వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా అడవుల్లో జనవరి 20న ప్రారంభమైన జంతు గణన ఆదివారంతో ముగిసింది. దాదాపు 40 మంది వాలంటీర్లు అటవీ సిబ్బందితో కలిసి పేపర్ ఉపయోగించకుండా మొబైల్ అప్లికేషన్ద్వారా ఆరు రోజులపాటు అటవీ ప్రాంతాల్లో జంతు గణన పూర్తి చేశారు. జంతు గణనలో పాల్గొన్న వాలంటీర్లకు ఆదివారం అనంతగిరి ఫారెస్ట్ గెస్ట్ హౌజ్‌లో జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్ సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో 2021 వన్య జంతు గణన చేపట్టామని, మళ్లీ ఇప్పుడు గణన చేసినట్లు తెలిపారు. అప్పటికి ఇప్పటికి వికారాబాద్ జిల్లా అటవీ సాంద్రత 2 నుంచి 3 శాతం పెరిగినట్లు తెలుస్తుందన్నారు. గణనకు సంబంధించిన రిపోర్ట్ రెండు నెలల్లో వస్తుందన్నారు.
వికారాబాద్ జిల్లాలో సాధారణంగా మచ్చల జింక, సాంబార్ డీర్, కృష్ణ జింక, నీల్ గాయి, కొండ గొర్రె, అడవి పందులు, నక్క, తోడేలు, అడవి కుక్కలు, ముంగీసలు ఎక్కువగా ఉన్నాయన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా, కర్నాటకలోని చించోలి వైల్డ్‌లైఫ్ సాంక్చురీ నుంచి వికారాబాద్ జిల్లా అడవులలోకి చిరుతలు కూడా సాధారణంగా వచ్చిపోతుంటాయని తెలిపారు. గతేడాది తాండూర్ ప్రాంతంలో ఎలుగుబంటి తిరిగిన ఆనవాలు కనిపించాయని వివరించారు.
