దళపతి విజయ్ హీరోగా నటించిన ‘జన నాయగన్’ సినిమా విషయంలో మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. శుక్రవారం (జనవరి 9న) సినిమా నిర్మాతల పక్షాన తీర్పు వెలువడింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి U/A 16+ సర్టిఫికెట్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి జస్టిస్ పీ.టి. ఆశా, రెండు వర్గాల వాదనలు విన్న తర్వాత ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తీర్పుతో సినిమా విడుదలకు అడ్డుగా ఉన్న ప్రధాన సమస్య తొలగిపోయింది. ఈ క్రమంలో జన నాయగన్ విడుదలను ఇక ఎవ్వరూ ఆపలేరని క్లారిటీ ఇచ్చింది కోర్ట్. అయితే, మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించాల్సి ఉంది.
సెన్సార్ బోర్డు అభ్యంతరాలపై కోర్టు వ్యాఖ్యలు..
సెన్సార్ బోర్డు సభ్యుల్లో ఒకరు చేసిన ఫిర్యాదు తరువాత వచ్చిన ఆలోచనలా (afterthought) ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇలాంటి ఫిర్యాదులను అనుమతిస్తే అది ప్రమాదకరమైన ఉదాహరణగా మారుతుందని, సెన్సార్ ప్రక్రియలో స్థిరత్వం, బాధ్యత చాలా అవసరమని కోర్టు స్పష్టం చేసింది.
విడుదల ఎందుకు ఆలస్యం అయ్యింది?
సినిమాలోని కొన్ని అంశాలపై ఒక CBFC సభ్యుడు అభ్యంతరం తెలపడంతో, సర్టిఫికెట్ విడుదల టైంకి ఇస్యూ కాలేదు. ఈ క్రమంలో సినిమా విడుదల వాయిదా పడింది. అప్పటికే భారత్‌తో పాటు విదేశాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కావడం వల్ల నిర్మాతలు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.
ఆర్థిక నష్టాలు
ఈ ఆలస్యం కారణంగా, ముఖ్యంగా విదేశీ డిస్ట్రిబ్యూటర్లకు భారీ ఆర్థిక నష్టాలు వాటిల్లాయి. వేలాది షోలను రద్దు చేయాల్సి వచ్చి, టికెట్ రీఫండ్లు ఇవ్వాల్సి వచ్చింది. బుధవారం వరకు బుక్‌మైషో వేదికగా దాదాపు 4.50 లక్షల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో అమ్ముడైనట్లు సమాచారం. పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం, దాదాపు రూ.50 కోట్ల వరకు నష్టం వాటిల్లే నష్టాలు వచ్చాయని సమాచారం.
విడుదల తేదీ ఎప్పుడు?
కోర్టు తీర్పు వచ్చినప్పటికీ, నిర్మాతలు ఇంకా కొత్త విడుదల తేదీని ప్రకటించలేదు. అయితే, జనవరి 14 (పొంగల్ పండుగ) సందర్భంగా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని టాక్. చూడాలి మరి ఏమవుతుందో!
‘జన నాయగన్’ సెన్సార్ వివాదం.. అసలేం జరిగింది?
డిసెంబర్ 19న ‘జన నాయగన్’ సినిమాను, నిర్మాతలు సెన్సార్‌కు సమర్పించారు. పరిశీలన అనంతరం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సినిమాపై 27కు పైగా కట్స్ సూచించడంతో పాటు, కొన్ని అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
నిర్మాతలు సూచించిన అన్ని కట్స్‌ను అమలు చేసినప్పటికీ, CBFC సినిమా సర్టిఫికెట్‌ను జారీ చేయలేదు. అంతేకాకుండా, సినిమాను ఎగ్జామినింగ్ కమిటీకి రిఫర్ చేసింది. ఆ కమిటీ సినిమా వీక్షించి, మరికొన్ని అదనపు కట్స్‌ను సూచించింది. నిర్మాతలు వెంటనే అవి కూడా అమలు చేశారు.
అయినప్పటికీ, CBFC నుంచి సెన్సార్ సర్టిఫికెట్ విడుదల కాలేదు. ఈ అనూహ్య జాప్యం కారణంగా, సినిమా థియేట్రికల్ రిలీజ్ పూర్తిగా నిలిచిపోయింది. ఇప్పటికే షెడ్యూల్ అయిన షోలను రద్దు చేయాల్సి వచ్చి, ముందుగానే బుక్ చేసిన టికెట్లకు రిఫండ్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ పరిణామాల నేపథ్యంలో, నిర్మాతలు న్యాయం కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా, సినిమాను రివైజింగ్ కమిటీకి ఎందుకు పంపాల్సి వచ్చిందనే అంశంపై మద్రాస్ హైకోర్టు CBFCను ప్రశ్నించింది. అలాగే, సెన్సార్ ప్రక్రియలో నిబంధనలు సక్రమంగా పాటించారా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, ‘జన నాయగన్’ సినిమా విడుదలపై కీలకమైన తీర్పును మద్రాస్ హైకోర్టు శుక్రవారం (జనవరి 9న) వెల్లడించింది.
