ఈ ఏడాది మస్తుగా వానలు ఫుల్లుగా పంటలు

ఈ ఏడాది మస్తుగా వానలు ఫుల్లుగా పంటలు
  • కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుంది
  • ధార్మికుడు దేశానికి రాజవుతాడు
  • నిత్యావసర వస్తు వుల ధరలు పెరుగుతాయి
  • అందుబాటులోకి బంగారం ధర
  • రాష్ట్ర ప్రభుత్వ ఉగాది వేడుకల్లో పంచాంగ పండితుడు

ఈ వికారి నామ సంవత్సరానికి శనీశ్వరుడు రాజు కావడంతో అనుకూలంగా వానలు పడుతాయని,పంటలు బాగా పండుతాయని శృంగేరి పీఠ ఆస్థాన విద్వాంసుడు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి తెలిపారు. దేశంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని, ధార్మికుడు, దేశభక్తుడు, దైవభక్తి కలవాడు దేశానికి రాజవుతాడని చెప్పారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన వికారి నామ ఉగాది వేడుకల్లో ఆయన పంచాంగ పఠనం నిర్వహించారు. కొద్దిగా రాజకీయ సంక్షోభం ఏర్పడినా , సహచరుల వ్యతిరేకత ఉన్నా.. వాటిని రాజు అధిగమించి ప్రజలకు మంచి పాలన అందిస్తాడని పేర్కొన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుందన్నారు. సాంకేతిక, వైద్య, విద్యా రంగాల్లో ప్రపంచంలో మన దేశం సమున్నత స్థానం పొందుతుందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా మన దేశ గౌరవప్రతిష్టలు పెరుగుతాయని తెలిపారు. పొరుగుదేశాలతో వ్యతిరేకత ఏర్పడినా , ఎన్నో అలజడులు వచ్చినా .. ఉగ్రవాదం అణచి వేయబడుతుందన్నారు. అనేక ప్రజా సంక్షేమ పథకాలు వస్తాయని తన పంచాంగంలో వివరించారు. ఈ ఏడాది తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో కెల్లా అగ్రగామిగా నిలుస్తుందన్నారు.గురు మహర్దశలో రాష్ట్రం ఆవిర్భవించడం వల్ల ​అభివృద్ధే ధ్యేయంగా రాజు సుపరిపాలనను అందిస్తాడని, ప్రజాస్వామ్య రక్షకుడిగా ప్రజలకు అండగా ఉంటాడని పంచాంగ పండితుడు వివరించా రు. రాష్ట్రం లోని పథకాలతో ప్రజలకు ప్రయోజనం కలగడంతోపాటు ఇతర రాష్ట్రాలు కూడా వాటిని అనుసరిస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రాన్నిపాలించే రాజు, ప్రధాన కార్యదర్శి నక్షత్ర రాశులు కర్కాటక, ఆశ్లేషలు కావడంతో సుస్థిరమైన పరిపాలన ప్రజలకు అందుతుందని, ఇది ఎంతో ప్రత్యేకమైన అంశమని తెలిపారు. తెలంగాణలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రజలకు సుపరిపాలన అందుతుందని చెప్పారు.

వ్యవసాయం, ఉత్పత్తి పురోభివృద్ధి

నైరుతి రుతు పవనాలు కొద్దిగా ఆలస్యంగా వచ్చినప్పటికీ సకాలంలో వర్షా లు కురుస్తాయని, మంచిగా పంటలు పండుతాయని పంచాంగ పండితుడు వివరించా రు. అక్టోబర్ లో ప్రతికూల వర్షాలు కురుస్తాయని, దాన్ని రైతులు పరిశీలిం చి పంటలు వేసుకోవాలని సూచించారు. పశు పీడ కారణంగా పాల రేట్లు పెరుగుతాయన్నారు. నవంబర్ లో బ్రహ్మపుత్రనదికి పుష్కరాలు వస్తాయని, వ్యవసాయం, ఉత్పత్తి పురోభివృద్ధి సాధిస్తాయని వివరించా రు.

బ్యాంకింగ్ లో సంక్షోభం

దేశవ్యాప్తంగా బ్యాంకింగ్​ రంగంలో సంక్షోభం ఏర్పడుతుందని, షేర్ మార్కెట్​ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుందని, వ్యాపార రంగంలో కొద్ది గా ఒడిదొడుకులు నడుస్తాయని సంతోష్ కుమార్ శాస్త్రి హెచ్చరించా రు. రియల్ ఎస్టేట్​ రంగం అనుకూలంగా ఉంటుందని, గృహ రుణాలు తగ్గు ముఖం పడతాయన్నా రు. మహిళలకు అనుకూలంగా చట్టాలు వస్తాయని తెలిపారు. ఈ వికారి వ్యతిరేక ఫలితాలను ఇస్తుందనే సందేహం పెట్టుకోవద్దని,విశేషమైన, వికాసవంతమైన ఫలితాలను ఇవ్వడానికి ఇది దోహదపడుతుందని వివరించా రు. తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక రంగం, విద్యారంగం పురోభివృద్ధి సా-ధిస్తుందన్నారు. ఉన్నత విద్యాలయాల్లో అరాచక సంఘటనలు జరిగినట్లు వినిపించినా ఉత్తమ విద్యను స్టూడెంట్స్ ​పొందుతారని తెలిపారు. శాంతి భద్రతల పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుందన్నారు. కొద్ది గా ప్రకృతి వైపరీత్యాలు కలగడంతో దీర్ఘకాలిక రోగాలు పీడిస్తాయని, అయితే సమర్థవంతమైన రాజు కారణంగా ప్రభుత్వం సకాలంలో స్పందించి ఆ సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని, బంగారం ధర అందుబాటులో ఉంటుందన్నారు. మొత్తానికి ప్రజలకు అన్ని రకాలుగా శుభమే కలుగుతుందని తెలిపారు.

మంచికి చిహ్నం ఈ ఉగాది: సీఎస్

సమాజంలో అన్ని విధాలుగా మంచి మార్పు నకు వికారి నామ సంవత్సర ఉగాది చిహ్నమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్​కే జోషి అన్నారు. షడ్రుచుల ఉగాది పచ్చడిని స్వీకరించినట్లే జీవితంలో సుఖ సంతోషాలు,కష్టసుఖాలను సమానంగా భావించాలని సూచించా రు. రాష్ట్ర ప్రజలకు అన్ని శుభాలే కలగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర దేవాదాయ ధర్మా దాయ శాఖ కార్యదర్శి అనిల్‌‌కుమార్,వ్యవసాయ, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి, భాషా సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, రాష్ట్ర బీసీ కమిషన్​ చైర్మన్​ బీఎస్​ రాములు తదితరులుపాల్గొన్నారు.