ఐటీ కారిడార్ చుట్టూ విల్లా లేదా ఫ్లాట్ 

ఐటీ కారిడార్ చుట్టూ విల్లా లేదా ఫ్లాట్ 
  • 20-30 కి.మీ లోపు వాటిని కొనాలని చూస్తున్న సిటిజన్లు

మాదాపూర్, వెలుగు: ప్రతి ఒక్కరూ తమకంటూ సొంతిల్లు ఉండాలని కోరుకుంటారు. ఆ కలను నిజం చేసుకునేందుకు కష్టపడుతుంటారు. ఇలా సిటీలో ఇల్లు తీసుకునేందుకు ఆలోచిస్తున్న వారి కోసం క్రెడాయ్(కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) హైటెక్స్ లో ప్రతి ఒక్కరికి ఇల్లు కాన్సెప్ట్ తో మూడు రోజుల పాటు ప్రాపర్టీ షో నిర్వహించింది. ఆదివారం ముగిసిన ఈ షోకు మంచి స్పందన వచ్చింది. సిటీ నలుమూలల ఉన్న ఫైనాన్షియల్​ఇనిస్టిట్యూషన్లు, డెవలపర్లు, మెటీరియల్ ​వెండర్లు స్టాల్స్ ఏర్పాటు చేయగా సిటిజన్లు  ఉత్సాహంగా పాల్గొన్నారు. విల్లాలు, అపార్ట్​మెంట్ ఫ్లాట్స్, ప్లాట్ల రేట్లు, ఎక్కడెక్కడ ఎంత ఉన్నాయో తెలుసుకున్నారు. దాదాపు అంతా ఐటీ కారిడార్​కు 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఇల్లు తీసుకునేందుకు ప్లాన్ ​చేసుకుంటున్నారని డెవలపర్లు తెలిపారు. సాఫ్ట్ వేర్ కంపెనీలన్నీ గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్​ ప్రాంతాల్లోనే ఉన్నాయి. దీంతో ఐటీ ఉద్యోగులు ఎక్కువగా వీటి సమీపంలోనే అపార్ట్​మెంట్స్ లేదా విల్లాల కోసం వెతుకుతున్నారు. 

ఔటర్​ లోపల విల్లా..

ఐటీ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు ఎక్కువగా విల్లాలు తీసుకునేందుకు ఇంట్రెస్ట్​గా ఉన్నారు. ఔటర్​ రింగ్ రోడ్డు లోపల నిర్మించిన వాటిని కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. విల్లాకు రూ.1.2 కోట్ల నుంచి 2 కోట్ల వరకు పెట్టేందుకు రెడీగా ఉన్నారు. వ్యాపారవేత్తలు రూ.5 కోట్ల వరకు వెచ్చించేందుకు చూస్తున్నారని డెవలపర్లు చెప్పారు. 

3 బెడ్రూంల ఫ్లాట్లు.. 

మధ్య తరగతి కుటుంబాలు, ఐటీ ఉద్యోగులు అపార్ట్​మెంట్లలో ఫ్లాట్స్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనూ త్రిబుల్ బెడ్రూం ఫ్లాట్​ కొనాలని చూస్తున్నారు. ఎక్కువగా గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్​పల్లి ఏరియాల్లోని ఫ్లాట్స్​కి డిమాండ్ ఉంది. ఏరియాను బట్టి త్రిబుల్​ బెడ్రూం ఫ్లాట్ కోసం రూ.80 లక్షల నుంచి కోటి 20 లక్షల వరకు ఖర్చు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 

గేటెడ్ కమ్యూనిటీలో కొనాలనుకుంటున్న

గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కోసం చూస్తున్నం. అపార్ట్ మెంట్లు, వాటిలోని ఫ్లాట్ల రేట్లు ఏ ఏరియాల్లో ఎంత ఉన్నాయో ప్రాపర్టీ షో ద్వారా తెలుసుకున్నాం. ఎక్కడ కొనుగోలు చేస్తే బాగుంటుందో, బ్యాంక్ లోన్​ ప్రాసెస్​ఎలా అనేది పూర్తిగా తెలిసింది.
- వివేక్​ వర్మ, అమీర్​పేట

నిర్మాణ రంగంపై ప్రభావం తక్కువే 

మెటీరియల్ కాస్ట్ పెరిగినా నిర్మాణ రంగంపై ప్రభావం తక్కువగానే ఉంది. జనం సిటీలో సొంతిల్లు ఉండేలా ప్లాన్ ​చేసుకుంటున్నారు. ప్రస్తుతం విల్లాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ప్రాపర్టీ షోకు వచ్చిన వారిలో 60 శాతం విల్లాస్ కావాలని, 40 శాతం మంది అపార్ట్​మెంట్లలోని ఫ్లాట్స్ కావాలని అడుగుతున్నారు. రేట్లు కూడా  కస్టమర్లకు అనుకూలంగానే ఉన్నాయి.
- ఇమ్రాన్ అలీ, మార్కెటింగ్ హెడ్​, వర్టెక్స్ కంపెనీ