రూ.30 కోట్లకు పైగా ఫ్రాడ్ కేసులో.. డైరెక్టర్తో పాటు ఆయన భార్య అరెస్ట్.. ఏం జరిగిందంటే?

రూ.30 కోట్లకు పైగా ఫ్రాడ్ కేసులో.. డైరెక్టర్తో పాటు ఆయన భార్య అరెస్ట్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్‌ దర్శక నిర్మాత విక్రం భట్ (Vikram Bhatt) అరెస్ట్ అయ్యారు. ఆదివారం (2025 డిసెంబర్ 7న) విక్రం భట్తో సహా ఆయన భార్య శ్వేతాంబరిని సైతం రాజస్థాన్‌ ఉదయ్‌పుర్‌ పోలీసులు అరెస్టు చేశారు. విక్రం భట్, ఆయన భార్య శ్వేతాంబరి భట్, మరో ఆరుగురితో కలిసి.. ఉదయపూర్కు చెందిన ఇందిరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకుడు డాక్టర్ అజయ్ ముర్దియాను (Dr Ajay Murdia) రూ.30 కోట్లకు మోసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో వీరి అరెస్ట్ జరిగింది.

ఈ కేసు విచారణలో భాగంగా ఉదయ్ పూర్ పోలీసులు ముంబై వచ్చి వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో విక్రమ్ భట్ దంపతులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు, వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ట్రాన్సిట్ రిమాండ్ పొందిన తర్వాత వారిని ఉదయ్‌పూర్‌కు తరలించనున్నారు. ఈ కేసులో ఆరుగురు నిందితులకు పోలీసులు గతంలోనే నోటీసులు జారీ చేసి, డిసెంబర్ 8 లోగా హాజరుకావాలని ఆదేశించారు. నోటీసులకు వారు స్పందించకపోవడంతో అరెస్ట్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఉదయ్‌పుర్‌ పోలీసులు ఈ వ్యవహారంపై మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

30 కోట్ల మోసం కేసులో విక్రమ్ భట్ అరెస్టు:

రాజస్థాన్‌ ఉదయపూర్‌లోని భూపాల్‌పురా పోలీస్ స్టేషన్‌లో దాఖలు చేసిన FIR  ప్రకారం, డైరెక్టర్ విక్రమ్ భట్ మరియు అతని బృందం ఒక సినిమా ప్రాజెక్ట్‌లో రూ.30 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టమని తనను ఆకర్షించారని డాక్టర్ ముర్దియా ఆరోపించాడు. ఈ క్రమంలో విక్రం భట్ దంపతులని ఉదయపూర్ పోలీసులు అరెస్ట్ చేసి డిసెంబర్ 9 వరకు ట్రాన్సిట్ రిమాండ్ విధించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఇందిరా IVF హాస్పిటల్ యజమాని అయిన మర్దియా.. తన దివంగత భార్యపై బయోపిక్ తీయాలని విక్రం భట్‌ను సంప్రదించారు. ఈ క్రమంలో రూ.47 కోట్లు పెట్టుబడి పెడితే.. 4 సినిమాలు చేస్తానని.. ఫలితంగా దాదాపు రూ.100-200 కోట్ల లాభం వస్తుందని భట్ హామీ ఇచ్చారని ముర్దియా ఆరోపించారు. అయితే, రూ.30 కోట్లు తీసుకుని రెండు కంప్లీట్ చేశారని.. మిగిలినవి తీయలేదు. ఈ క్రమంలో మర్దియా కంప్లైంట్ చేసినట్లు ’ పోలీసులు వెల్లడించారు.

రాజస్థాన్ పోలీసులు సరైన అనుమతి లేకుండానే తమ ఇద్దరినీ అరెస్టు చేశారని, తేదీ, సమయం లేని పత్రంపై సంతకం చేయమని బలవంతం చేశారని విక్రమ్ భట్ దంపతుల న్యాయవాదులు - రాకేష్ సింగ్ మరియు సంజయ్ సింగ్ ఆరోపించారు. మరి ఈ కేసు తదుపరి విచారణలో ఎలాంటి విషయాలు బయటకొస్తాయో తెలియాల్సి ఉంది. 

ఆరోపణలను ఖండించిన విక్రమ్ భట్:

తనపై మోపబడ్డ ఈ ఆరోపణలపై డైరెక్టర్ విక్రమ్ భట్ రియాక్ట్ అయ్యారు. మీడియాతో మాట్లాడుతూ, తనపై నమోదైన FIR పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉందని, అందులోని ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. పోలీసులను నమ్మించడానికి నకిలీ పత్రాలు సృష్టించి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

అయితే, మొదట ‘విరాట్’ అనే మూవీని డాక్టర్ అజయ్ ముర్దియానే సడెన్ గా ఆపేశారని, సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లకు కూడా ఇంకా రూ.250 కోట్లు చెల్లించాల్సి ఉందని విక్రమ్ ఆరోపించారు. ఆ బకాయిలు ఎగ్గొట్టేందుకే ఈ FIR నమోదు చేయించారని ఆయన మీడియాతో చెప్పుకున్నారు.

ఈ క్రమంలో తాను పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని, తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను పోలీసులకు చూపిస్తానని, అప్పుడు మాత్రమే అసలైన నిజానిజాలు బయటపడతాయని విక్రమ్ భట్ వెల్లడించారు.

డైరెక్టర్ విక్రమ్ భట్ సినిమాలు:

దర్శకుడు విక్రమ్ భట్, నిర్మాత, స్క్రీన్ రైటర్ మరియు నటుడుగా మంచి గుర్తింపు పొందారు. హర్రర్ సిరీస్ 'రాజ్' మరియు ఆమిర్ ఖాన్ మరియు రాణి ముఖర్జీ నటించిన గులామ్ (1998) చిత్రాలని డైరెక్ట్ చేయడం ద్వారా ఆయన బాగా ఫెమస్ అయ్యారు. ఈ రెండు చిత్రాలకు గానూ, ఆయన ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత ఎన్నో సినిమాలను హార్రర్ జానర్లో తెరకెక్కించి మంచి గుర్తింపు పొందారు. అందులో కసూర్, డేంజరస్ ఇష్క్, రాజ్ 3D, జీవి 3D, 1921 మూవీ, దెయ్యం, 2025లో తుమ్కో మేరీ కసమ్ వంటి చిత్రాలను డైరెక్ట్ చేశాడు. ప్రస్తుతం 'హాంటెడ్ 3D: గోస్ట్స్ ఆఫ్ ది పాస్ట్' ని తెరకెక్కిస్తున్నారు.