- శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమలు
హైదరాబాద్, వెలుగు: విజయ డెయిరీ పాల ధరలను పెంచింది. విజయ బ్రాండ్కు చెందిన స్టాండర్డైజ్డ్ మిల్క్, హోల్ మిల్క్ ధరలను లీటరుకు రూ.2 చొప్పున పెంచుతూ డెయిరీ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ నిర్ణయం తీసుకుంది. సవరించిన ధరలు అక్టోబర్16వ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. తాజా ధరల సవరణ ప్రకారం, ప్రస్తుతం అరలీటరు స్టాండర్డైజ్డ్ మిల్క్ ప్యాకెట్ ధర రూ.34 ఉండగా, దానిని రూ.35కు పెంచారు. అలాగే అరలీటరు హోల్ మిల్క్ ప్యాకెట్ ధర రూ.39 నుంచి రూ.40కు పెరిగింది.
ఈ మేరకు అక్టోబర్ 15న డెయిరీ యాజమాన్యం ధరల సవరణ ప్రకటన విడుదల చేసింది. పెరిగిన ధరలు వినియోగదారులతో పాటు పాల విక్రేతలు, పంపిణీదారులు, సంస్థలు, ఆధునిక రిటైల్ మార్కెట్లు, ఈ కామర్స్ సంస్థలకు వర్తించనున్నాయి. తాజా ధరల పెంపుతో విజయ పాలు కొనుగోలు చేసే వినియోగదారులపై లీటరుకు రూ.2 అదనపు భారం పడనుంది.
