంబ్లీకల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 మంది స్థానాల్లో విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్ సాధించలేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకు ఇతర పక్షాల మద్దతు అవసరమైంది. ఈ తరుణంలో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‎కు మద్దతు ఇవ్వాలని అన్నాడీఎంకేలోని షణ్ముగం వర్గం డిమాండ్ చేసింది. ఇందుకు పార్టీ చీఫ్ పళనిస్వామి వర్గం ఒప్పుకోలేదు. దీంతో అన్నాడీఎంకే రెండుగా చీలిపోయింది. 

షణ్ముగం వర్గం విజయ్ కు మద్దతు ఇస్తామని బహిరంగంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే అసెంబ్లీలో బలపరీక్షకు ముందు అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ భేటీ అయ్యారు. 2026, మే 13 లోగా అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని విజయ్ కు గవర్నర్ డెడ్ లైన్ విధించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, ఇతర చిన్నా పార్టీల మద్దతుతో టీవీకే ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ రీచ్ కాగా.. అన్నాడీఎంకే 30 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలతో సపోర్ట్ తో ఫ్లోర్ టెస్ట్ లో విజయ్ ఈజీగా పాస్ కానున్నారు.